కొచ్చిన్: ఈనెల 24, 25వ తేదీల్లో కేరళలో పర్యటించనున్న ప్రధాని మోదీని సూసైడ్ బాంబర్‌తో చంపేస్తామన్న బెదిరింపులపై పోలీసులు, కేంద్ర నిఘా విభాగాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇందుకు సంబంధించిన లేఖ ఒకటి గత వారం రాష్ట్ర బీజేపీ విభాగానికి అందింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ కె.సురేంద్రన్ దానిని పోలీసులకు అందజేశారు. ప్రధాని పర్యటన, బందోబస్తులో ఉండే అధికారుల వివరాలతో అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) తయారు చేసిన నివేదిక శనివారం వైరల్ అవుతోంది. అందులోనే బెదిరింపు లేఖ అంశం ఉంది.
మలయాళంలో ఉన్న ఆ లేఖను కొచ్చిన్‌కు చెందిన ఎన్‌జే జానీ రాసినట్లుగా ఉంది. లేఖలో వాస్తవికత, దాని వెనుక ఉన్న వ్యక్తిపై విచారణ జరుపుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. ఈ పరిణామంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ స్పందించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన ముఖ్య విషయాలను లీక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సీరియస్ వ్యవహారమని, సీఎం విజయన్ స్పందించాలని కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ డిమాండ్ చేశారు. అనుమానితుడిగా పేర్కొంటున్న ఎన్‌జే జానీ శనివారం మీడియాతో మాట్లాడారు. సదరు బెదిరింపు లేఖతో తనకు సంబంధం లేదన్నారు. పోలీసులడిగిన అన్ని వివరాలను అందించానన్నారు. చర్చి వ్యవహారానికి సంబంధించి తనతో శత్రుత్వం ఉన్న వారే దీని వెనుక ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment