
లండన్ : బ్రిటన్ రాజకుటుంబంలోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కొన్ని గతంలో నమోదైన రికార్డుల రూపంలో రాగా.. తాజాగా నమోదు చేస్తున్న అంశాల రూపంలో వస్తున్నాయి. ప్రస్తుతం పెన్నీ జూనార్ అనే రాయల్ బయోగ్రాఫర్ సంచలనాత్మక విషయం చెప్పారు. ఎప్పటికీ రహస్యంగా ఉంచాల్సిన ఓ విషయాన్ని 'ది డ్యూచెస్ : ది అన్‌టోల్డ్ స్టోరీ' అనే గ్రంథంలో దాదాపు బాంబు పేల్చినంత పనిచేశారు. 1970 సమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌కు బుద్ధి చెప్పేందుకు కార్న్‌వెల్ రాణి కెమిల్లా పార్కర్ బోల్స్ తొలిసారి బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్‌తో శారీరకంగా దగ్గరయిందని పేర్కొన్నారు.
తనను ప్రేమిస్తూనే మరో రాణి వైపు చూస్తున్న తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ పార్కర్ బోల్స్‌పై అసంతృప్తిగా ఉన్న పరిచయమైన కొద్ది సమయంలోనే చార్లెస్‌కు బాగా దగ్గరయిందని, తనను ఆ రోజు అర్పించుకుందని వెల్లడించింది. ఎన్నోసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ వినకుండా ప్రిన్స్ చార్లెస్ సోదరి ప్రిన్సెస్ అన్నెతో రోమాన్స్‌లోకి దిగిపోతుండటంతో దెబ్బకు దెబ్బ అన్నట్లుగా కెమిల్లా ఆండ్రూకు తెలిసేలా చార్లెస్‌తో రోమాన్స్‌లో మునిగిపోయినట్లు ఆమె వెల్లడించింది. మొట్టమొదటిసారి కెమిల్లా తనకు పరిచయం అయినప్పుడు చార్లెస్ కూడా చాలా అందంగా ఉన్నారని పొగిడేశారంట. ఆమెతో తనకు బాగానే ఉందనే అభిప్రాయం కూడా చెప్పాడంట. కానీ, ఆ సమయంలో అక్కడికి ఆండ్రూ ప్రిన్స్ చెల్లెలితో ఉన్నాడని గ్రహించిన కెమిల్లా ఆలస్యం చేయకుండా ప్రిన్స్ చార్లెస్‌కు దగ్గరయినట్లు పెన్నీ జునార్ వెల్లడించారు.