
వాటికన్ సిటీ: నూతన పోప్ ఎన్నిక ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. మే 7వ తేదీన వాటికన్ సిటీలోని సిస్టిన్ చాపెల్‌లో జరిగే కార్యక్రమంలో రహస్య ఓటింగ్ జరగనుంది. ప్రపంచ దేశాల నుంచి తరలిరానున్న సుమారు 135 కార్డినల్స్ ఈ ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు. దాదాపు 12 ఏళ్లపాటు కేథలిక్కుల మత పెద్దగా కొనసాగిన పోప్ ఫ్రాన్సిస్ ఈ నెల 21వ తేదీన కన్నుమూయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
పోప్ ఎన్నిక ప్రక్రియ ఎన్ని రోజులు కొనసాగుతుందనే విషయంలో స్పష్టత లేదు. గతంలో 2005, 2013ల్లో రెండు రోజుల వ్యవధిలోనే తదుపరి పోప్ ఎవరనే విషయం తేలిపోయింది. మే 7వ తేదీన కార్డినల్స్ ముందుగా సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగే సామూహిక ప్రార్థనల్లో పాల్గొంటారని, అనంతరం ఓటింగ్‌కు అర్హులైన వారంతా సిస్టిన్ చాపెల్ రహస్య విధానంలో జరిగే ఓటింగ్‌లో పాల్గొంటారని వాటికన్ ప్రతినిధి మాటియో బ్రునీ చెప్పారు.
లోపలికి వెళ్లిన వారికి నూతన పోప్ ఎన్నికయ్యే వరకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలుండవు. మొదటి రోజు మధ్యాహ్నం జరిగే ఓటింగ్‌లో కార్డినల్స్ ఒకే ఒక్కసారి ఓటేస్తారు. ఫలితం తేలకుంటే తర్వాత రోజుల్లో నాలుగుసార్లు చొప్పున ఓటేయాల్సి ఉంటుంది. మూడింట రెండొంతుల మెజారిటీ ఓట్లు సాధించిన వారే నూతన పోప్ అవుతారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. మూడో రోజూ ఫలితం తేలకుంటే ప్రార్థనల కోసం విరామమిచ్చి మరోసారి ఓటింగ్ ప్రక్రియ చేపడతారు. ఎన్నిక నేపథ్యంలో సోమవారం పర్యాటకులను బయటకు పంపించేసి వాటికన్ అధికారులు సిస్టిన్ చాపెల్‌కు తాళాలు వేశారు.