కేరళ పర్యటనకు బ్రిటన్ యువరాజు
బ్రిటన్ యువరాజ్ చార్లెస్, ఆయన భార్య కెమిల్లా పార్కర్ సోమవారం నుంచి కేరళలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. చార్లెస్ దంపతులు కేరళను సందర్శించడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని పలు చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న చార్లెస్ దంపతులు డెహ్రాడూన్, న్యూఢిల్లీ, ముంబై, పుణె పర్యటనను ముగించుకుని కోచి వెళతారు.
బ్రిటన్ యువరాజు రాక సందర్భంగా కేరళలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కోచితో పాటు చార్లెస్ సందర్శించే పలు ప్రాంతాల్లో దాదాపు వెయ్యిమంది భద్రత సిబ్బందిని మోహరించారు. చార్లెస్ గౌరవార్థం కేరళ గవర్నర్ నిఖిల్ కుమార్ విందు ఇవ్వనున్నారు. ఈ విందులో వ్యాపారవేత్తలు, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. కేరళ పర్యటన ముగిసిన అనంతరం చార్లెస్ దంపతులు కొలంబో వెళ్లనున్నారు.