Camilla Technically Becomes Queen But No Sovereign Powers - Sakshi
Sakshi News home page

డయానా ఉసురు ఊరికనే పోతుందా.. ఆమె మహారాణి అయినా ఏం లాభం?

Published Fri, Sep 9 2022 5:14 PM | Last Updated on Fri, Sep 9 2022 6:54 PM

Camilla Technically Becomes Queen But No Sovereign Powers - Sakshi

డచ్చెస్‌ ఆఫ్‌ కార్న్‌వాల్‌ క్యామిల్లా ఇకపై బ్రిటన్‌కు మహారాణిగా వ్యవహరించబోతోంది. అంటే.. ఏడు దశాబ్డాల తర్వాత బ్రిటన్‌కు ఓ కొత్త రాణి రాబోతోందన్నమాట.  భర్త ఛార్లెస్‌ మహారాజు అయినప్పుడు.. ఆటోమేటిక్‌గా ఆమె మహారాణి అవ్వాల్సిందే కదా!. కానీ.. ఇక్కడే క్యామిల్లా కలలో కూడా ఊహించని కొన్ని అభ్యంతరాలతో బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో అడుగుపెట్టబోతోంది. తలపై కీరిటంతో ఉత్త మహారాణి ట్యాగ్‌తో మాత్రం ఇకపై ఆమె జీవించాల్సి ఉంటుంది.

75 ఏళ్ల క్యామిల్లా.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు కొత్త మహారాణి. కానీ, ఆమెకు ఎలాంటి సార్వభౌమాధికారాలు ఉండవు. అదేంటీ.. రాజు భార్యగా మహారాణి హోదాలో ఆమెకు విశేష అధికారాలు ఉండాలి కదా!. నిజమే.. రాణి హోదాలో రాజరికంలోకి అడుగుపెట్టే వాళ్లకు రాజుతో సమానమైన హోదా దక్కుతుంది. సార్వభౌమాధికారంతో పాటు రాజకీయ అధికారాలు, సైన్యాధికారాలు ఉంటాయి. బ్రిటన్‌ రాజరికంలోనూ ఇదే ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. అలాంటప్పుడు క్యామిల్లాకే ఎందుకు అభ్యంతరాలు?.. ఎందుకంటే ఆమెకు రాణి(Queen) హోదా బదులు.. క్వీన్‌ కాన్సోర్ట్‌(రాజు భార్య)గా మాత్రమే హోదా ఉంది కాబట్టి.  అంతకంటే ముఖ్యంగా ఆమె చార్లెస్‌కు రెండో భార్య కాబట్టి. 

అవును.. ఛార్లెస్‌ మొదటి భార్య(మాజీ) ప్రిన్సెస్‌ డయానా 1997లో రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే వీళ్ల విడాకులకు ముందు.. క్యామిల్లాతో ఎఫైర్‌ నడిపించారు ఛార్లెస్‌. ఈ క్రమంలో క్యామిల్లా వల్లే డయానా-ఛార్లెస్‌లు విడిపోయారనే వాదన సైతం బలంగా వినిపించింది అప్పట్లో. ఆపై డయానా నుంచి విడాకులు తీసుకున్న ఛార్లెస్‌.. 2005లో క్యామిల్లాను వివాహం చేసుకున్నారు. అయితే ఆనాడూ క్యామిల్లాను ‘మూడో వ్యక్తి’గానే భావించింది బ్రిటన్‌ సమాజం. 

► అయితే ఇన్నేళ్లలో పరిస్థితులు చాలానే మారిపోయాయి. భర్తతో అన్యోన్యంగా ఉండడం.. విచక్షణ, సింప్లిసిటీ లాంటి కారణాలతో బ్రిటిష్‌ ప్రజల్లో ఆమె పట్ల సింపథీ ఏర్పడుతూ వచ్చింది. వాస్తవానికి ఆమెకు డయానా స్థానంలో ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ హోదా ఇవ్వాలి. కానీ, తీవ్ర అభ్యంతరాల నడుమ డచ్చెస్‌ ఆఫ్‌ కార్న్‌వాల్‌ను ఇచ్చారు. 


ఛార్లెస్‌-డయానా.. (ఎడమ).. ఛార్లెస్‌-క్యామిల్లా(కుడి)

► మరోవైపు ఛార్లెస్‌ సింహాసనానికి అర్హుడైన సమయంలోనూ క్యామిల్లాకు క్వీన్‌ కాన్సోర్ట్‌(భార్యకు మహారాణి హోదా)కి బదులు.. ప్రిన్సెస్‌ కాన్సోర్ట్‌ను ఇచ్చింది బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌. ఇలాంటి పరిస్థితులు రాజ వంశంలో అంతకు ముందు ఒకేఒక్కసారి ఎదురయ్యాయి. అదీ క్వీన్‌ విక్టోరియా భర్త ప్రిన్స్‌ అల్బర్ట్‌(1837-1901 దాకా.. ప్రిన్స్‌ కాన్సోర్ట్‌ హోదా ఇచ్చారు) విషయంలో జరిగింది.

► ఆపై ఆమె హోదాను ప్రిన్సెస్‌ కాన్సోర్ట్‌ నుంచి క్వీన్‌ కాన్సోర్ట్‌కు మార్చేశారు. కానీ, పూర్తిస్థాయి ‘క్వీన్‌’ హోదా లేకపోవడంతో ఆమె నామమాత్రపు మహారాణిగానే బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో నివసించబోతున్నారు.



