సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్ యువరాజు ఛార్లెస్ దంపతులు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. పది రోజులపాటు సాగే ఆసియా పర్యటనలో భాగంగా ముందుగా ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు భారత్‌లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఛార్లెస్ దంపతులు ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది మార్చిలో యూకేలో జరగబోయే కామన్‌వెల్త్ దేశాధినేతల సమావేశంలో చర్చింబోయే అంశాలతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం సుమారు 12.19 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టే దేశాల్లో భారత్ మూడో అతిపెద్ద దేశం.
అంతేకాకుండా, అక్కడి ఉద్యోగాల కల్పనలో మనవాళ్లు రెండో స్థానంలో ఉన్నారు. అలాగే భారత్‌లో బ్రిటన్ మూడో అతిపెద్ద పెట్టుబడిదారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బ్రిటన్‌లో 1.5 మిలియన్ల మంది భారత సంతతి ప్రజలున్నారు. ఇది ఆ దేశ జనాభాలో 1.8 శాతం కాగా, జీడీపీలో వీరు ఆరు శాతం సమకూర్చుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. కాగా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ ఛార్లెస్ వెంట ఆయన సతీమణి డచెస్ ఆప్ కార్న్‌వాల్ కెమిల్లా పార్కర్ బౌల్స్ ఉన్నారు. ఈ దంపతులు సింగపూర్, బ్రూనై, మలేసియాలో కూడా పర్యటించనున్నారు. ప్రిన్స్ చార్లెస్ భారతదేశ పర్యటనకు రావటం ఇది తొమ్మిదోసారి. ఇంతకుమునుపు ఆయన 1975, 1980, 1991, 1992, 2002, 2006, 2010, 2013లో మన దేశంలో పర్యటించారు.
Comments
Please login to add a commentAdd a comment