Prince of Wales Charles
-
‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’గా కేట్ మిడిల్టన్
లండన్: బ్రిటన్ నూతన రాజు చార్లెస్–3 తన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియమ్స్‌ను ‘ప్రిన్స్ ఆఫ్ వేల్స్’గా, ఆయన భార్య కేట్ మిడిల్టన్ను ‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’గా ప్రకటించారు. అంతేకాకుండా డ్యూక్ ఆఫ్ కార్న్‌వాల్‌గానూ విలియమ్స్ కొనసాగుతారు. ప్రిన్సెస్ డయానా తర్వాత ‘ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ హోదా పొందిన తొలివ్యక్తి కేట్ మిడిల్టన్ కావడం గమనార్హం. డయానా మరణం తర్వాత ఈ హోదా ఇన్నాళ్లూ ఖాళీగానే ఉంది. యునైటెడ్ కింగ్డమ్(యూకే)తోపాటు కామన్వెల్త్ దేశాలకు విధేయుడిగా ఉంటానని, అంకితభావంతో సేవలందిస్తానని కింగ్ చార్లెస్ అన్నారు. బ్రిటన్ రాజు హోదాలో ఆయన శుక్రవారం సాయంత్రం తొలిసారిగా టీవీలో జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రియమైన తల్లి ఎలిజబెత్–2 తనపై అమితమైన ప్రేమ చూపించారని, ఆప్యాయత అందించారని, మార్గదర్శిగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. జీవితాంతంప్రజా సేవలో గడిపారని అన్నారు. ఆమె జీవితం తనకొక ఉదాహరణగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఆమె లోటును తనతోపాటు ఎంతోమంది అనుభవిస్తున్నారన్నారు. రెండో కుమారుడు హ్యారీ, అతడి భార్య మేఘన్‌కు కింగ్ చార్లెస్–3 శుభాకాంక్షలు తెలిపారు. జీవితాలను చక్కగా తీర్చిదిద్దుకుంటున్న వారిద్దరి పట్ల తన ప్రేమను వ్యక్తీకరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హ్యారీ రాచరిక హోదా వదులుకుని భార్యతో పాటు అమెరికాలో ఉంటున్నారు. -
భారత్‌కు బ్రిటన్ యువరాజు ఛార్లెస్ దంపతులు
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్ యువరాజు ఛార్లెస్ దంపతులు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. పది రోజులపాటు సాగే ఆసియా పర్యటనలో భాగంగా ముందుగా ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు భారత్‌లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఛార్లెస్ దంపతులు ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది మార్చిలో యూకేలో జరగబోయే కామన్వెల్త్ దేశాధినేతల సమావేశంలో చర్చింబోయే అంశాలతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం సుమారు 12.19 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టే దేశాల్లో భారత్ మూడో అతిపెద్ద దేశం. అంతేకాకుండా, అక్కడి ఉద్యోగాల కల్పనలో మనవాళ్లు రెండో స్థానంలో ఉన్నారు. అలాగే భారత్‌లో బ్రిటన్ మూడో అతిపెద్ద పెట్టుబడిదారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బ్రిటన్‌లో 1.5 మిలియన్ల మంది భారత సంతతి ప్రజలున్నారు. ఇది ఆ దేశ జనాభాలో 1.8 శాతం కాగా, జీడీపీలో వీరు ఆరు శాతం సమకూర్చుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. కాగా, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ ఛార్లెస్ వెంట ఆయన సతీమణి డచెస్ ఆప్ కార్న్‌వాల్ కెమిల్లా పార్కర్ బౌల్స్ ఉన్నారు. ఈ దంపతులు సింగపూర్, బ్రూనై, మలేసియాలో కూడా పర్యటించనున్నారు. ప్రిన్స్ చార్లెస్ భారతదేశ పర్యటనకు రావటం ఇది తొమ్మిదోసారి. ఇంతకుమునుపు ఆయన 1975, 1980, 1991, 1992, 2002, 2006, 2010, 2013లో మన దేశంలో పర్యటించారు. -
భారత్‌లో చార్లెస్ దంపతులు పర్యటన: భద్రత కట్టుదిట్టం
బ్రిటన్ యువరాజు చార్లెస్, కెమిల్లా పార్కర్ దంపతులు భారత్‌లో తొమ్మిది రోజుల పర్యటనలో భాగంగా నేటి సాయంత్రం డెహ్రాడూన్‌లోని జోలీగ్రాండ్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఉన్నతాధికారులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. వారి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయినట్లు తెలిపారు. చార్లెస్ యువరాజు దంపతుల పర్యటన నేపథ్యంలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. అందుకోసం భారీగా పోలీసుల బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. నరేంద్రనగర్‌లోని ఓ హోటల్లో చార్లెస్ దంపతులకు విడిది ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా చార్లెస్ దంపతులు రిషికేశ్‌లోని పరమత నికేతన్ ఆశ్రమంలో నిర్వహించే హవన్, గంగా హారతి కార్యక్రమంలో పాల్గొంటారని ఉన్నతాధికారులు తెలిపారు. అనంతరం ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ గౌరవార్థం ఇచ్చే విందులో చార్లెస్ దంపతులు పాల్గొనున్నారని చెప్పారు. యువరాజు దంపతుల కోసం నరేంద్రనగర్‌లోని హోటల్లో విడిది చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీ, ఫారెస్ట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, డూన్ స్కూల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో వారు పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం ఇటీవల ఉత్తరాఖండ్‌లో వరదల వల్ల అతలాకుతలమైన ప్రాంతాలలో వారు పర్యటించనున్నారు. భారత్ పర్యటనలో భాగంగా చార్లెస్ దంపతులు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలతో సమావేశం కానున్నారు. అలాగే భారత్ వాణిజ్య రాజధాని ముంబైలో దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చార్లెస్ దంపతులు భేటీ అవుతారు. భారత్‌లో వివిధ ప్రాంతాల్లో వ్యాపారవేత్తలు, సంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖులు, నాయకులను బ్రిటన్ యువరాజు చార్లెస్ దంపతులు కలుసుకుంటారని ఉత్తరాఖండ్ ఉన్నతాధికారులు వివరించారు.