Camilla Parker
-
రాజుగా ఛార్లెస్-3.. పట్టాభిషేకానికి ఆలస్యం ఎందుకంటే..
లండన్: క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో.. ఆమె తనయుడు ఛార్లెస్-3 అధికారికంగా యునైటెడ్ కింగ్డమ్కు రాజు అయ్యారు. శనివారం.. ప్రవేశ మండలిAccession Council అధికారికంగా ఆయన పేరును ప్రకటించింది. బ్రిటన్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఈ ప్రకటన కార్యక్రమాన్ని టెలివిజన్ ప్రసారం చేసింది కౌన్సిల్. సాధారణంగా.. సింహాసనంపై ఉన్నవాళ్లు మరణిస్తే.. వారసులే ఆటోమేటిక్‌గా తదుపరి బాధ్యతలు స్వీకరిస్తారు. అంతర్గతంగా ఆ కార్యక్రమం ఉంటుంది. కానీ, బ్రిటన్ రాజరికంలో తొలిసారి ఇలా టీవీ టెలికాస్టింగ్ ద్వారా ప్రకటించడం విశేషం. భారత కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నాం సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 73 ఏళ్ల ఛార్లెస్ అధికారికంగా బాధ్యతలు చేపడుతూ.. ‘అనితరమైన సార్వభౌమాధికారానికి సంబంధించిన బాధ్యతలు తనకు తెలుస’ని ప్రమాణం చేశారు. ► వందల కొద్దీ ప్రైవేట్ కౌన్సిలర్లు.. అందులో బ్రిటన్ తాజా ప్రధాని లిజ్ ట్రస్, క్వీన్ ఎలిజబెత్-2 వారసులు, ఛార్లెస్ భార్య క్యామిల్లా, పెద్ద కొడుకు..తదుపరి వారసుడు విలియమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఛార్లెస్ లేని ప్రత్యేక ఛాంబర్లో ఆయన్ని అధికారికంగా రాజుగా ప్రకటించింది యాక్సెషన్ కౌన్సిల్. ► అనంతరం.. ఆయన సమక్షంలోనే మరోసారి ‘ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్’ ఇకపై యూకేకు సార్వభౌమాధికారి.. రాజు అంటూ ప్రకటించింది. ఆ వెంటనే ఆయన ప్రమాణం చేసి.. రాజపత్రాలపై సంతకం చేశారు. ఇక లోపలి కార్యక్రమం పూర్తికాగానే.. మధ్యాహ్నం 3గం.30ని. ప్రాంతంలో ట్రంపెట్ ఊది ఛార్లెస్-3ను అధికారికంగా బాహ్యప్రపంచానికి రాజుగా ప్రకటించింది మండలి. అయితే.. ► బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3ని ప్రకటించినప్పటికీ ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది. అదే మహారాజుగా ఆయనకు జరగాల్సిన పట్టాభిషేకం. తల్లి మరణించిన వెంటనే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన ఛార్లెస్.. రాజు హోదా దక్కించుకున్నారు. అయితే.. క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో సంతాప సమయం ముగిశాకే.. ఆయనకు అంగరంగ వైభవంగా పట్టాభిషేకం నిర్వహిస్తారు. ► బ్రిటన్ రాజరికాన్ని గమనిస్తే ఇంతకు ముందు.. 1952 ఫిబ్రవరి 6వ తేదీన జార్జ్-6 మరణించారు. ఆ సమయంలో వారసురాలు ప్రిన్స్ ఎలిజబెత్-2 రాణిగా ప్రకటించబడ్డారు. అయితే.. క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకం మాత్రం 1953, జూన్ 2న జరిగింది. అయితే ఆమె భర్త ఫిలిప్.. ఆ తర్వాతి కాలంలోనూ ప్రిన్స్‌గానే కొనసాగారు. ► ఇవాళ జరిగిన.. ప్రవేశ వేడుక(ceremony of Accession), తర్వాత జరగబోయే పట్టాభిషేక వేడుక(ceremony of Coronation) మధ్య తేడా ఏంటంటే.. ప్రవేశ వేడుకలో కేవలం అధికారిక ప్రకటన, ప్రమాణం ఉంటుంది. కానీ, పట్టాభిషేకం అనేది కాంటర్బరీ ఆర్చ్‌బిషప్ నిర్వహించిన మతపరమైన వేడుక. లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ అబ్బేలో గత 900 సంవత్సరాలుగా పట్టాభిషేక సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ► సింహాసనంపై ఉన్నవాళ్లు మరణించాక.. తదనంతర రాజు/రాణికు వైభవంగా పట్టాభిషేకం నిర్వహించేందుకే అంత గ్యాప్ తీసుకుంటారు. ► పట్టాభిషేక సమయంలో సదరు వ్యక్తి రాజు/రాణి.. చట్టం ప్రకారం పాలించడం, దయతో న్యాయం చేయడం, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌ను నిర్వహించడం లాంటి ప్రమాణాలు చేస్తారు. ► అనంతరం ఆర్చ్‌బిషప్ సమక్షంలో.. కింగ్ ఎడ్వర్డ్ సింహానం మీద అధిరోహిస్తారు. ఆపై సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని రాజు/రాణి తలపై ఉంచుతారు ఆర్చిబిషప్. భర్త ప్రిన్స్ ఫిలిప్‌తో క్వీన్ ఎలిజబెత్-2 ► 1626 నుంచి బ్రిటన్ సింహాసనం విషయంలో ఈ కార్యక్రమం జరుగుతూ వస్తోంది. ► బ్రిటన్ పట్టాభిషేక కార్యక్రమానికి.. రాజరిక వంశస్థులతో పాటు చట్ట సభ్యులు, చర్చ్ సభ్యులు, కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రధానులు.. ప్రతినిధులు, ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులూ హాజరవుతారు. -
క్వీన్ ఎలిజబెత్–2 మృతి.. కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి.. హక్కుదారు ఎవరు?
న్యూఢిల్లీ: క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 105 క్యారెట్ల అత్యంత విలువైన ఈ వజ్రాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ భారత్‌లో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోహినూర్‌ను ఇకనైనా స్వదేశానికి అప్పగించాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కోహినూర్ అంటే వెలుగుల కొండ అని అర్థం. 14 శతాబ్దం ఆరంభంలో దక్షిణ భారతదేశంలో తవ్వకాల్లో లభించినట్లు చరిత్రలో నమోదయ్యింది. తర్వాత పలువురు రాజులు, చక్రవర్తుల చేతులు మారుతూ వచ్చింది. చివరకు బ్రిటిష్ రాణి కిరీటంలోకి చేరింది. కోహినూర్ తమదేనంటూ భారత్, పాకిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్ దేశాలు వాదిస్తున్నాయి. వజ్రానికి అసలు హక్కుదారులు ఎవరన్నదానిపై శతాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు బ్రిటన్ రాణి మృతిచెందారంటూ కాబట్టి కోహినూర్‌ను భారత్‌కు అప్పగించాలని ట్విట్టర్లో జనం డిమాండ్ చేస్తున్నారు. బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్ సింహాసనాన్ని అధిష్టించబోతున్నారు. కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని రాణి హోదాలో ఆయన భార్య కెమిల్లా పార్కర్ ధరిస్తారు. కోహినూర్ వెనక్కి రప్పించడానికి ప్రయత్నిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. -
కన్ను కొట్టిన కెమిల్లా !
ప్రియా వారియర్.. రాహుల్ గాంధీ.. తాజాగా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ భార్య కెమిల్లా పార్కర్ కన్ను కొట్టి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారారు. బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్‌తో సంబంధాలు బలోపేతానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మెలానియా లండన్‌కి వచ్చారు. ఈ సందర్భంగా ప్రిన్స్ చార్లెస్ వారికి ఆతి«థ్యమిచ్చారు. వారితో కలసి ఫొటో దిగాక చార్లెస్ భార్య కెమిల్లా పార్కర్..ట్రంప్ వెనుక నడుస్తూ పక్కకి తిరిగి కన్ను కొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆమె ఎందుకు కన్ను గీటారనేది అర్ధం కాని విషయంగా మిగిలింది. బ్రిటన్ రాజకుటుంబీకురాలు కెమెరాల సాక్షిగా కన్ను కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరికి తోచిన విధంగా వారు కారణాలు చెబుతున్నారు. మలయాళీ కుట్టి ప్రియా వారియర్ ఓ సినిమా కోసం కన్ను కొట్టే ఒకే ఒక్క సీన్ దేశం మొత్తాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత ఏడాది పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీని కౌగిలించుకొని వచ్చి తన సీట్లో కూర్చొని జ్యోతిరాదిత్య సింధియావైపు చూస్తూ కన్ను కొట్టడం కూడా చర్చనీయాంశమయ్యింది. -
రాజుగారి బాంబులాంటి రహస్యం
లండన్ : బ్రిటన్ రాజకుటుంబంలోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కొన్ని గతంలో నమోదైన రికార్డుల రూపంలో రాగా.. తాజాగా నమోదు చేస్తున్న అంశాల రూపంలో వస్తున్నాయి. ప్రస్తుతం పెన్నీ జూనార్ అనే రాయల్ బయోగ్రాఫర్ సంచలనాత్మక విషయం చెప్పారు. ఎప్పటికీ రహస్యంగా ఉంచాల్సిన ఓ విషయాన్ని 'ది డ్యూచెస్ : ది అన్‌టోల్డ్ స్టోరీ' అనే గ్రంథంలో దాదాపు బాంబు పేల్చినంత పనిచేశారు. 1970 సమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌కు బుద్ధి చెప్పేందుకు కార్న్వెల్ రాణి కెమిల్లా పార్కర్ బోల్స్ తొలిసారి బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్‌తో శారీరకంగా దగ్గరయిందని పేర్కొన్నారు. తనను ప్రేమిస్తూనే మరో రాణి వైపు చూస్తున్న తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ పార్కర్ బోల్స్పై అసంతృప్తిగా ఉన్న పరిచయమైన కొద్ది సమయంలోనే చార్లెస్‌కు బాగా దగ్గరయిందని, తనను ఆ రోజు అర్పించుకుందని వెల్లడించింది. ఎన్నోసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ వినకుండా ప్రిన్స్ చార్లెస్ సోదరి ప్రిన్సెస్ అన్నెతో రోమాన్స్లోకి దిగిపోతుండటంతో దెబ్బకు దెబ్బ అన్నట్లుగా కెమిల్లా ఆండ్రూకు తెలిసేలా చార్లెస్‌తో రోమాన్స్‌లో మునిగిపోయినట్లు ఆమె వెల్లడించింది. మొట్టమొదటిసారి కెమిల్లా తనకు పరిచయం అయినప్పుడు చార్లెస్ కూడా చాలా అందంగా ఉన్నారని పొగిడేశారంట. ఆమెతో తనకు బాగానే ఉందనే అభిప్రాయం కూడా చెప్పాడంట. కానీ, ఆ సమయంలో అక్కడికి ఆండ్రూ ప్రిన్స్ చెల్లెలితో ఉన్నాడని గ్రహించిన కెమిల్లా ఆలస్యం చేయకుండా ప్రిన్స్ చార్లెస్‌కు దగ్గరయినట్లు పెన్నీ జునార్ వెల్లడించారు. -
భారత్‌లో చార్లెస్ దంపతులు పర్యటన: భద్రత కట్టుదిట్టం
బ్రిటన్ యువరాజు చార్లెస్, కెమిల్లా పార్కర్ దంపతులు భారత్‌లో తొమ్మిది రోజుల పర్యటనలో భాగంగా నేటి సాయంత్రం డెహ్రాడూన్‌లోని జోలీగ్రాండ్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఉన్నతాధికారులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. వారి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయినట్లు తెలిపారు. చార్లెస్ యువరాజు దంపతుల పర్యటన నేపథ్యంలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. అందుకోసం భారీగా పోలీసుల బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. నరేంద్రనగర్‌లోని ఓ హోటల్లో చార్లెస్ దంపతులకు విడిది ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా చార్లెస్ దంపతులు రిషికేశ్‌లోని పరమత నికేతన్ ఆశ్రమంలో నిర్వహించే హవన్, గంగా హారతి కార్యక్రమంలో పాల్గొంటారని ఉన్నతాధికారులు తెలిపారు. అనంతరం ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ గౌరవార్థం ఇచ్చే విందులో చార్లెస్ దంపతులు పాల్గొనున్నారని చెప్పారు. యువరాజు దంపతుల కోసం నరేంద్రనగర్‌లోని హోటల్లో విడిది చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీ, ఫారెస్ట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, డూన్ స్కూల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో వారు పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం ఇటీవల ఉత్తరాఖండ్‌లో వరదల వల్ల అతలాకుతలమైన ప్రాంతాలలో వారు పర్యటించనున్నారు. భారత్ పర్యటనలో భాగంగా చార్లెస్ దంపతులు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలతో సమావేశం కానున్నారు. అలాగే భారత్ వాణిజ్య రాజధాని ముంబైలో దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చార్లెస్ దంపతులు భేటీ అవుతారు. భారత్‌లో వివిధ ప్రాంతాల్లో వ్యాపారవేత్తలు, సంస్కృతిక రంగానికి చెందిన ప్రముఖులు, నాయకులను బ్రిటన్ యువరాజు చార్లెస్ దంపతులు కలుసుకుంటారని ఉత్తరాఖండ్ ఉన్నతాధికారులు వివరించారు.