సెయింట్ థెరిసా!
కన్నపేగు తల్లడిల్లుతుంటే ఏ అమ్మ మనసైనా చివుక్కుమంటుంది. ఆ బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుని లాలిస్తుంది...ఊరడిస్తుంది...బుజ్జగిస్తుంది. పేగు బంధం గొప్పతనమది. అలాంటి మాతృత్వపు పరిమాళాన్ని సమాజంలో లక్షలాదిమందికి పంచడం మాత్రమే కాదు...ఆ విషయంలో ఎందరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచి కనుమరుగైన మదర్ థెరిసాకు సెయింట్‌హుడ్ ఇస్తున్నట్టు మంగళవారం ప్రకటన వెలువడింది. వాటికన్ మతాచార్యుడు పోప్ ఫ్రాన్సిస్ చేసిన ఈ ప్రకటన కోసమే దేశదేశాల్లోని కోట్లాదిమంది ఆమె అభిమానులు చిరకాలంగా నిరీక్షిస్తు న్నారు.
2003లో ఆనాటి పోప్ జాన్‌పాల్ 2 మదర్‌కు సెయింట్ హోదా ఇచ్చే ప్రక్రి యను ప్రారంభించామని ప్రకటించినప్పుడు ఈ నిరీక్షణ మొదలైంది. రోగగ్ర స్తులకు సేవలందించడానికి, పేద హృదయాలను ఊరడించడానికి, అనాథలకు నీడై నిలవడానికి సరిహద్దులు అడ్డురావని నిరూపించిన ప్రేమమయి ఆమె. ఈ ప్రస్థానంలో సెయింట్‌హుడ్ అనేది ఒక సంప్రదాయకమైన లాంఛనమే కావొచ్చు. ఒక మతంలో లభించే ఉత్కృష్టమైన గౌరవమే కావొచ్చు. కానీ ఆమె చేసిన సేవలకూ, ఆమె స్థాపించిన విలువలకూ, ఆమె నెలకొల్పిన ఆదర్శాలకూ ఏమి చ్చినా తక్కువే అవుతుంది.
ప్రపంచం కూటములుగా మారడం, పరస్పర పోటీ పెరగడం, దేశాలమధ్య విద్వేషాలు రాజుకోవడం, అవి ముదిరి యుద్ధాలుగా రూపాంతరం చెందడంవంటి పరిణామాలవల్ల సమాజాలు సంక్షోభంలో కూరుకుపోతాయి. మానవ పరిణామ క్రమంలో రెండు ప్రపంచ యుద్ధాలు సృష్టించిన విధ్వంసం అసాధారణమైనది. ఆ యుద్ధాల పర్యవసానాలు అతి భయంకరమైనవి. ఎంతో వినాశనాన్ని తీసుకొచ్చిన మొదటి ప్రపంచ యుద్ధమే మదర్ థెరిసా లాంటి గొప్ప మానవతామూర్తిని అందించిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ యుద్ధం జనజీవితాల్లో కలిగించిన సంక్షోభాన్ని, అందువల్ల చుట్టూ ఉన్నవారు పడుతున్న ఇబ్బందులనూ, క్షతగాత్రుల రోదనలనూ, వేదనలనూ పసి వయసులో అప్పటికి అంజెజె గోన్క్సే బొజాక్షిహుగా ఉన్న మదర్‌ను తల్లడిల్లజేశాయి. సమాజంలోని అసహాయులకు ఏదో ఒకటి చేయా లని, వారికి అండగా నిలవాలని అప్పుడే ఆమె నిర్ణయించుకున్నారు. వయసు పెరిగేకొద్దీ ఆ భావన మరింతగా బలపడింది. సేవ చేయడానికి నన్‌గా మారడమే మార్గమని పన్నెండేళ్ల ప్రాయంలోనే భావించినా అందుకు వయసు సరిపోదని తెలిసి మరో నాలుగేళ్లు ఆగారామె.
పద్దెనిమిదేళ్ల వయసులో ఇల్లు విడిచి ఐర్లండ్ లోని సిస్టర్స్ ఆఫ్ లోరెటోలో చేరిననాటినుంచి 1997లో కోల్‌కతాలో 87 ఏళ్ల వయ సులో మరణించేవరకూ ఆమె సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే ఉన్నారు. భార త్‌ను భయంకరమైన కరువుకాటకాలు పీడిస్తున్న సమయంలో... పేద జనం రోగాలబారినపడి తల్లడిల్లుతున్న సమయంలో...ఎటుచూసినా దారిద్య్రం తాండ విస్తున్న సమయంలో తన సేవలు ఇక్కడ అవసరమని ఆమె నిర్ణయించుకున్నారు. ఆ సంకల్పంనుంచి ఆమె వెనుదిరగలేదు.
మొదట్లో ఉపాధ్యాయినిగా, అనంతరం ప్రిన్సిపాల్‌గా సేవలందించినా ఆ తర్వాత పూర్తిగా వీధి బాలల, నిరుపేదల, రోగగ్రస్తుల సేవలోనే ఆమె గడిపారు. అందుకవసరమని భావించి వైద్యరంగంలో సైతం శిక్షణపొందారు. వారు కుష్టురోగులైనా, మరే ఇతర అంటువ్యాధితో బాధ పడుతున్నా అక్కున చేర్చుకుని ఆదరించారు. గాయాలను శుభ్రపరచడం, కట్టు కట్టడం దగ్గరనుంచి ఎన్నో సేవలందించి అలాంటివారిలో మానసిక స్థైర్యాన్ని నింపారు. అప్పటి కలకత్తా నగర వీధుల్లో ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యం. ఆరో జుల్లో ఇలాంటి సేవలు అందరినీ ఆశ్చర్యపరిచేవి. ఆ తరహా ఆచరణకు ఎందరినో పురిగొల్పేవి. ఈ క్రమంలో ఆమె కొచ్చిన బిరుదులు, పురస్కారాలు ఎన్నెన్నో!
1962లో పద్మశ్రీ పురస్కారం మొదలుకొని జాతీయంగా, అంతర్జాతీయంగా ఆమె అందుకున్న అవార్డులు అన్నీ ఇన్నీ కాదు. 1979లో నోబెల్ శాంతి బహుమతికి థెరిసాను ఎంపిక చేసినప్పుడు తనకా స్థాయి లేదని తిరస్కరించిన వ్యక్తిత్వం ఆమెది. ఆ తర్వాత ఎందరో బతిమాలగా, ఒత్తిడి తీసుకురాగా ఆ పురస్కారాన్ని అందుకోవడానికి అంగీకరించారు. అవార్డుల ద్వారా లభించే నగదును తన సేవా కార్యక్రమాలకే ఆమె వెచ్చించారు. అలాంటి సొమ్ముతోనే మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్ నెలకొల్పి దాని ఆధ్వర్యంలో అనాథాశ్రమాలనూ, ఆస్పత్రులనూ, ధర్మశాలలనూ, ఆహారకేంద్రాలనూ ఏర్పాటుచేశారు. వేలాదిమందికి ఆరోగ్యం చేకూర్చడంతోపాటు వారికవసరమైన తిండి, బట్ట సమకూర్చారు. తనకు జీసస్‌పై నమ్మకం ఉన్నా దానికి అతీతంగా కుల మతాల ప్రసక్తి లేకుండా ప్రతి ఒక్కరినీ తాను నిర్మించిన నిర్మల్ హృదయ్‌లో చేర్చుకున్న విశాల స్వభావం ఆమెది.
నిత్యం ఈసడింపులు ఎదుర్కొంటూ, ఎన్నో అవమానాలను చవిచూస్తూ బతుకీడ్చేవారికి ఆపన్నహస్తం అందించడం, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపడం సామాన్యమైన విషయం కాదు. ఈ గడ్డపై జన్మించకపోయినా, దూరతీరాలనుంచి ఇక్కడికొచ్చినా ఈ దేశ ప్రజల కష్టాల్లో పాలుపంచుకొని, వారి కన్నీళ్లను తుడవడానికి మదర్ ప్రయత్నించారు. ఆమె సామాజిక సేవలో స్వార్ధమున్నదని, మతాన్ని వ్యాప్తి చేయడానికి దాన్ని సాధనంగా ఉపయోగించుకున్నారని విమర్శించినవారున్నారు. ఇలాంటి సేవా తత్పరత యధాతథ స్థితి కొనసాగటానికి మాత్రమే తోడ్పడుతుందన్నవారున్నారు. కానీ ఎలాంటివారైనా, వారి సిద్ధాంతాలు ఏవైనా... సేవాభావంతోనే జన హృదయాలను గెలవడం సాధ్యమన్న అంశాన్ని గ్రహించగలిగారు.
మదర్ థెరిసా ఈ దేశంలో అడుగిడేనాటికి దాదాపుగా ఉనికిలో లేని స్వచ్ఛంద సంస్థలు ఈరోజు లక్షల్లో ఉండటమే దీనికి తార్కాణం. ప్రభుత్వం దృష్టి సోకని మారుమూల ప్రాంతాల్లో సైతం పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు, అనాథాశ్రమాల వంటివి అంతో ఇంతో చురుగ్గా పనిచేస్తున్నాయంటే అది మదర్ థెరిసా పెట్టిన ఒరవడే. అంతటి మహనీయురాలికి సెయింట్‌హుడ్ లభించడం హర్షించదగింది.