మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్
నోబెల్ బహుమతి గ్రహీత మదర్ థెరిసాకు పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్‌ను ప్రకటించనున్నారు. 2016 సంవత్సరంలో ఆమెను సెయింట్‌గా ప్రకటించేందుకు పోప్ ఫ్రాన్సిస్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అనాథలకు, వృద్ధులకు అందించిన అపురూపమైన సేవలతో ప్రపంచ శాంతిదూతగా పేరొందిన థెరిస్సా ఇక దైవదూతగా అవతరించనున్నారు.
మదర్ థెరిస్సా శక్తులు అద్భుతమని ఫ్రాన్సిస్ కొనియాడినట్లు ఇటలీకి చెందిన క్యాథలిక్ పత్రిక అవినైర్ ప్రచురించింది. ప్రాణాంతక మెదడు వ్యాధితో బాధపడుతున్న ఓ బ్రెజిల్ వ్యక్తిని మదర్ థెరిస్సా తన అద్భుత దివ్యశక్తితో దీవించినట్లు పోప్ పేర్కొన్నారు. తద్వారా ఆమెకు అద్భుతమైన దైవశక్తి ఉన్నట్టుగా అంగీకరించినట్టు తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరిగే కార్యక్రమంలో మదర్ థెరిస్సాకు సెయింట్ వుడ్ హోదా అధికారికంగా ప్రకటిస్తారు.
వాటికన్ సిటీ నిర్ణయంపై వివిధ క్రిష్టియన్ మత సంస్థలు, మత పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు. క్రైస్తవ మిషనరీస్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మదర్ థెరిసా రోమన్ క్యాథలిక్ కేంద్రమైన వాటికన్ నుంచి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ' స్థాపనకు అనుమతి పొందారు. రోమన్ క్యాథలిక్ వ్యవస్థకు అనుబంధంగా ఉంటూ, స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ' ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తన సేవలందించారు.