రాజుగా ప్రమాణం చేస్తున్న చార్లెస్. పక్కన భార్య కెమెల్లా
లండన్: బ్రిటన్ కొత్త రాజుగా 73 ఏళ్ల చార్లెస్–3 నియుక్తులయ్యారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి యాక్సెషన్ కౌన్సిల్ శనివారం ఉదయం లండన్‌లోని చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో సమావేశమై ఆయన్ను రాజుగా నియమిస్తున్నట్టు లాంఛనంగా ప్రకటించింది. ప్యాలెస్ బాల్కనీ నుంచి నియామక ప్రకటనను బహిరంగంగా చదివి విన్పించింది. భేటీలో పాల్గొన్న ముఖ్య అతిథులంతా ‘గాడ్ సేవ్ ద కింగ్’ అంటూ తమ అంగీకారం తెలిపారు.
అనంతరం చార్లెస్–3 రాజుగా ప్రమాణ చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ ప్రకటన పత్రం తాలూకు రెండు ప్రతులపై తన కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ కానుకగా ఇచ్చిన ఇంక్ పెన్నుతో సంతకం చేశారు! ఆ వెంటనే కింగ్స్ ట్రూప్స్ 41 తుపాకులతో వందన సమర్పణ చేశాయి. రాణి హోదాలో ఆయన భార్య కెమెల్లా పార్కర్ బౌల్స్ (75), నూతన యువరాజుగా విలియం తదితరులు రాజ ప్రకటన పత్రంపై సాక్షి సంతకాలు చేశారు. బ్రిటన్‌తో పాటు కామన్వెల్త్ దేశాలన్నింటికీ ఇకపై చార్లెస్–3 అధినేతగా వ్యవహరిస్తారు.
నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆరుగురు బ్రిటన్ మాజీ ప్రధానులతో పాటు కొత్త ప్రధాని లిజ్ ట్రస్, విపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. చార్లెస్–3 నిర్ణయం మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తొలిసారిగా పత్య్రక్ష ప్రసారం చేశారు. బ్రిటన్‌ను రికార్డు స్థాయిలో 70 ఏళ్లపాటు పాలించిన ఆయన తల్లి క్వీన్ ఎలిజబెత్–2 గురువారం 96వ ఏట కన్నుమూయడం తెలిసిందే. ‘‘అనంతమైన ప్రేమ, నిస్వార్థ సేవ, తిరుగులేని అంకితభావాలతో నా తల్లి పాలన అన్ని విషయాల్లోనూ సాటిలేనిదిగా సాగింది.
ఆమె అస్తమయం అత్యంత దుఃఖమయమైన విషయం. నాపై ఎంతటి భారీ బాధ్యతలున్నాయో తెలుసు. ఆమె నెలకొల్పిన ప్రమాణాలను కొనసాగిస్తా. అందుకు నా జీవితాన్ని ధారపోస్తా’’ అంటూ తన తొలి ప్రసంగంలో కింగ్ చార్లెస్–3 ప్రతిజ్ఞ చేశారు. తల్లిని తలచుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘ప్రియాతి ప్రియమైన అమ్మా! దివంగతుడైన నాన్నను కలుసుకునేందుకు మహాప్రస్థానానికి బయల్దేరిన నీకు నేను చెప్పగలిగింది ఒకటే. మన కుటుంబం పట్ల నీ ప్రేమకు, అంకితభావానికి థాంక్యూ’’ అంటూ నివాళులర్పించారు. నూతన రాజుకు విధేయులుగా ఉంటామంటూ ప్రధాని ట్రస్, ఆమె మంత్రివర్గ సభ్యులంతా హౌజ్ ఆఫ్ కామన్స్‌లో ప్రతిజ్ఞ చేశారు.
భర్త సమాధి పక్కనే...
రాణి అంత్యక్రియలు సెప్టెంబర్ 19న ఉదయం చారిత్రక వెస్ట్ మినిస్టర్ అబేలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. బకింగ్‌హాం ప్యాలెస్ ఈ మేరకు ప్రకటన చేసింది. రాణి పార్థివ దేహాన్ని ఆమె మృతి చెందిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం ఉదయం రోడ్డు మార్గాన ఎడింబరోలోని హోలీ రుడ్‌హౌజ్ కోటకు తరలిస్తారు. మంగళవారం అక్కడినుంచి విమానంలో లండన్‌కు తీసుకెళ్తారు. సెప్టెంబర్ 14 నుంచి 4 రోజులు ప్రజల సందర్శనార్థం వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంచుతారు. 19న సోమవారం విండ్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో భర్త చార్లెస్ సమాధి పక్కనే ఖననం చేస్తారు.
కార్యక్రమానికి వస్తున్న మాజీ ప్రధానులు థెరిసా మే, జాన్ మేజర్, గార్డన్ బ్రౌన్, టోనీ బ్లెయిర్, డేవిడ్ కామెరాన్, బోరిస్ జాన్సన్
Comments
Please login to add a commentAdd a comment