దేశంలో జరిగే అత్యంత ప్రసిద్ధమైన పండుగలలో గణేష్ చతుర్థి ఒకటి. పిల్లలు, పెద్దలు అందరికీ ఇష్టమైన ఈ వేడుక వస్తోందంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. దేశవ్యాప్తంగా సంబరాన్ని పంచే గణేష్ చతుర్థి.. ఏటా వేలాది కోట్ల రూపాయల వ్యాపారాన్ని అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకూ తోడ్పడుతోంది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రకారం.. దేశంలో ప్రధాన హిందూ పండుగ అయిన గణేష్ చతుర్థి సందర్భంగా ఈ సారి రూ.25,000 కోట్ల వ్యాపారం జరుగుందని అంచనా. చైనీస్ ఉత్పత్తులను పూర్తిగా పక్కన పెట్టి దేశీయ వస్తువులను వ్యాపారులు ప్రోత్సహిస్తున్న విషయాన్ని వ్యాపారుల సంఘం గుర్తుచేస్తోంది.
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో గణేష్ చతుర్థి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లో సందర్భంగా జరిగే వ్యాపారం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందిస్తుందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ఎమిరిటస్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.
20 లక్షల గణేష్ మంటపాలు
ఈ సారి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల గణేష్ మంటపాలు ఏర్పాటైనట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భార్టియా తెలిపారు. 7 లక్షలకు పైగా మంటపాలతో మహారాష్ట్ర ముందంజలో ఉండగా, కర్ణాటక 5 లక్షలతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లు ఒక్కొక్కటి 2 లక్షలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సెటప్, అలంకరణలు, పూజా కార్యక్రమాలకే ఒక్కో మంటపానికి కనీసం రూ.50,000 ఖర్చవుతుందని, మొత్తం ఖర్చు రూ.10,000 కోట్లు దాటుతుందని ఆయన భావిస్తున్నారు.
గణేష్ విగ్రహాల వ్యాపారమే రూ. 500 కోట్లకు పైగా ఉంటుందన్నారు. పూలు, దండలు, కొబ్బరికాయలు వంటి నిత్యావసర వస్తువులు ఆర్థిక వ్యవస్థకు మరో రూ. 500 కోట్లు జోడిస్తాయన్నారు. ఇక లడ్డూలు, ఇతర స్వీట్స్‌కు సంబంధించిన అమ్మకాలు రూ. 2,000 కోట్లకు మించి ఉంటాయని అంచనా. క్యాటరింగ్ వంటి సేవల ద్వారా జరిగే దాదాపు రూ. 3,000 కోట్లు ఉంటుంది.
పండుగ సందర్భంగా జరిగే ప్రయాణాలు, బస ఖర్చు సుమారు రూ. 2,000 కోట్లు, పండుగ సంబంధిత వస్తువులైన బట్టలు, ఉపకరణాలు, గృహాలంకరణ, బహుమతి వస్తువుల రిటైల్ విక్రయాలు దాదాపు రూ. 3,000 కోట్లకు చేరవచ్చు. ఇక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు పెద్ద ఎత్తున పబ్లిక్ ఈవెంట్‌లను నిర్వహించడం ద్వారా రూ. 5,000 కోట్లు ఆర్జిస్తున్నాయని బీసీ భార్టియా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment