Queen Camilla
-
భారత్‌కు బ్రిటన్ రాజ దంపతులు
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్–3, కెమిల్లా దంపతులు మరోసారి భారత్ రానున్నారు. 2025 ప్రారంభంలో వారు భారత్‌లో పర్యటించనున్నారు. బ్రిటన్ విదేశాంగ కార్యాలయానికి వారు ఈ మేరకు సమాచారమిచ్చారు. సింహాసనాన్ని అధిష్టించాక చార్లెస్–3కు భారత్‌లో ఇదే తొలి అధికారిక పర్యటన కానుంది. 2019లో యువరాజు హోదా లో ఆయన భారత్‌లో చివరిసారి అధికారికంగా పర్యటించారు. గత అక్టోబర్‌లో రాజ దంపతులు బెంగళూరులో పర్యటించినా అది పూర్తిగా వ్యక్తిగతంగా సాగింది. గత ఫిబ్రవరిలో చార్లెస్‌కు కేన్సర్ నిర్ధారణ అయినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ వెల్లడించింది. అందుకు చికిత్సలో భాగంగా వారు భారత్ వచ్చినట్టు వార్తలొచ్చాయి. బెంగళూరులో వెల్నెస్ రీట్రీట్‌లో రాజ దంపతులు నాలుగు రోజులు గడిపారు. వారిద్దరూ 2022 లోనే భారత్‌లో పర్యటించాల్సింది. క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో ఆ పర్యటన రద్దయ్యిన సంగతి తెలిసిందే. -
నేడే చార్లెస్–3 పట్టాభిషేకం
లండన్: చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఎలిజబెత్–2 మృతితో ఆయన తనయుడు చార్లెస్–3 బ్రిటన్ రాజుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 74 ఏళ్ల చార్లెస్–3, 75 ఏళ్ల ఆయన భార్య కెమిల్లా శనివారం ఉదయమే గుర్రాలు పూన్చిన ప్రత్యేక బంగారు రథంలో బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు చేరుకుంటారు. అక్కడ లాంఛనప్రాయంగా జరిగే కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజుకు, రాణికి కిరీటధారణ చేస్తారు. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చార్లెస్–3, సెయింట్ మేరీస్ కిరీటాన్ని కెమిల్లా ధరిస్తారు. ఈసారి కోహినూర్ వజ్రాన్ని ఈ కిరీటంలో చేర్చడంలేదు. కిరీటధారణ తర్వాత చరిత్రాత్మక కుర్చీలో రాజు, రాణి ఆసీనులవుతారు. 1953లో జరిగిన క్వీన్ ఎలిజబెత్–2 పట్టాభిషేక మహోత్సవానికి 8,000 మందిని ఆహ్వానించారు. చార్లెస్–3 పట్టాభి షేకానికి కేవలం 2,200 మందికి ఆహ్వానం పంపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రైస్తవ పద్ధతిలో రాజు పట్టాభిషేకం జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కొంత ఆధునికతను జోడించారు. ఇతర మతాలకు సైతం చోటు కల్పించారు. వివిధ మతాల గురువులు, పెద్దలు రాజును ఆశీర్వదించనున్నారు. హిందూమతం తరపున నరేంద్ర బాబూభాయి పటేల్ రాజుకు ఉంగరం అందజేస్తారు. బ్రిటన్ తొలి హిందూ ప్రధానమంత్రి రిషి సునాక్ బైబిల్ సూక్తులు చదివి వినిపిస్తారు. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు శుక్రవారం లండన్‌కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్‌లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. -
‘కోహినూర్’పై బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీక్ష.. భారత్‌కు అప్పగిస్తారా?
లండన్: బ్రిటన్ మహారాణి ధరించే కిరీటంపై ఉండే 105 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్‌కు అప్పగించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. క్వీన్ ఎలిజబెత్ 2 మరణానంతరం ఆ డిమాండ్లు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే క్వీన్ కెమెల్లా పార్కర్ బౌల్స్, కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే, కోహినూర్ డైమండ్‌ను ధరించటం ద్వారా వలస పాలన కాలం నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసినట్లవుతుందని బీజేపీ హెచ్చరికల నేపథ్యంలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2023, మే 6న జరగనున్న పట్టాభిషేకంలో క్వీన్ కామెల్లా.. కోహినూర్ వజ్రం ఉన్న కిరీటాన్ని ధరించాలా వద్దా అనే అంశంపై బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారులు పునఃసమీక్షిస్తున్నట్లు వార్తా సంస్థ టెలిగ్రాఫ్ పేర్కొంది. అత్యంత విలువైన కోహినూర్ వజ్రం భారత్‌కు చెందిందని, దానిని వినియోగించటాన్ని బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ‘పట్టాభిషేకంలో రాణి కెమెల్లా కోహినూర్ డైమండ్‌ను ధరించటం ద్వారా వలస పాలన నాటి చేదు జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. గత పాలన జ్ఞాపకాలను భారతీయులు ఇప్పుడిప్పుడే చెరిపివేస్తున్నారు. ఐదు శతాబ్దాలకుపైగా 5-6 తరాల భారతీయులు విదేశీ పాలనలో మగ్గిపోయారు. ఇటీవలి సందర్భాలైన క్వీన్ ఎలిజబెత్ 2 మరణం, క్వీన్ కెమెల్లా పట్టాభిషేకంలో కోహినూర్ పై చర్చ జరిగి బ్రిటీష్ పాలనలోకి భారతీయులను తీసుకెళ్లింది.’ అని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు టెలిగ్రాఫ్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మరోవైపు.. రాణి కిరీటం నుంచి కోహినూర్ వజ్రాన్ని తొలగించి దాని స్థానంలో మరో వజ్రాన్ని ఏర్పాటు చేసి ఉపయోగించాలని భావిస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. బ్రిటన్‌లోని ప్రవాస భారతీయుల వీసా అంశంపై యూకే హోంశాఖ మంత్రి బ్రేవర్‌మ్యాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఐ)పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదీ చదవండి: రాజుగా చార్లెస్ ప్రమాణం -
70 ఏళ్ల తర్వాత కొత్త మహారాణి.. కానీ, పవర్ నిల్!
డచ్చెస్ ఆఫ్ కార్న్‌వాల్ క్యామిల్లా ఇకపై బ్రిటన్‌కు మహారాణిగా వ్యవహరించబోతోంది. అంటే.. ఏడు దశాబ్డాల తర్వాత బ్రిటన్‌కు ఓ కొత్త రాణి రాబోతోందన్నమాట. భర్త ఛార్లెస్ మహారాజు అయినప్పుడు.. ఆటోమేటిక్‌గా ఆమె మహారాణి అవ్వాల్సిందే కదా!. కానీ.. ఇక్కడే క్యామిల్లా కలలో కూడా ఊహించని కొన్ని అభ్యంతరాలతో బకింగ్హమ్ ప్యాలెస్‌లో అడుగుపెట్టబోతోంది. తలపై కీరిటంతో ఉత్త మహారాణి ట్యాగ్‌తో మాత్రం ఇకపై ఆమె జీవించాల్సి ఉంటుంది. 75 ఏళ్ల క్యామిల్లా.. యునైటెడ్ కింగ్డమ్కు కొత్త మహారాణి. కానీ, ఆమెకు ఎలాంటి సార్వభౌమాధికారాలు ఉండవు. అదేంటీ.. రాజు భార్యగా మహారాణి హోదాలో ఆమెకు విశేష అధికారాలు ఉండాలి కదా!. నిజమే.. రాణి హోదాలో రాజరికంలోకి అడుగుపెట్టే వాళ్లకు రాజుతో సమానమైన హోదా దక్కుతుంది. సార్వభౌమాధికారంతో పాటు రాజకీయ అధికారాలు, సైన్యాధికారాలు ఉంటాయి. బ్రిటన్ రాజరికంలోనూ ఇదే ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. అలాంటప్పుడు క్యామిల్లాకే ఎందుకు అభ్యంతరాలు?.. ఎందుకంటే ఆమెకు రాణి(Queen) హోదా బదులు.. క్వీన్ కాన్సోర్ట్(రాజు భార్య)గా మాత్రమే హోదా ఉంది కాబట్టి. అంతకంటే ముఖ్యంగా ఆమె చార్లెస్‌కు రెండో భార్య కాబట్టి. ► అవును.. ఛార్లెస్ మొదటి భార్య(మాజీ) ప్రిన్సెస్ డయానా 1997లో రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే వీళ్ల విడాకులకు ముందు.. క్యామిల్లాతో ఎఫైర్ నడిపించారు ఛార్లెస్. ఈ క్రమంలో క్యామిల్లా వల్లే డయానా-ఛార్లెస్‌లు విడిపోయారనే వాదన సైతం బలంగా వినిపించింది అప్పట్లో. ఆపై డయానా నుంచి విడాకులు తీసుకున్న ఛార్లెస్.. 2005లో క్యామిల్లాను వివాహం చేసుకున్నారు. అయితే ఆనాడూ క్యామిల్లాను ‘మూడో వ్యక్తి’గానే భావించింది బ్రిటన్ సమాజం. ► అయితే ఇన్నేళ్లలో పరిస్థితులు చాలానే మారిపోయాయి. భర్తతో అన్యోన్యంగా ఉండడం.. విచక్షణ, సింప్లిసిటీ లాంటి కారణాలతో బ్రిటిష్ ప్రజల్లో ఆమె పట్ల సింపథీ ఏర్పడుతూ వచ్చింది. వాస్తవానికి ఆమెకు డయానా స్థానంలో ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ హోదా ఇవ్వాలి. కానీ, తీవ్ర అభ్యంతరాల నడుమ డచ్చెస్ ఆఫ్ కార్న్‌వాల్‌ను ఇచ్చారు. ఛార్లెస్-డయానా.. (ఎడమ).. ఛార్లెస్-క్యామిల్లా(కుడి) ► మరోవైపు ఛార్లెస్ సింహాసనానికి అర్హుడైన సమయంలోనూ క్యామిల్లాకు క్వీన్ కాన్సోర్ట్(భార్యకు మహారాణి హోదా)కి బదులు.. ప్రిన్సెస్ కాన్సోర్ట్ను ఇచ్చింది బకింగ్హమ్ ప్యాలెస్. ఇలాంటి పరిస్థితులు రాజ వంశంలో అంతకు ముందు ఒకేఒక్కసారి ఎదురయ్యాయి. అదీ క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ అల్బర్ట్(1837-1901 దాకా.. ప్రిన్స్ కాన్సోర్ట్ హోదా ఇచ్చారు) విషయంలో జరిగింది. ► ఆపై ఆమె హోదాను ప్రిన్సెస్ కాన్సోర్ట్ నుంచి క్వీన్ కాన్సోర్ట్కు మార్చేశారు. కానీ, పూర్తిస్థాయి ‘క్వీన్’ హోదా లేకపోవడంతో ఆమె నామమాత్రపు మహారాణిగానే బకింగ్హమ్ ప్యాలెస్‌లో నివసించబోతున్నారు. ► 2010లో ఛార్లెస్ ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. మీరు రాజు అయితే గనుక.. క్యామిల్లా రాణి అవుతుందా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన తడబడుతూ.. బహుశా.. మనం చూస్తాం కదా? అది కావచ్చు అంటూ సమాధానం ఇచ్చారు. ► ఇక తన తదనంతరం తనకు దక్కిన ఆదరణే.. రాజు అయ్యే ఛార్లెస్, అతని భార్య క్యామిల్లాకు దక్కాలన్నది క్వీన్ ఎలిజబెత్-2.. 70 ఏళ్ల వారికోత్సవం సందర్భంగా చెప్పిన మాట కూడా. అయితే ఆ సందర్భంలోనూ ప్రిన్సెస్ కాన్సోర్ట్ పదాన్ని నొక్కి పలికారు క్వీన్ ఎలిజబెత్-2. క్వీన్ ఎలిజబెత్-2 తో క్యామిల్లా ► బ్రిటన్ రాజరికంలో ఇంతకు ముందు క్వీన్ కాన్సోర్ట్గా.. జార్జ్-6వ భార్య క్వీన్ ఎలిజబెత్ హోదా అందుకుంది. ఆ తర్వాత ఆమె కూతురు అయిన క్వీన్ ఎలిజబెత్-2 నేరుగా సింహాసనాన్ని అధిష్టించి యూకేకు మహారాణి అయ్యి ఏడు దశాబ్దాలకు పైగా పాలించారు. క్వీన్ క్యామిల్లా ప్రస్థానం గమనిస్తే.. ► క్యామిల్లా రోజ్మేరీ షాండ్.. జులై 17, 1947లో జన్మించారు. బ్రిటన్ రాజకుటుంబంతో చాలాకాలంగా ఆమెకు సంబంధాలున్నాయి. ఆమె వంశానికి చెందిన ఎలైస్ కెప్పెల్.. కింగ్ ఎడ్వర్డ్-7తో ప్రేమాయణం నడిపించారు కూడా. ► 1970లో ఓ పోలో మ్యాచ్ సందర్భంగా ఛార్లెస్..క్యామిల్లా తొలిసారి కలుసుకున్నారు. అప్పటికి క్యామెల్లా వయసు 23 ఏళ్లు. ► అయితే.. నేవల్ డ్యూటీ కారణంగా వాళ్ల రిలేషన్‌కు కొంతకాలం బ్రేక్ పడింది. ఆ గ్యాప్‌లో తన బాయ్‌ఫ్రెండ్ అయిన ఆండ్రూ పార్కర్ బౌల్స్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. ► తిరిగి.. 22 ఏళ్ల తర్వాత ఛార్లెస్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో క్యామిల్లా-ఆండ్రూలు విడాకులు తీసుకున్నారు. ► ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఛార్లెస్ తనకు, క్యామిల్లాకు ఎఫైర్ ఉందని ఓపెన్ అయ్యారు. ఈ వ్యాఖ్యలతో మరోవైపు డయానా కూడా ఛార్లెస్‌కు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. ► విడాకుల తర్వాత ఏడాదికే డయానా ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఆమె మృతిపై అనుమానాలు.. రాజకుటుంబంపై విమర్శలు వెల్లువెత్తాయి. ► అయితే.. ఛార్లెస్-క్యామిల్లా వివాహమనే బంధంతో ఒక్కటి కావడానికి తొమ్మిదేళ్లు ఎదురు చూశారు. 2005లో విండ్సోర్లో గుయిల్దాల్ వద్ద కోలాహలం లేకుండానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ► అప్పటి నుంచి క్యామిల్లాకు రాయల్ డ్యూటీస్ వర్తించడం మొదలయ్యాయి. తొంభైకి పైగా ఛారిటీలకు ఆమె గౌరవ అధ్యక్షత వహిస్తున్నారు. విద్యను, మహిళా సాధికారికతను ప్రోత్సహించడం, మూగజీవాల సంక్షేమం కోసం, లైంగిక దాడులు.. గృహహింసకు వ్యతిరేకంగా ప్రసంగాలతో వక్తగా ఆమె బిజీబిజీగా గడిపారు. ► అయితే రాజవంశం తరుపున క్యామిల్లా నిర్వహిస్తున్న బాధ్యతలపై జనాల్లో ఆమెపట్ల ఒక సానుకూల ధోరణి ఏర్పడింది. కానీ.. అన్యోన్యంగా ఉన్న ఛార్లెస్-డయానా కాపురంలో చిచ్చు రేపిందని, పరోక్షంగా ఆమె మరణానికి కూడా కారణమైందన్న కోపం మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు. అందుకే ఆమెకు పూర్తిస్థాయి మహారాణి హోదా దక్కలేదనే వాదన వినిపిస్తోంది ఇప్పుడు అక్కడ. ప్రస్తుతం క్వీన్ కాన్సోర్ట్ హోదాలో యూకే రాణిగా క్యామిల్లా.. ఇంతకు ముందులాగే కేవలం రాయల్ డ్యూటీస్‌కు మాత్రమే పరిమితం కానుంది. ఇదీ చదవండి: అగ్గి రాజేసిన పెళ్లాలు.. డయానా కొడుకుల మధ్య అగాధం