Britain queen
-
Queen Elizabeth II: అరుదైన వ్యక్తిత్వం
‘రవి అస్తమించని సామ్రాజ్యం’ తన ప్రాభవం క్రమేపీ కోల్పోతూ, కొడిగడుతున్న తరుణంలో బ్రిటిష్ పట్టపు రాణిగా వచ్చిన రాణి ఎలిజబెత్–2 గురువారం రాత్రి కన్నుమూశారు. బ్రిటన్‌తో పాటు మరో 14 దేశాలకు లాంఛనప్రాయపు రాజ్యాంగాధినేత హోదాలో అయితేనేమి, పూర్వపు బ్రిటిష్ వలస దేశాలతో కూడిన కామన్వెల్త్ అధినేత హోదాలో అయితేనేమి... ఈ ఏడు దశాబ్దాలూ ఆమె తనదైన ముద్రవేశారు. ఎలిజబెత్–2 సింహాసనం అధిష్ఠించేనాటికి అదే యూరప్ ఖండంలోని అనేక దేశాలు హింసాత్మకంగానో, సామరస్యపూర్వక మార్గంలోనో రాచరిక వ్యవస్థల్ని పూర్తిగా వదుల్చుకుని ప్రజాస్వామ్య రిపబ్లిక్‌లుగా అవతరిస్తున్నాయి. బ్రిటన్ గురించే చెప్పాలంటే అంతకు రెండున్నర శతాబ్దాల పూర్వమే అది ప్రజాస్వామ్య ఫలాలను రుచిచూడటం ప్రారంభించింది. అయినా బ్రిటన్ ప్రజాజీవన రంగం ఈనాటికీ రాచరిక వ్యవస్థతోనే పెనవేసుకుని ఉండటం, బకింగ్‌హామ్ రాజప్రాసాద పరిణామాలు ఈనాటికీ అక్కడి పౌరుల్లో ఆసక్తిదాయకం కావడం ఆ సమాజ తీరుతెన్నుల్ని పట్టిచూపుతుంది. ఇందుకు రాణిగా ఎలిజబెత్–2 నిర్వహించిన పాత్ర కూడా తక్కువేమీ కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారేందుకు సిద్ధపడటం, తమ పరిధులు, పరిమితులు గుర్తెరిగి మసులుకోవడం వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా శోభనిస్తుంది. రాణి ఎలిజబెత్ ఆ పని చేశారు కాబట్టే పెద్దగా వివాదాలు ముసురుకోలేదు. తనదైన ఆ శైలే 70 ఏళ్లపాటు ఆమెను అవిచ్ఛిన్నంగా నిలబెట్టింది. దేశానికి రాచరికం ఎందుకన్న ప్రశ్న తలెత్తకుండా చేసింది. రాజ్యాధినేతగా ఆమె ప్రతి వారం ప్రధానితో, విదేశాంగ మంత్రి తదితరులతో సంభాషించటం ఆనవాయితీ. ఇంటా బయటా జరిగే పరిణామాలను తెలుసుకోవటం, సలహాలివ్వటం రివాజు. ఆమె రాణి అయ్యేనాటికి విన్స్టన్ చర్చిల్ దేశ ప్రధాని. అప్పటికే రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్ అన్నివిధాలా దెబ్బతిని, తన వలస రాజ్యాల్లో పెల్లుబుకుతున్న జనాగ్రహం పర్యవసానంగా ఒక్కో దేశంనుంచే నిష్క్రమించకతప్పని దుస్థితిలో పడింది. ఆమె వచ్చాక సైతం అది కొనసాగింది. తన తాతలకాలం లోనే రాజ కుటుంబీకులకు ప్రత్యేక ప్రతిపత్తి ఉండే దశ అంతరించి సమానత్వ భావన వచ్చింది. ఇక 1956 నాటి సూయెజ్ కాల్వ సంక్షోభం బ్రిటన్ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రపంచంలో తన వాస్తవ స్థానమేమిటో చూపింది. సామ్రాజ్యంగా వెలుగులీనిన బ్రిటన్ యూరోప్ యూనియన్ (ఈయూ)లో ఒక భాగస్వామిగా మారడం... ఆర్థిక సంక్షోభం పర్యవసానంగా అదే ఈయూ నుంచి రెండేళ్లక్రితం బయటకు రావడం వంటి పరిణామాలకు ఆమె ప్రత్యక్ష సాక్షి. స్కాట్లాండ్లో స్వాతంత్య్ర కాంక్ష క్రమేపీ పెరిగి ఒక దశలో ఆ ప్రాంతం విడిపోతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కూటమి ప్రభుత్వాలూ, వాటి అస్థిరతా సరేసరి. వీటన్నిటినీ చూస్తూ, దశాబ్దాల తన అనుభవంతో ప్రభుత్వంలో ఉండేవారికి ఎప్పటికప్పుడు సలహాలిస్తూ ఆమె తన ప్రభావాన్ని చూపగలిగారు. అదే సమయంలో అనవసర జోక్యం చేసుకుంటున్నారన్న అపప్రథ రాకుండా చూసుకున్నారు. అందుకే బ్రిటన్ రాచరికానికి ఇప్పటికీ ప్రాసంగికత అడుగంటకపోవటం వెనక ఆమె వ్యక్తిగత ముద్రను కాదనలేం. ‘రాచరిక వ్యవస్థలోకి తొంగి చూడనంత కాలం దానిపై పూజ్యభావన ఉంటుంది. ఒక్కసారి అలా చూశాక మరి దాన్ని కీర్తించడం అసాధ్యం. అందుకే ఆ మార్మికతను అట్లే కొనసాగనీయండి’ అన్నాడు రాజ్యాంగ నిపుణుడు వాల్టర్ బాజెట్ ఒక సందర్భంలో వ్యంగ్యంగా. అలా చూస్తే బకింగ్ హామ్ రాజప్రాసాదంలో దిగ్భ్రాంతిపరిచేవి ఎన్నో కనబడతాయి. 1992లో ఒకేసారి ఆమె సంతానం లోని ముగ్గురు విడాకులు తీసుకోవటం బ్రిటన్ ప్రజానీకం జీర్ణించుకోలేకపోయారు. ఆ మాటకొస్తే తాను రాణి అయిన కొద్దికాలానికే తన సోదరి ఒక సాధారణ వ్యక్తితో సాన్నిహిత్యం నెరపడం, మీడియాలో అది చిలవలు పలవలుగా రావడం, చివరికామె అతన్ని పెళ్లాడి, ఆ తర్వాత కొద్దికాలానికే విడాకులు తీసుకోవటం వంటి పరిణామాలు రాజకుటుంబీకుల్ని ఊపిరాడని స్థితిలో పడేశాయి. ఎందుకంటే రాణిగా ఆమె చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌కు సుప్రీం గవర్నర్. సంప్రదాయానికి అత్యంత విలువ నిచ్చే సమాజం దృష్టిలో ఇవన్నీ ‘జరగకూడని ఘోరాలు’. ఇక యువరాణి లేడీ డయానా స్పెన్సర్ విషయంలో ఆమె తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నారు. కోడలిగా సంప్రదాయ పాత్రలో ఒదిగి, ప్రచారానికి దూరంగా ఉండాల్సిన డయానా ప్రముఖురాలిగా మారడం రాజప్రాసాదంలో ఎవరికీ నచ్చలేదంటారు. డయానాను ఆమె అత్తగా ఆరళ్లు పెట్టారని ఆరోపణ లొచ్చాయి. దానికి తగ్గట్టే 1995లో ప్రిన్స్ చార్లెస్‌తో విడిపోయిన డయానా మరో రెండేళ్లకు పారిస్‌లో దుర్మరణం పాలైనప్పుడు మొదట్లో రాణి నుంచి స్పందన లేదు. చివరకు ప్రజాభిప్రాయానికి ఆమె తలొగ్గక తప్పలేదు. నాలుగురోజులు ఆలస్యమైనా విషాద సూచకంగా రాజప్రాసాదంపై ఉన్న యూనియన్ జాక్‌ను అవనతం చేయమని ఆదేశించవలసి వచ్చింది. ఇక భిన్న సందర్భాల్లో రాజ్యాధినేతగా అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాల అధినేతలకూ, సీనియర్ సైనికాధికారులకూ నైట్‌హుడ్, ఆనరరీ నైట్ కమాండర్ వంటి భుజకీర్తులు తగిలించడం విమర్శలకు తావిచ్చింది. వీరంతా వియత్నాం, పాలస్తీనా, ఇరాక్ తదితరచోట్ల రక్తపుటేర్లు పారించారన్న ఆరోపణలు ఎదు ర్కొన్నవారు. ఏదేమైనా ఎలిజెబెత్లా సంయమనంతో మెలగటం, ఆ ఒరవడిని కొనసాగించటం కుమారుడు చార్లెస్‌కు సంక్లిష్టమైనదే. ఆయన ఆ బాధ్యత ఎలా నెరవేరుస్తారో బ్రిటన్ గమనిస్తూనే ఉంటుంది. -
70 ఏళ్ల తర్వాత కొత్త మహారాణి.. కానీ, పవర్ నిల్!
డచ్చెస్ ఆఫ్ కార్న్‌వాల్ క్యామిల్లా ఇకపై బ్రిటన్‌కు మహారాణిగా వ్యవహరించబోతోంది. అంటే.. ఏడు దశాబ్డాల తర్వాత బ్రిటన్‌కు ఓ కొత్త రాణి రాబోతోందన్నమాట. భర్త ఛార్లెస్ మహారాజు అయినప్పుడు.. ఆటోమేటిక్‌గా ఆమె మహారాణి అవ్వాల్సిందే కదా!. కానీ.. ఇక్కడే క్యామిల్లా కలలో కూడా ఊహించని కొన్ని అభ్యంతరాలతో బకింగ్హమ్ ప్యాలెస్‌లో అడుగుపెట్టబోతోంది. తలపై కీరిటంతో ఉత్త మహారాణి ట్యాగ్‌తో మాత్రం ఇకపై ఆమె జీవించాల్సి ఉంటుంది. 75 ఏళ్ల క్యామిల్లా.. యునైటెడ్ కింగ్డమ్కు కొత్త మహారాణి. కానీ, ఆమెకు ఎలాంటి సార్వభౌమాధికారాలు ఉండవు. అదేంటీ.. రాజు భార్యగా మహారాణి హోదాలో ఆమెకు విశేష అధికారాలు ఉండాలి కదా!. నిజమే.. రాణి హోదాలో రాజరికంలోకి అడుగుపెట్టే వాళ్లకు రాజుతో సమానమైన హోదా దక్కుతుంది. సార్వభౌమాధికారంతో పాటు రాజకీయ అధికారాలు, సైన్యాధికారాలు ఉంటాయి. బ్రిటన్ రాజరికంలోనూ ఇదే ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. అలాంటప్పుడు క్యామిల్లాకే ఎందుకు అభ్యంతరాలు?.. ఎందుకంటే ఆమెకు రాణి(Queen) హోదా బదులు.. క్వీన్ కాన్సోర్ట్(రాజు భార్య)గా మాత్రమే హోదా ఉంది కాబట్టి. అంతకంటే ముఖ్యంగా ఆమె చార్లెస్‌కు రెండో భార్య కాబట్టి. ► అవును.. ఛార్లెస్ మొదటి భార్య(మాజీ) ప్రిన్సెస్ డయానా 1997లో రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే వీళ్ల విడాకులకు ముందు.. క్యామిల్లాతో ఎఫైర్ నడిపించారు ఛార్లెస్. ఈ క్రమంలో క్యామిల్లా వల్లే డయానా-ఛార్లెస్‌లు విడిపోయారనే వాదన సైతం బలంగా వినిపించింది అప్పట్లో. ఆపై డయానా నుంచి విడాకులు తీసుకున్న ఛార్లెస్.. 2005లో క్యామిల్లాను వివాహం చేసుకున్నారు. అయితే ఆనాడూ క్యామిల్లాను ‘మూడో వ్యక్తి’గానే భావించింది బ్రిటన్ సమాజం. ► అయితే ఇన్నేళ్లలో పరిస్థితులు చాలానే మారిపోయాయి. భర్తతో అన్యోన్యంగా ఉండడం.. విచక్షణ, సింప్లిసిటీ లాంటి కారణాలతో బ్రిటిష్ ప్రజల్లో ఆమె పట్ల సింపథీ ఏర్పడుతూ వచ్చింది. వాస్తవానికి ఆమెకు డయానా స్థానంలో ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ హోదా ఇవ్వాలి. కానీ, తీవ్ర అభ్యంతరాల నడుమ డచ్చెస్ ఆఫ్ కార్న్‌వాల్‌ను ఇచ్చారు. ఛార్లెస్-డయానా.. (ఎడమ).. ఛార్లెస్-క్యామిల్లా(కుడి) ► మరోవైపు ఛార్లెస్ సింహాసనానికి అర్హుడైన సమయంలోనూ క్యామిల్లాకు క్వీన్ కాన్సోర్ట్(భార్యకు మహారాణి హోదా)కి బదులు.. ప్రిన్సెస్ కాన్సోర్ట్ను ఇచ్చింది బకింగ్హమ్ ప్యాలెస్. ఇలాంటి పరిస్థితులు రాజ వంశంలో అంతకు ముందు ఒకేఒక్కసారి ఎదురయ్యాయి. అదీ క్వీన్ విక్టోరియా భర్త ప్రిన్స్ అల్బర్ట్(1837-1901 దాకా.. ప్రిన్స్ కాన్సోర్ట్ హోదా ఇచ్చారు) విషయంలో జరిగింది. ► ఆపై ఆమె హోదాను ప్రిన్సెస్ కాన్సోర్ట్ నుంచి క్వీన్ కాన్సోర్ట్కు మార్చేశారు. కానీ, పూర్తిస్థాయి ‘క్వీన్’ హోదా లేకపోవడంతో ఆమె నామమాత్రపు మహారాణిగానే బకింగ్హమ్ ప్యాలెస్‌లో నివసించబోతున్నారు. ► 2010లో ఛార్లెస్ ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. మీరు రాజు అయితే గనుక.. క్యామిల్లా రాణి అవుతుందా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన తడబడుతూ.. బహుశా.. మనం చూస్తాం కదా? అది కావచ్చు అంటూ సమాధానం ఇచ్చారు. ► ఇక తన తదనంతరం తనకు దక్కిన ఆదరణే.. రాజు అయ్యే ఛార్లెస్, అతని భార్య క్యామిల్లాకు దక్కాలన్నది క్వీన్ ఎలిజబెత్-2.. 70 ఏళ్ల వారికోత్సవం సందర్భంగా చెప్పిన మాట కూడా. అయితే ఆ సందర్భంలోనూ ప్రిన్సెస్ కాన్సోర్ట్ పదాన్ని నొక్కి పలికారు క్వీన్ ఎలిజబెత్-2. క్వీన్ ఎలిజబెత్-2 తో క్యామిల్లా ► బ్రిటన్ రాజరికంలో ఇంతకు ముందు క్వీన్ కాన్సోర్ట్గా.. జార్జ్-6వ భార్య క్వీన్ ఎలిజబెత్ హోదా అందుకుంది. ఆ తర్వాత ఆమె కూతురు అయిన క్వీన్ ఎలిజబెత్-2 నేరుగా సింహాసనాన్ని అధిష్టించి యూకేకు మహారాణి అయ్యి ఏడు దశాబ్దాలకు పైగా పాలించారు. క్వీన్ క్యామిల్లా ప్రస్థానం గమనిస్తే.. ► క్యామిల్లా రోజ్మేరీ షాండ్.. జులై 17, 1947లో జన్మించారు. బ్రిటన్ రాజకుటుంబంతో చాలాకాలంగా ఆమెకు సంబంధాలున్నాయి. ఆమె వంశానికి చెందిన ఎలైస్ కెప్పెల్.. కింగ్ ఎడ్వర్డ్-7తో ప్రేమాయణం నడిపించారు కూడా. ► 1970లో ఓ పోలో మ్యాచ్ సందర్భంగా ఛార్లెస్..క్యామిల్లా తొలిసారి కలుసుకున్నారు. అప్పటికి క్యామెల్లా వయసు 23 ఏళ్లు. ► అయితే.. నేవల్ డ్యూటీ కారణంగా వాళ్ల రిలేషన్‌కు కొంతకాలం బ్రేక్ పడింది. ఆ గ్యాప్‌లో తన బాయ్‌ఫ్రెండ్ అయిన ఆండ్రూ పార్కర్ బౌల్స్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. ► తిరిగి.. 22 ఏళ్ల తర్వాత ఛార్లెస్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో క్యామిల్లా-ఆండ్రూలు విడాకులు తీసుకున్నారు. ► ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఛార్లెస్ తనకు, క్యామిల్లాకు ఎఫైర్ ఉందని ఓపెన్ అయ్యారు. ఈ వ్యాఖ్యలతో మరోవైపు డయానా కూడా ఛార్లెస్‌కు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. ► విడాకుల తర్వాత ఏడాదికే డయానా ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఆమె మృతిపై అనుమానాలు.. రాజకుటుంబంపై విమర్శలు వెల్లువెత్తాయి. ► అయితే.. ఛార్లెస్-క్యామిల్లా వివాహమనే బంధంతో ఒక్కటి కావడానికి తొమ్మిదేళ్లు ఎదురు చూశారు. 2005లో విండ్సోర్లో గుయిల్దాల్ వద్ద కోలాహలం లేకుండానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ► అప్పటి నుంచి క్యామిల్లాకు రాయల్ డ్యూటీస్ వర్తించడం మొదలయ్యాయి. తొంభైకి పైగా ఛారిటీలకు ఆమె గౌరవ అధ్యక్షత వహిస్తున్నారు. విద్యను, మహిళా సాధికారికతను ప్రోత్సహించడం, మూగజీవాల సంక్షేమం కోసం, లైంగిక దాడులు.. గృహహింసకు వ్యతిరేకంగా ప్రసంగాలతో వక్తగా ఆమె బిజీబిజీగా గడిపారు. ► అయితే రాజవంశం తరుపున క్యామిల్లా నిర్వహిస్తున్న బాధ్యతలపై జనాల్లో ఆమెపట్ల ఒక సానుకూల ధోరణి ఏర్పడింది. కానీ.. అన్యోన్యంగా ఉన్న ఛార్లెస్-డయానా కాపురంలో చిచ్చు రేపిందని, పరోక్షంగా ఆమె మరణానికి కూడా కారణమైందన్న కోపం మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు. అందుకే ఆమెకు పూర్తిస్థాయి మహారాణి హోదా దక్కలేదనే వాదన వినిపిస్తోంది ఇప్పుడు అక్కడ. ప్రస్తుతం క్వీన్ కాన్సోర్ట్ హోదాలో యూకే రాణిగా క్యామిల్లా.. ఇంతకు ముందులాగే కేవలం రాయల్ డ్యూటీస్‌కు మాత్రమే పరిమితం కానుంది. ఇదీ చదవండి: అగ్గి రాజేసిన పెళ్లాలు.. డయానా కొడుకుల మధ్య అగాధం -
ఇక బ్రిటన్ రాజు చార్లెస్
బల్మోరల్ క్యాజిల్: బ్రిటన్ రాజకుటుంబ నిబంధనల ప్రకారం... రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్ రాజు/రాణిగా మారిపోతారు. ఈ లెక్కన ఎలిజబెత్–2 రాణి వారసుడిగా మొదటి వరుసలో మొదటి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా మారినట్లే. అయితే, అధికారికంగా పగ్గాలు చేపట్టడానికి, పట్టాభిషేకానికి నిర్దేశిత లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నెలలు లేదా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎలిజబెత్–2 విషయానికొస్తే తండ్రి మరణంతో 1952 ఫిబ్రవరి 6న రాణిగా మారారు. 16 నెలల తర్వాత.. 1953 జూన్ 2న పట్టాభిషక్తురాలయ్యారు. రాణి మరణించాక 24 గంటల్లోపు కొత్త రాజు పేరును యాక్సెషన్ కౌన్సిల్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ నుంచి అధికారికంగా ప్రకటిస్తుంది. కొత్త రాజుకు విధేయత ప్రకటిస్తూ పార్లమెంట్ సభ్యులు ప్రమాణం చేస్తారు. ప్రైవీ కౌన్సిల్ ఎదుట నూతన రాజు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కొత్త రాజు పాలన మొదలైనట్లు యూకేలో పలుచోట్ల బహిరంగంగా ప్రకటిస్తారు. పట్టాభిషేక ప్రమాణ చట్టం–1689 ప్రకారం ప్రిన్స్ చార్లెస్ తన పట్టాభిషేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయాలి. ఇదీ చదవండి: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూత -
బ్రెగ్జిట్ బిల్లుకు బ్రిటన్ రాణి ఆమోదం
లండన్: ‘బ్రెగ్జిట్’ బిల్లుకు బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ రాజముద్ర వేశారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చే ప్రక్రియ ప్రారంభించేందుకు ఆ దేశ ప్రధాని థెరిసా మేకు అధికారం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు గురువారం ఆమె ఆమోదముద్ర వేశారు. యూరోపియన్ యూనియన్ (ఉపసంహరణ నోటిఫికేషన్) బిల్లును ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బ్రిటన్ రాణి సంతకంతో 28 సభ్య దేశాలు గల ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ వైదొలగే విషయమై చర్చలు జరిపేందుకు ప్రధానికి అధికారం లభించింది. మరోవైపు కొత్తగా ‘యునైటెడ్ ఫ్రంట్’ను ఏర్పాటు చేసేందుకు యూకేలోని వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర్ ఐర్లాండ్‌లో పర్యటించాలని థెరిసా మే ప్రయత్నిస్తున్నారు. -
‘రాణిగారూ.. మళ్లీ అమెరికాను ఏలండి’
లండన్: ‘రాణి గారూ !మళ్లీ మా దేశాన్ని పాలించండి’ అని ఓ అమెరికన్.. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు లేఖ రాశాడు. అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్న అభ్యర్థులు అధికసంఖ్యలో ఉండటంతో విసుగు చెందిన అతడు ఈ లేఖ రాశాడు. రాణి ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. బ్రిటన్ రాణి, ప్రధానికి అమెరికన్ల తరఫున రాసిన ఆ లేఖలో ‘మా నాయకత్వ ప్రమాణాలు సరిగా లేవు. అమెరికాను మళ్లీ బ్రిటన్‌లో భాగంగా చేసుకుని మమ్మల్ని మళ్లీ మీరే పాలించాలి’ అని ఉంది. దీనికి రాణి నుంచి స్పందన లేఖ వచ్చింది. ‘మరో సార్వభౌమ దేశ వ్యవహారాల్లో రాణి జోక్యం చేసుకోవడమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. రాణి తన కోరిక మన్నించకపోయినా ఆమె తీరు హుందాగా ఉందని ఆ అమెరికన్ పొంగిపోతున్నాడు.