► 2010లో ఛార్లెస్‌ ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. మీరు రాజు అయితే గనుక.. క్యామిల్లా రాణి అవుతుందా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన తడబడుతూ.. బహుశా.. మనం చూస్తాం కదా? అది కావచ్చు అంటూ సమాధానం ఇచ్చారు. 

► ఇక తన తదనంతరం తనకు దక్కిన ఆదరణే.. రాజు అయ్యే ఛార్లెస్‌, అతని భార్య క్యామిల్లాకు దక్కాలన్నది క్వీన్‌ ఎలిజబెత్‌-2.. 70 ఏళ్ల వారికోత్సవం సందర్భంగా చెప్పిన మాట కూడా. అయితే ఆ సందర్భంలోనూ ప్రిన్సెస్‌ కాన్సోర్ట్‌ పదాన్ని నొక్కి పలికారు క్వీన్‌ ఎలిజబెత్‌-2.


క్వీన్‌ ఎలిజబెత్‌-2 తో క్యామిల్లా

► బ్రిటన్‌ రాజరికంలో ఇంతకు ముందు క్వీన్‌ కాన్సోర్ట్‌గా.. జార్జ్‌-6వ భార్య క్వీన్‌ ఎలిజబెత్‌ హోదా అందుకుంది. ఆ తర్వాత ఆమె కూతురు అయిన క్వీన్‌ ఎలిజబెత్‌-2 నేరుగా సింహాసనాన్ని అధిష్టించి యూకేకు మహారాణి అయ్యి ఏడు దశాబ్దాలకు పైగా పాలించారు. 

క్వీన్‌ క్యామిల్లా ప్రస్థానం గమనిస్తే.. 

క్యామిల్లా రోజ్‌మేరీ షాండ్‌.. జులై 17, 1947లో జన్మించారు. బ్రిటన్‌ రాజకుటుంబంతో చాలాకాలంగా ఆమెకు సంబంధాలున్నాయి. ఆమె వంశానికి చెందిన ఎలైస్‌ కెప్పెల్‌.. కింగ్‌ ఎడ్వర్డ్‌-7తో ప్రేమాయణం నడిపించారు కూడా. 

 1970లో ఓ పోలో మ్యాచ్‌ సందర్భంగా ఛార్లెస్‌..క్యామిల్లా తొలిసారి కలుసుకున్నారు. అప్పటికి క్యామెల్లా వయసు 23 ఏళ్లు.

 అయితే.. నేవల్‌ డ్యూటీ కారణంగా వాళ్ల రిలేషన్‌కు కొంతకాలం బ్రేక్‌ పడింది. ఆ గ్యాప్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌ అయిన ఆండ్రూ పార్కర్‌ బౌల్స్‌ను ఆమె వివాహం చేసుకున్నారు.

 తిరిగి.. 22 ఏళ్ల తర్వాత ఛార్లెస్‌ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో క్యామిల్లా-ఆండ్రూలు విడాకులు తీసుకున్నారు. 

 ఓ టెలివిజన్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఛార్లెస్‌ తనకు, క్యామిల్లాకు ఎఫైర్‌ ఉందని ఓపెన్‌ అయ్యారు. ఈ వ్యాఖ్యలతో మరోవైపు డయానా కూడా ఛార్లెస్‌కు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది.

విడాకుల తర్వాత ఏడాదికే డయానా ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఆమె మృతిపై అనుమానాలు.. రాజకుటుంబంపై విమర్శలు వెల్లువెత్తాయి.

 అయితే.. ఛార్లెస్‌-క్యామిల్లా వివాహమనే బంధంతో ఒక్కటి కావడానికి తొమ్మిదేళ్లు ఎదురు చూశారు. 2005లో విండ్‌సోర్‌లో గుయిల్‌దాల్‌ వద్ద కోలాహలం లేకుండానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 

 అప్పటి నుంచి క్యామిల్లాకు రాయల్‌ డ్యూటీస్‌ వర్తించడం మొదలయ్యాయి. తొంభైకి పైగా ఛారిటీలకు ఆమె గౌరవ అధ్యక్షత వహిస్తున్నారు. విద్యను, మహిళా సాధికారికతను ప్రోత్సహించడం, మూగజీవాల సంక్షేమం కోసం, లైంగిక దాడులు.. గృహహింసకు వ్యతిరేకంగా ప్రసంగాలతో వక్తగా ఆమె బిజీబిజీగా గడిపారు. 

 అయితే రాజవంశం తరుపున క్యామిల్లా నిర్వహిస్తున్న బాధ్యతలపై జనాల్లో ఆమెపట్ల ఒక సానుకూల ధోరణి ఏర్పడింది. కానీ.. అన్యోన్యంగా ఉన్న ఛార్లెస్‌-డయానా కాపురంలో చిచ్చు రేపిందని, పరోక్షంగా ఆమె మరణానికి కూడా కారణమైందన్న కోపం మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు. అందుకే ఆమెకు పూర్తిస్థాయి మహారాణి హోదా దక్కలేదనే వాదన వినిపిస్తోంది ఇప్పుడు అక్కడ.

ప్రస్తుతం క్వీన్‌ కాన్సోర్ట్‌ హోదాలో యూకే రాణిగా క్యామిల్లా.. ఇంతకు ముందులాగే కేవలం రాయల్‌ డ్యూటీస్‌కు మాత్రమే పరిమితం కానుంది.

ఇదీ చదవండి: అగ్గి రాజేసిన పెళ్లాలు.. డయానా కొడుకుల మధ్య అగాధం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement