
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రాణప్రతిష్ట జనవరి 22న జరగబోతోంది. ఈ పుణ్య తరుణం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే భక్తి, ఆధ్యాత్మికతతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది వ్యాపారులు, చిరు వర్తకులు రాముని దయతో నాలుగు డబ్బులు సంపాదించుకోబోతున్నారు.
రూ. 50,000 కోట్ల వ్యాపారం
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరిగే ప్రస్తుత జనవరి నెలలో భారతదేశం అంతటా రూ. 50,000 కోట్ల వ్యాపారం జరిగేలా దేశానికి సహాయపడుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేస్తోంది. ‘జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు చాలా ఉత్సాహంగా, ఆతృతగా చూస్తున్నారు. ఇది రాముడు, రామ మందిరానికి సంబంధించిన ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేసేలా దోహదపడుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోని సభ్య వ్యాపారులు విస్తృతమైన సన్నాహాలు చేశారు’ అని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నట్లుగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది.
ఎక్కువగా అమ్ముడయ్యే వస్తువులు ఇవే..
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రకారం.. ప్రత్యేకమైన కండువాలు, లాకెట్లు, కీ చైన్లు, రామ మందిర నమూనాలు, రామ్ దర్బార్, రామధ్వజ చిత్రాలు మొదలైన వాటికి దేశమంతటా ప్రస్తుతం గణనీయమైన డిమాండ్ ఉంది.
వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా గాజులు, పెండెంట్‌లు వంటి అనేక రకాల ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు రామమందిర చిత్రాలను కలిగిన కుర్తాలు, టీ షర్టులు, ఇతర దుస్తులకు బలమైన మార్కెట్ డిమాండ్ ఉన్నట్లు సీఏఐటీ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment