
న్యూఢిల్లీ: పోటీ సంస్థలను దెబ్బతీసే విధమైన ధరలు నిర్ణయిస్తున్నాయని, భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయని, గిగ్ వర్కర్ల శ్రమ దోపిడీ చేస్తున్నాయని ఈ–కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంలపై ఆరోపణలున్న నేపథ్యంలో వాటిని పర్యవేక్షించేందుకు స్వతంత్ర డిజిటల్ కామర్స్ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ కేంద్రాన్ని కోరింది.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద నేషనల్ ఈ–కామర్స్ పాలసీ, ఈ–కామర్స్ నిబంధనలను సత్వరం ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేయడం లగ్జరీగానే పరిగణించవచ్చు కాబట్టి ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా విక్రయించే ఉత్పత్తులపై ప్రస్తుత జీఎస్‌టీ నిబంధన ప్రకారం ’లగ్జరీ ట్యాక్స్’ విధించాలని సీఏఐటీ పేర్కొంది.
లాభదాయకత లేకపోవడంతో గత రెండు, మూడేళ్లలో 10 లక్షల పైగా కిరాణా దుకాణాలు మూతబడ్డాయని ఆలిండియా కన్జూమర్ ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్ ఫెడరేషన్ (ఏఐసీపీడీఎఫ్) నేషనల్ ప్రెసిడెంట్ ధైర్యశీల్ పాటిల్ తెలిపారు. ఈ వ్యవధిలో కొత్తగా ప్రారంభమైన స్టోర్లతో పోలిస్తే మూతబడినవే ఎక్కువని వివరించారు.