Indian Origin Star Executives Leading Global Companies - Sakshi
Sakshi News home page

ఎందెందు వెదకి చూసినా భారతీయ సీఈఓలు అందందే గలరు! వందల కోట్ల జీతాలు తీసుకుంటున్న మనోళ్లు

Published Sun, Mar 26 2023 11:34 AM | Last Updated on Mon, Mar 27 2023 11:36 AM

Global companies are ruled by indian leaders - Sakshi

మైక్రోసాఫ్ట్‌.. గూగుల్‌.. అడోబ్‌.. ఐబీఎం.. నోవార్టిస్‌.. డెలాయిట్‌.. స్టార్‌బక్స్‌.. బాటా.. యూట్యూబ్‌.. గోడాడీ.. మైక్రాన్.. ఫెడ్‌ఎక్స్‌.. డీబీఎస్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత అవుతుంది లిస్ట్‌! ఇంతకీ ఏంటీ లిస్ట్‌ అంటారా? వీటన్నింటిలోనూ కామన్  విషయం ఒకటుంది. అదేనండీ ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో దుమ్మురేపుతున్న ఈ గ్లోబల్‌ కంపెనీలన్నింటినీ ఏలుతున్నది మనోళ్లే!

మనదేశంలో పుట్టి.. సప్తసముద్రాలను దాటి కార్పొరేట్‌ రారాజులుగా తమ సత్తా ఏంటో చాటిచెబుతున్నారు భారతీయులు. టెక్నాలజీ.. ఫార్మా.. ఫ్యాషన్.. బ్యాంకింగ్‌.. రిటైల్‌.. తయారీ.. ఐటీ.. ఏ రంగంలోనైనా మనోళ్లు సరైనోళ్లు అనిపించుకుంటున్నారు. అందుకే ప్రపంచం ఇప్పుడు భారత్‌ లీడర్స్‌ వెంటపడుతోంది. ఫార్చూన్-500 టాప్‌ కంపెనీల్లో దాదాపు 60 కంపెనీల డ్రైవింగ్‌ సీట్లో ఉన్నది భారత సంతతికి చెందినవారే కావడం గమనార్హం. ఆయా కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ 6 లక్షల కోట్ల డాలర్ల పైమాటే!! అంటే మన కరెన్సీలో 492 లక్షల కోట్ల రూపాయలన్న మాట! మనదేశ ఎకానమీ (జీడీపీ) దాదాపు 3.2 లక్షలకోట్లడాలర్లతో పోలిస్తే రెట్టింపు విలువ వీటి సొంతం. 

ఇతర రంగాల్లోనూ భారత సారథులు దూసుకుపోతున్నారు. అమెరికా వైస్‌ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఐఎంఎఫ్‌ డిప్యుటీ ఎండీ గీతా గోపీనాథ్‌తో పాటు తాజాగా ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ కాబోతున్న అజయ్‌ బంగా దీనికి నిదర్శనం. అసలు కార్పొరేట్‌ ప్రపంచమంతా సారథ్యం కోసం భారత్‌ వైపు ఎందుకు చూస్తోంది? మనోళ్లకున్న ప్రత్యేకతేంటి? ఈ కథేంటో చూద్దాం రండి మరి!!

అమెరికా సిలికాన్ వ్యాలీలో భారతీయులదే హవా. ఎందుకంటే అక్కడున్న అనేక టెక్నాలజీ, ఐటీ కంపెనీల్లో మన ఇంజినీర్లు లక్షల సంఖ్యలో (దాదాపు మూడో వంతు) పని చేస్తుండటమే కాదు.. ఏకంగా చాలా దిగ్గజ కంపెనీల్లో టాప్‌ పొజిషన్లను చేరుకుని భారత్‌ పేరును ప్రపంచవ్యాప్తంగా మార్మోగేలా చేస్తున్నారు. శంతను నారాయణ్‌ దాదాపు 15 ఏళ్లుగా అడోబ్‌ సీఈఓ స్థానంలో పాతుకుపోయారు. ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న అనేక కంపెనీలు భారత సంతతికి చెందిన వారి వెంటపడి మరీ సారథ్యాన్ని అప్పగిస్తుండటం వారి ప్రతిభాపాటవాలను చాటిచెబుతోంది.

2004లో గూగుల్‌లో చేరిన సుందర్‌ పిచాయ్‌ దాదాపు పదేళ్లలోనే కంపెనీ టాప్‌ పొజిషన్‌కు చేరుకోవడం దీనికి నిదర్శనం. గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్, క్రోమ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్, గూగుల్‌ డ్రైవ్, జీ మెయిల్, గూగుల్‌ మ్యాప్స్, ఆండ్రాయిడ్‌ వంటి ప్రాజెక్టుల సక్సెస్‌కు సుందర్‌ పిచాయ్‌ దూరదృష్టి అపారమైన నైపుణ్యాలే కారణం. అంతేకాదు, 2015లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చూస్తే గూగుల్‌ షేర్‌ ధర ఏకంగా 76 శాతం ఎగబాకడం విశేషం.

ఆయన హయాంలోనే ఆల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృ సంస్థ) తొలిసారిగా 2020 జనవరిలో ట్రిలియన్ (లక్షకోట్ల) డాలర్ల మైలురాయిని చేరుకోగా, 2021 నవంబర్‌లో 2 ట్రిలియన్ డాలర్లను సైతం తాకింది. ఇక మన తెలుగు తేజం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ను పోటీదారులకు అందనంత ఎత్తులో నిలబెట్టి ప్రపంచ కార్పొరేట్లలో తన రూటే సెపరేటు అని చూపించారు. ఎందుకంటే 2014లో మైక్రోసాఫ్ట్‌ పగ్గాలు చేపట్టిన నాదెళ్ల.. 2019లో కంపెనీని తొలిసారి ట్రిలియన్ డాలర్ల విలువను అధిగమించేలా చేశారు.



అజూర్‌క్లౌడ్‌ బిజినెస్‌తో భవిష్యత్తు దిశగా కంపెనీని నడిపించడమే కాదు.. 2021లో ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్‌ దూసుకెళ్లేలా చేసిన ఘనత నాదెళ్లదే. తన హయాంలో 45 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన కంపెనీలు ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు కనకవర్షం కురిపిస్తున్నాయి. వీటిలో లింక్డ్‌ఇన్, మోజాంగ్‌ (మైన్‌‌క్రాఫ్ట్ వీడియో గేమ్‌), న్యూయన్స్, గిట్‌ హబ్‌ వంటివి ఉన్నాయి.

గత సీఈఓ, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ బామర్‌ 14 ఏళ్ల సారథ్యంలో కంపెనీ షేరు 32 శాతం పడిపోగా, ఆయన కొనుగోలు చేసిన అక్వాంటివ్, నోకియా మొబైల్‌ బిజినెస్‌ వంటివి కంపెనీకి నష్టాలు మిగల్చడం గమనార్హం. ఇక ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఐటీ కంపెనీగా, టాప్‌ మల్టీనేషనల్‌ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తున్న ఐబీఎం సారథిగా కూడా భారత్‌కు చెందిన అరవింద్‌ కృష్ణను నియమించడం విశేషం. తాజాగా గూగుల్‌ అనుబంధ సంస్థ యూట్యూబ్‌ సీఈఓగా పగ్గాలు చేపట్టిన నీల్‌మోహన్ కూడా ఈ జాబితాలో చేరారు.

లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ..
ఫార్చూన్-500 ప్రపంచ టాప్‌ కంపెనీల్లో దాదాపు 60 కంపెనీలకు భారత సంతతికి చెందిన వారే సీఈఓలు. మనోళ్లు సారథ్యం వహిస్తున్న ఈ కార్పొరేట్‌ దిగ్గజాల మార్కెట్‌ విలువ ఏకంగా 6 లక్షలకోట్ల (ట్రిలియన్) డాలర్లకు పైగానే ఉంటుంది. మన కరెన్సీలో చూస్తే ఈ విలువ దాదాపు రూ. 492 లక్షలకోట్లు. మన దేశ ప్రస్తుత జీడీపీ (స్థూలదేశీయోత్పత్తి) విలువ దాదాపు 3.2 ట్రిలియన్ డాలర్లు కాగా, అంతర్జాతీయంగా భారతీయ గ్లోబల్‌ సీఈఓల నేతృత్వంలోని కంపెనీల మార్కెట్‌ విలువ దీనికి రెట్టింపు కావడం విశేషం.

అంతేకాదు మొత్తం ఆఫ్రికా ఖండంలోని దేశాల జీడీపీ (3.1 ట్రిలియన్ డాలర్లు)తో లెక్కగట్టినా ఈ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ దాదాపు డబుల్‌ అన్నమాట. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లోని ఎస్‌ అండ్‌ పీ-500 ఇండెక్స్‌ మొత్తం మార్కెట్‌ విలువలో 13 శాతం వాటా భారతీయ సీఈఓల నిర్వహణలో ఉన్న కంపెనీలదే. మనోళ్ల సత్తా అది మరి! ఇక ఆయా కంపెనీల ఆదాయాలు, లాభాలదీ అదిరిపోయే రేంజే. నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్‌ 2022లో 202 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికర లాభం 72 బిలియన్ డాలర్లు (రూ. 5 లక్షల కోట్లు).

సుందర్‌ పిచాయ్‌ నాయకత్వం వహిస్తున్న ఆల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృ సంస్థ) గతేడాది 282 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని, 60 బిలియన్  డాలర్ల నికరలాభాన్ని సంపాదించింది. ఇక మిగతా 60 కంపెనీల ఏడాది లాభాలను కూడా లెక్కేస్తే ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీని మించి పోతుంది. ప్రస్తుతం ప్రపంచంలో ట్రిలియన్ డాలర్లకు పైగా మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీలు 4 మాత్రమే ఉండగా (యాపిల్, సౌదీ ఆరామ్‌కో, మైక్రోసాఫ్ట్, గూగుల్‌) వీటిలో రెండింటి పగ్గాలు మనోళ్ల చేతిలోనే ఉన్నాయి. ఇక టాప్‌-100 ప్రపంచ కంపెనీల్లో మన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (మార్కెట్‌ విలువ 196 బిలియన్ డాలర్లు, ర్యాంక్‌ 47), టీసీఎస్‌ (149 బిలియన్ డాలర్లు, ర్యాంక్‌ 74), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (126 బిలియన్ డాలర్లు, ర్యాంక్‌ 96) మాత్రమే ఉన్నాయి.

ఏ రంగమైనా సై..
ఇందు గలరందు లేరని సందేహము వలదు, ఎందెందు వెదకి చూసినా భారతీయ సీఈఓలు అందందే గలరు అన్న చందాన..  మనోళ్లుఅన్ని రంగాల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు. టెక్నాలజీలో చేయి తిరిగిన భారతీయులు ఇతర రంగాలకు చెందిన అనేక గ్లోబల్‌ దిగ్గజాల సీఈఓలుగానూ దూసుకెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫార్మా అగ్రగామి నోవార్టిస్‌.

అమ్మకాలపరంగా ఫైజర్‌ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీగా నిలుస్తున్న ఈ కంపెనీకి సారథిగా ఉన్నది కూడా భారత్‌కు చెందిన వసంత్‌ నరసింహన్. ఇక ప్రపంచంలోనే నంబర్‌వన్‌ కాఫీ రిటైల్‌ బ్రాండ్‌గా నిలుస్తున్న స్టార్‌బక్స్‌ ఘుమఘుమలు దశదిశలా వ్యాపించేలా చేస్తున్నది లక్ష్మణ్‌ నరసింహన్. గతంలో ఆయన బ్రిటిష్‌ కన్జూమర్‌ గూడ్స్‌ దిగ్గజం రెకిట్‌ బెన్కిసర్‌ సీఈఓగా కూడా పనిచేశారు.



ప్రపంచ స్కాచ్‌ విస్కీ రారాజుగా వెలుగొందుతున్న బ్రిటిష్‌ కంపెనీ డియాజియో పగ్గాలు సైతం మన ఇవాన్మెనెజెస్‌ చేతిలోనే ఉన్నాయి. ప్రపంచంలో అమ్ముడవుతున్న ప్రతి 5 స్కాచ్‌ విస్కీ బాటిల్స్‌లో ఒకటి డియాజియోకు చెందిన ‘జానీవాకర్‌’ బ్రాండ్‌దే కావడం విశేషం. గ్లోబల్‌ మల్టీనేషనల్‌ కెమికల్‌ కంపెనీ.. లిండే సీఈఓగా గత ఏడాది సంజీవ్‌ లాంబా బాధ్యతలు చేపట్టారు. ఆదాయం, మార్కెట్‌ వాటా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్‌ గ్యాస్‌ కంపెనీగా వెలుగొందుతోంది. గ్లోబల్‌ కన్సల్టింగ్‌ వ్యాపార రంగంలో వరుసగా ఐదో ఏడాది కూడా నంబర్‌ 1 స్థానాన్ని చేజిక్కించుకున్న డెలాయిట్‌ను నడిపిస్తోంది భారతీయ సంతతికి చెందిన పునీత్‌ రంజన్. బిగ్‌ అంతర్జాతీయ అకౌంటింగ్‌ కంపెనీల్లో సైతం డెలాయిట్‌దే పైచేయి.



ఇక మరో గ్లోబల్‌ ఫార్మాదిగ్గజం వెర్టెక్స్‌ సీఈఓ రేష్మా కేవలరమణి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద లాజిస్టిక్స్‌ కంపెనీగా నిలుస్తున్న ఫెడెక్స్‌ చీఫ్‌ రాజ్‌ సుబ్రమణ్యం, మల్టీనేషనల్‌ ఇంజినీరింగ్‌ దిగ్గజం ఎమర్సన్ ఎలక్ట్రిక్‌ కంపెనీ చీఫ్‌ సురేంద్రలాల్‌ కర్సన్ భాయ్, గ్లోబల్‌ టాప్‌-10 ఇన్సూరెన్స్ కంపెనీల్లోఒకటైన ప్రుడెన్షియల్‌ సారథి అనిల్‌ వాధ్వానీ, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ దిగ్గజం అరిస్టా నెట్‌వర్క్స్‌ సీఈఓ జయశ్రీ ఉల్లాల్, సింగపూర్‌ బ్యాంకింగ్‌ అగ్రగామి డీబీఎస్‌ గ్రూప్‌సీ ఈఓ పియూష్‌ గుప్తా, బ్రిటిష్‌ మల్టీనేషనల్‌ బ్యాంక్‌ బార్‌క్లేస్‌ గ్రూప్‌ సీఈఓ సీఎస్‌ వెంకట కృష్ణన్, ప్రపంచ ఫుట్‌వేర్‌ దిగ్గజం బాటా కార్పొరేషన్ సీఈఓ సందీప్‌ కటారియా, డొమైన్ నేమ్‌ సర్వీసుల రంగంలో ప్రపంచ నంబర్‌ వన్ గోడాడీ సీఈఓ అమన్ భూటానీ సైతం తమ ప్రతిభాపాటవాలతో భారతీయ లీడర్స్‌గా అవతరించారు.

ఇక బ్రిటిష్‌ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్‌ ‘చానెల్‌’ను నడిపిస్తున్నది భారతీయ సంతితికి చెందిన లీనా నాయర్‌ కావడం మరో విశేషం. ప్రపంచ టాప్‌-5 లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో లూయీ విటోన్‌ను వెనక్కి నెట్టి ఈ ఏడాది ‘చానెల్‌’ మూడో ర్యాంకును చేజిక్కించుకుందంటే అదంతా నాయర్‌ ఘనతే! ఇలా ఒకటేంటి కార్పొరేట్‌ ప్రపంచంలో దాదాపు అన్ని రంగాలకు చెందిన అగ్రస్థాయి కంపెనీలు ఇప్పుడు తమకు భారతీయ లీడర్లే కావాలంటూ వెంట పడుతున్నారు!! మాజీ గ్లోబల్‌ సీఈఓలు పెప్సీకో ఇంద్రానూయీ, వొడాఫోన్ అరుణ్‌ శరీన్, నోకియా రాజీవ్‌ సూరి, సన్ మైక్రోసిస్టమ్స్‌ వినోద్‌ ఖోస్లా, హార్మన్ ఇంటర్నేషనల్‌ దినేష్‌ పలివాల్, సిటీ బ్యాంక్‌ విక్రమ్‌ పండిట్, ట్విటర్‌ పరాగ్‌ అగర్వాల్‌ కూడా ఈ కోవకు చెందినవారే.

మన మూలాలే బలం..
భారతీయులు గ్లోబల్‌ కంపెనీల్లో లీడర్‌షిష్‌ స్థానాలకు చేరుకోవడానికి కారణం మన మూలాలే. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మన విద్యా వ్యవస్థ. ప్రస్తుతం సారథ్యం వహిస్తున్న వారిలో చాలామంది దాదాపు భారత్‌లోనే గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోవడం.. ముఖ్యంగా ఐఐటీలు, ఇతర అత్యున్నత కాలేజీల్లో ఇంజినీరింగ్‌ చేయడం గమనార్హం. మనకున్న ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేసి, అమెరికా, యూరప్‌ తదితర దేశాల్లో మరింత ఉన్నత చదువులు చదవడం కూడా వారి ఎంపికకు దోహదం చేస్తోంది. అంటే ప్రాథమికస్థాయిలో వారికి బలమైన నాయకత్వ పునాదులు ఇక్కడే పడ్డాయని చెప్పుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంగ్లిష్‌ భాషపై మనోళ్లకున్న పట్టు కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కీలకపాత్ర పోషిస్తోందని సింగపూర్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం డీబీఎస్‌ గ్రూప్‌ సీఈఓ పియూష్‌ గుప్తా విశ్లేషించారు.

చాలా వరకు మధ్యతరగతి బ్యాగ్రౌండ్‌ నుంచి రావడం కూడా సాధించాలన్న పట్టుదలకు ప్రధాన కారణమనేది ఆయన అభిప్రాయం. చొచ్చుకుపోయే తత్వం, ఎలాంటి సవాళ్లనైనా అధిగమించ గల ఆత్మవిశ్వాసం, నిర్వహణ సామర్థ్యం, పరిస్థితులకు అనువుగా మారగల నైజం, కుటుంబ విలువలు, తోటివారికి చేయూతనందించడం ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అన్నిరంగాల్లోనూ అగ్రస్థానాలకు చేరుకునేలా చేస్తున్నాయని అంటున్నారు ఫైర్‌ ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రేమ్‌ వత్స.  భారతీయులు సహజంగానే పొదుపరులు. కంపెనీ చీఫ్‌లుగా అనవసర వ్యయాలను తగ్గించి, లాభాలను పెంచడంలో తమకు సాటిలేదని నిరూపించుకుంటున్నారు. ఇది కూడా వారికి సారథ్యాన్ని కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషిస్తోంది. అంతేకాదు, మన ఆర్థికవ్యవస్థ పురోగతి సైతం భారతీయుల నాయకత్వానికి దన్నుగా నిలుస్తోంది.

అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించింది. ప్రస్తుతం 3.2 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న జీడీపీ 2028 కల్లా 5 ట్రిలియన్ డాలర్లకు, 2036 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు, 2045 నాటికి 20 ట్రిలియన్ డాలర్లను అధిగమించనుందని ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ తాజా నివేదికలో అంచనా వేయడం గమనార్హం. అంతేకాదు స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌లో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలుస్తూ నవకల్పనలకు పెద్దపీట వేస్తుండటం కూడా ఎంట్రప్రెన్యూర్స్, నాయకత్వలక్షణాలకు దోహదం చేస్తోందనేది పరిశ్రమ నిపుణుల మాట. దేశంలో యూనికార్న్‌లుగా (బిలియన్ డాలర్ల విలువను అధిగమించినవి) ఆవిర్భవించిన స్టార్టప్స్‌ సంఖ్య ఇప్పటికే 100కు చేరింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ స్టార్టప్స్‌లో కూడా 25 శాతం సంస్థల సారథ్యం భారతీయుల చేతిలోనే ఉండటం భవిష్యత్తులో మనోళ్ల జోరుకు అద్దం పడుతోంది.
 
దక్షిణాది దూకుడు.. తెలుగు వెలుగులు!
అమెరికా, యూరప్, ఆసియాలోని అనేక గ్లోబల్‌ మల్టీనేషనల్‌ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న మెజారిటీ భారత సంతతి సీఈఓలు దక్షిణ భారతావనికి చెందిన వారే కావడం మరో విశేషం. సందర్‌ పిచాయ్, వసంత్‌ నరసింహన్, లక్ష్మణ్‌ నరసింహన్, రాజేష్‌ సుబ్రమణ్యం, రంగరాజన్ రఘురామ్, గణేష్‌ మూర్తి, రవి కుమార్, సీఎస్‌ వెంకట కృష్ణన్ ఇంకా చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాదు, మైక్రోసాఫ్ట్‌ సత్య నాదెళ్ల, అడోబ్‌ శంతను నారాయణ్, ఐబీఎం అరవింద్‌ కృష్ణ, కేవియం సీఈఓ సయ్యద్‌ అష్రాఫ్‌ అలీ, కెనడా ఆటోమొబైల్‌ కాంపొనెంట్‌ దిగ్గజం మ్యాగ్నా కార్పొరేషన్ సీఈఓ సీతారామ (స్వామి) కోటగిరి వీళ్లంతా తెలుగు రాష్ట్రాల్లో జన్మించారు. సత్య నాదెళ్ల, శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ కాబోతున్న అజయ్‌పాల్‌ సింగ్‌ బంగా హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (హెచ్‌పీఎస్‌) పూర్వ విద్యార్థులు. కెనడా ఆర్థిక సేవల దిగ్గజం ఫెయిర్‌ ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రేమ్‌ వత్స సైతం హెచ్‌పీఎస్‌లోనే హైస్కూల్‌ చదువు పూర్తి చేశారు. ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్‌ విలువ 18 బిలియన్ డాలర్లు.

ఏడాదికి రూ. 2,300 కోట్లు!
ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ శాలరీ ప్యాకేజీ చూస్తే కళ్లు బైర్లు గమ్మాల్సిందే! 2022లో ప్రపంచంలోకెల్లా అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీలు అందుకున్న టాప్‌-10 సీఈఓల్లో సుందర్‌ కూడా ఒకరు. ఆయన ఏకంగా 28 కోట్ల డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ. 2,300 కోట్లు. ఏంటీ ఈ సొమ్ముతో ఏకంగా ఒక కంపెనీయే పెట్టేయొచ్చు అనుకుంటున్నారా.. అట్లుంటది మరి మన సుందర్‌తోని! అంతేకాదు ప్రస్తుతం సుందర్‌ ఆస్తుల విలువ దాదాపు 150 కోట్లడాలర్ల (రూ.12,300 కోట్లు)  పైనే అని అంచనా. ఒక మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీలో పుట్టిన సుందర్‌ పిచాయ్‌ తన కలలను సాకారం చేసుకున్న తీరు, ఆయన లైఫ్‌ జర్నీ భారతీయ యువతకు నిజంగా గొప్ప స్ఫూర్తిదాయక పాఠం.

చిన్నప్పుడు తామంతా హాల్లో ఒకే చోట కిందే పడుకునేవారిమని.. మొదటిసారి ఇంట్లోకి ఫ్రిజ్‌ వచ్చినప్పుడు కలిగిన ఆనందం ఇంకా తన కళ్లముందే కదలాడుతోందంటూ పిచాయ్‌ ఒక ఇంటర్వ్యూలో నెమరువేసుకున్న తీపిగుర్తులు ఆయన ఏ స్థాయి నుంచి టెక్నాలజీ ఎవరెస్ట్‌ను అధిరోహించారనేందుకు చిన్న ఉదాహరణ మాత్రమే! మైక్రోసాఫ్ట్‌ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్లదీ దాదాపు ఇలాంటి సక్సెస్‌ జర్నీయే. ఆయన 2022లో అందుకున్న మొత్తం ప్యాకేజీ 5.5 కోట్లడాలర్లు (రూ. 451 కోట్లు). నాదెళ్ల నెట్‌వర్త్‌ సుమారు 81 కోట్ల డాలర్లు (రూ.6,700 కోట్లు)గా అంచనా. ఐబీఎం చీఫ్‌ అరవింద్‌ కృష్ణ, పాలో ఆట్లో సీఈఓ నికేష్‌ అరోరా, స్టార్‌బక్స్‌ సీఈఓ లక్ష్మణ్‌ నరసింహన్ ఇలా భారత సంతతికి చెందిన గ్లోబల్‌ సీఈఓలు అందరూ ఏటా రూ.150 నుంచి రూ.300 కోట్ల స్థాయిలో వార్షిక వేతన ప్యాకేజీలను అందుకుంటుండటం వారి ప్రతిభకు దక్కుతున్న ప్రతిఫలానికి నిదర్శనం.

అపూర్వసహోదరులు..
ప్రపంచ బ్యాంక్‌ అత్యున్నత పదవి సైతం భారతీయుడినే వరిస్తోంది. వరల్డ్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌గా అజయ్‌ బంగాను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇటీవలే నామినేట్‌ చేశారు. దీంతో ఈ పదవిని చేపట్టనున్న తొలి భారతీయుడిగా బంగా రికార్డ్‌ సృష్టించారు. మాస్టర్‌కార్డ్‌ సీఈఓగా 12 ఏళ్ల పాటు పని చేసిన అజయ్‌ బంగా కోవిడ్‌ సమయంలో కూడా కంపెనీలో ఉద్యోగాల కోత అనేది లేకుండా చూశారు. 50 కోట్లమంది డిజిటల్‌ ఎకానమీలో భాగస్వామ్యం అయ్యేలా తోడ్పాటు అందించారు. ప్రస్తుతం బంగా పీఈ సంస్థ జనరల్‌ అట్లాంటిక్‌ వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. అంతేకాదు, అజయ్‌ సోదరుడు ఎంఎస్‌ బంగా సైతం ప్రపంచ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్‌లో టాప్‌ పొజిషన్లలో పని చేశారు.

అంతక్రితం ఆయన హిందుస్థాన్ యూనిలీవర్‌ సీఈఓగా ఉన్నారు. అంతేకాదు, నోవార్టిస్‌ సీఈఓ వసంత్‌ నరసింహన్, కాఫీ కింగ్‌ స్టార్‌బక్స్‌ సీఈఓ లక్ష్మణ్‌ నరసింహన్ కూడా స్వయానా అన్నదమ్ములే. మరో సోదరుల జంట కూడా గ్లోబల్‌ సీఈఓలుగా ‘మా ఆట సూడు నాటు.. నాటు.. నాటు’ అంటూ దుమ్ము రేపుతున్నారు. హైబ్రీడ్‌ క్లౌడ్‌ డేటా సర్వీసుల గ్లోబల్‌ కంపెనీ నెట్‌యాప్‌ సీఈఓ జార్జ్‌ కురియన్, గూగుల్‌క్లౌడ్‌ సీఈఓ థామస్‌ కురియన్ ఇద్దరూ ఒకే రంగంలోని రెండు దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్నారు. ఈ అపూర్వసహోదరులు... ప్రపంచ కార్పొరేట్‌రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకుంటూ భారత్‌కు గర్వకారణంగా నిలుస్తున్నారు.

-శివరామకృష్ణ మిర్తిపాటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement