adobe sytems
-
మూడో భారీ ఎకానమీ దిశగా భారత్!
న్యూయార్క్: భారత్ త్వరలో మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో దేశ ఆరి్థక వృద్ధిలో భాగమవ్వాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని అమెరికన్ దిగ్గజ సంస్థల సీఈవోలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తాము అధికారం చేపట్టిన మూడో విడత కాలంలో (2024–29) భారత్‌ను భారీ ఎకానమీల్లో మూడో స్థానానికి చేర్చేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం 3.9 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారత్ అయిదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక, సాంకేతికత ప్రగతితో లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కంపెనీలకు ప్రధాని సూచించారు. యావత్ ప్రపంచం కోసం ఉత్పత్తులు, సేవలను రూపొందించేందుకు, ఉత్పత్తి చేసేందుకు భారత్‌తో చేతులు కలపాలని ఆయన పేర్కొన్నారు. మేధోహక్కుల పరిరక్షణకు, టెక్నాలజీలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తయారీ, సెమీకండక్టర్లు తదితర విభాగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. ‘సెమీకండక్టర్ల తయారీకి గ్లోబల్ హబ్’గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. ‘టెక్ సీఈవోలతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. టెక్నాలజీ, నవకల్పనలు మొదలైన అంశాలు చర్చకు వచ్చాయి. ఆయా విభాగాల్లో భారత పురోగతిని వివరించాను’ అని ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నిర్వహించిన సమావేశంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఎడోబ్ సీఈవో శంతను నారాయణ్, యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలకు అనుకూలమైన విధానాలతో భారత్, అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతోందని సీఈవోలు కితాబిచ్చారు. ఎన్విడియా, గూగుల్ మరింత ఫోకస్ భారత్‌పై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు గూగుల్, ఎన్విడియా తదితర టెక్ దిగ్గజాలు వెల్లడించాయి. దేశీయంగా కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ వినియోగంపై ఫోకస్ పెట్టనున్నట్లు మోదీతో భేటీ అనంతరం సీఈవోలు తెలిపారు. డిజిటల్ ఇండియా విజన్ ద్వారా భారత్‌లో పరివర్తన తేవడంపై ప్రధాని దృష్టి పెట్టారని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయం వంటి విభాగాల్లో వినూత్న సొల్యూషన్స్ రూపొందించాలని ఆయన సూచించారు. భారత్‌లో ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. మరింతగా కలిసి పనిచేయడంపై ఆసక్తిగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. భారత్‌తో తమకు ఇప్పటికే వివిధ విభాగాల్లో భాగస్వామ్యం ఉందని, అధునాతన టెక్నాలజీ లను అందుబాటులోకి తెస్తున్నామని ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ తెలిపారు. -
Siddhita Mohanty: లాక్డౌన్ టైమ్ అనేది.. నాకు గోల్డెన్ టైమ్! ఎందుకంటే?
పిల్లల లోకంలో కార్టూన్లు, కార్టూన్ల లోకంలో పిల్లలు ఉంటారు. ఎంతోమంది పిల్లలలాగే సిద్ధిత మొహంతికి కార్టూన్లు అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టం వినోదానికే పరిమితమై΄ోలేదు. సాంకేతిక విషయాలపై ఆసక్తికి దారి తీసింది. ఆ దారి తనను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దగ్గరికి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన పదిహేనేళ్ల సిద్ధిత పదమూడేళ్ల వయసులోనే స్టార్టప్ మొదలు పెట్టేలా చేసింది..పదమూడు సంవత్సరాల వయసులో ‘బ్లూమ్ రిద్దీ సిద్ధీ’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది సిద్ధిత మొహంతి. గ్రాఫిక్ డిజైనింగ్, కంప్యూటర్ లిటరసీకి సంబంధించిన స్టార్టప్ ఇది. తల్లిదండ్రులు సిద్ధితకు లాప్టాప్ కొనివ్వడంతో అది తన ప్రయోగాలకు వేదిక అయింది. మొదట్లో యూట్యూబ్‌లో కార్టూన్ వీడియోలు మాత్రమే చూసేది. ఆ తరువాత ఆమె ఆసక్తి సాంకేతిక విషయాలపై మళ్లింది. డిజిటల్ డిజైన్ అనేది పాషన్‌గా మారింది. డిజిటల్ డిజైనింగ్ అనే కోర్సు ఉంటుందని తెలియని వయసులోనే సొంతంగా డిజైన్లు చేసి అందరూ ‘వావ్’ అనేలా చేసేది. బొమ్మలు గీయడంలోనూ సిద్ధితకు మంచి నైపుణ్యం ఉంది.బెంగళూరులోని సిద్ధిత చదివే ‘ఆర్చిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్’ బాగా ప్రోత్సహించింది. ‘లాక్డౌన్ టైమ్ అనేది నాకు గోల్డెన్ టైమ్’ అంటున్న సిద్ధిత ఆ ఖాళీ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. ‘నా గురించి నేను బాగా తెలుసుకోవడానికి, ఇంకా ఏం చేయవచ్చు అని ఆలోచించడానికి ఆ ఖాళీ సమయం నాకు ఉపయోగపడింది’ అంటుంది సిద్ధిత. తన స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లైఫ్ స్కిల్స్, వెబ్ డిజైన్, కోడింగ్, రొబోటిక్స్. పబ్లిక్ స్పీకింగ్, నేచురల్ లాంగ్వేజ్ప్రాసెసింగ్, స్పోకెన్ ఇంగ్లీష్....మొదలైన ఎన్నో కోర్సులు చేసింది. ఈ కోర్సులన్నీ పూర్తి చేసిన తరువాత ఏదైనా సాధించాలనే తపన సిద్ధితలో మొదలైంది.ఇప్పటి వరకు 50 యాప్స్, 1,000 త్రీడీ డిజైన్లు క్రియేట్ చేసింది. జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌లో పాల్గొంది. ఒక సమావేశంలో పాల్గొన్న సిద్ధితకు చిన్న వయసులోనే ఎంటర్ప్రెన్యూర్లుగా ప్రయాణంప్రారంభించిన ఎంతో మందితో మాట్లాడే అవకాశం వచ్చింది. వారి మాటల నుంచి స్ఫూర్తి ΄÷ంది తాను కూడా స్టార్టప్ మొదలు పెట్టింది. పదమూడేళ్ల వయసులో ‘గర్ల్ప్రాడిజీ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. సాంకేతిక విషయాలలో ప్రతిభ చూపుతున్న సిద్ధితకు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. గ్రాఫిక్ డిజైనింగ్‌తో పాటు రచనలు చేయడం, కరాటే, క్రికెట్ అంటే సిద్ధితకు ఇష్టం. మెడిసిన్ చదవాలనేది ఆమె కల. ‘సూపర్ సిద్ధి’ పేరుతో పుస్తకం రాసే పనిలో ఉంది.ఎడోబ్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్లు..ఎడోబ్ ఎక్స్‌ప్రెస్(ఎడ్యుకేషన్)లో జనరేట్ టెక్ట్స్ ఎఫెక్ట్, జనరేట్ ఇమేజ్, జనరేటివ్ ఫిల్లాంటి ఏఐ వపర్డ్ ఫీచర్లు ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మరింత ఉపయోగపడే విధంగా ‘ఎడోబ్ ఎక్స్‌ప్రెస్’ను అప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది ఎడోబ్. క్రియేటివిటికి ఉపయోగపడేలా ఈ ఏఐ ఫీచర్లను డిజైన్ చేశారు. వీటితో టెంప్లెట్లు, బ్రోచర్లు, ఫ్లైయర్స్, ఒరిజినల్ కలలింగ్ పేజీలు జననరేట్ చేయవచ్చు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని యానిమేషన్ ఫీచర్లు తీసుకురానుంది ఎడోబ్. -
AI ఆవిష్కరణలకు వేదికగా మారిన అడోబీ
ప్రముఖ టెక్ దిగ్గజం అడోబీ అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ‘అడోబీ యాన్యువల్ మ్యాక్స్ కాన్ఫిరెన్స్ నిర్వహించింది. అక్టోబర్ 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ కాన్ఫరెన్స్ కొత్త కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా అక్టోబర్ 10 ప్రారంభమైన ఈ కాన్ఫరెన్స్‌లో అడోబీ సంస్థ సుమారు 11 కొత్త ఏఐ ఆధారిత ప్రోటో టైప్ టూల్స్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. స్నీక్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో వీడియో అప్స్కేలర్, ప్రాజెక్ట్ స్టార్డస్ట్లు హైలెట్‌గా నిలిచాయి.ముఖ్యంగా ఆబ్జెక్ట్-అవేర్ ఎడిటింగ్ ఇంజన్ ఏఐ టూల్ సాయంతో ఫోటోల్లో అనవసరమైన వస్తువుల్ని తొలగించడం కావాల్సిన వాటిని జత చేయొచ్చు. దీంతో పాటు ప్రాజెక్ట్ ప్రింరోస్ చూపురులను వీపరితంగా ఆకట్టుకుంది. ‘ఫ్లెక్సిబుల్ టెక్స్టైల్ డిస్ప్లే’లో భాగంగా అడోబీ కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల డిజైన్లు మారిపోడంతో పాటు నచ్చిన చిత్రాల్ని సైతం వీక్షించొచ్చు. ఇప్పటికే అడోబీ స్మార్ట్ డిస్ప్లే ఫాబ్రిక్ టెక్నాలజీని గతంలోనే పరిచయం చేసింది. కానీ ఇప్పుడు ఈ సాంకేతికలో ఏఐని జోడించింది. అందంగా తీర్చిదిద్దింది. -
అడోబ్ కోఫౌండర్ జాన్ వార్నాక్ కన్నుమూత
అమెరికన్ మల్టీనేషనల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్ (Adobe) సహ వ్యవస్థాపకుడు జాన్ వార్నాక్ (John Warnock) కన్నుమూశారు. జాన్ వార్నాక్ 82 సంవత్సరాల వయసులో శనివారం (ఆగస్టు 19) మరణించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే వార్నాక్ మరణానికి కారణం వెల్లడించలేదు. వార్నాక్ 1982లో చార్లెస్ గెష్కేతో కలిసి శాన్ జోస్ కేంద్రంగా అడోబ్ కంపెనీని ప్రారంభించారు. 2000 సంవత్సరం వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న ఆయన 2001లో పదవీ విరమణ చేసే వరకు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. వార్నాక్ 2017 వరకు దాదాపు మూడు దశాబ్దాల పాటు కంపెనీ బోర్డు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఎక్కువ కాలం గెష్కేతో కలిసి సంయుక్తంగా ఆ పదవిలో కొనసాగారు. వార్నాక్ మరణించే వరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డులో కొనసాగారు. గెష్కే 2021లో 81 ఏళ్ల వయసులో మరణించారు. జాన్ వార్నాక్‌తో కలిసి మెలిగిన గత 25 సంవత్సరాల కాలం వృత్తిపరంగా తన కెరీర్లో అత్యంత కీలకమైందని అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంతను నారాయణ్ ఉద్యోగులకు రాసిన ఒక ఈమెయిల్లో పేర్కొన్నారు. వార్నాక్ తన రోల్ మోడల్, మెంటర్ అని, అంతకన్నా ఎక్కువగా ఒక మంచి స్నేహితుడిగా ఆయన్ను భావిస్తానని తెలిపారు. అడోబ్‌ని స్థాపించడానికి ముందు వార్నాక్ జిరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా పనిచేశారు. వార్నాక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్ పొందారు. గణితశాస్త్రంలో మాస్టర్స్ చేసిన ఆయన గణితం, తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. వార్నాక్కు భార్య మార్వా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
189 బిలియన్ డాలర్ల కంపెనీకి సారధి: రోజుకు రూ.70 లక్షలు సంపాదన
హైదరాబాద్‌లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు శంతను నారాయణ్. సంకల్పం, కృషి, పట్టుదల ప్రతిభతో తన కలను సాకారం చేసుకున్న గొప్ప వ్యక్తి. 189 బిలియన్ డాలర్ల టెక్ దిగ్గజం అడోబ్‌కు సీఈవోగా రోజుకు రూ. 70 లక్షలు సంపాదిస్తున్న నాన్-ఐఐటియన్. భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్తగా, ప్రపంచాన్నేలుతున్న శంతను నారాయణ్ బర్త్‌డే సందర్భంగా సక్సెస్ స్టోరీ.. కార్పొరేట్ ప్రపంచంలో విజయం సాధించాలంటే ఐఐటీ లేదా ఐఐఎంలో చేరడం తప్పనిసరి. కానీ ఐఐటీ చదవ కుండానే ప్రపంచంలోని అతిపెద్ద, దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్‌కు ఛైర్మన్, ప్రెసిడెంట్, సీఈవోగా ప్రతిభను చాటు కుంటున్నారు. ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్స్లో ఒకరిగా ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు. శంతను నారాయణ్ 1962, మే 27 హైదరాబాద్‌లో జన్మించారు. ఫ్యామిలీలో ఆయన రెండో కుమారుడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్) పూర్తి చేశారు. ఆ తర్వాత 1986లో ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ , కాలిఫోర్నియా యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొదారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ సమయంలో ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగానికి బదులు 1986లో MeasureX Automobiles System అనే స్టార్టప్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ మరుసటి సంవత్సరం, 1989లో యాపిల్‌లో చేరారు. అక్కడ ఆరేళ్ల పాటు పలు పోర్ట్‌ఫోలియోల్లో పనిచేశారు. ఇక్కడ పరిచయమైన గురుశరణ్ సింగ్ సంధు తన గురువుగా చెప్తుంటారు.. సవాళ్లను ఎదుర్కొనే మార్గాన్ని ఆయన నుంచే తాను నేర్చుకున్నానంటారు శంతను. యాపిల్‌ను వీడిన తరువాత సిలికాన్ గ్రాఫిక్స్‌లో డైరెక్టర్‌గా చేరిన కొన్నాళ్ల తరువాత అడోబ్ సిస్టమ్స్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గాచేరారు. ఇక అప్పటినుంచి ఆయన కరియర్ మరింత దూసుకుపోయింది. 2005లో సీవోవో, 2007లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. 2008 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి సంస్థను విజయవంతంగా గట్టెక్కించారు. ఒక విధంగా చెప్పాలంటే శంతను నారాయణ్ హయాంలోనే అడోబ్ సిస్టమ్స్ ప్రపంచంలోనే టాప్ సాఫ్ట్వేర్ కంపెనీగా అవతరించింది. కుటుంబ నేపథ్యం తల్లి ప్రొఫెసర్. అమెరికన్ సాహిత్యాన్ని బోధించేవారు. తండ్రి వ్యాపారవేత్త. శంతను బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీలో ఉన్నప్పుడు రేణితో పరిచయం పెళ్లికి దారితీసింది. ఆమె క్లినికల్ సైకాలజీలో డాక్టరేట్ సాధించారు. ఈ దంపతులకు శ్రవణ్ , అర్జున్ నారాయణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శంతనుకి క్రికెట్, సెయిలింగ్ అంటే చాలా ఆసక్తి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆసియా రెగట్టా పోటీలో సెయిలింగ్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం. అంతేకాదు శంతనుకి చిన్నతనంలో జర్నలిజం పట్ల మక్కువ ఉండేదట. తను బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా ఉండకపోతే, అతను ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడిగా ఉండేవాడినని స్వయంగా ఆయనే చెప్పారు. అడోబ్‌తో పాటు, శాంతను డెల్ ఇంక్, ఫైజర్ ఇంక్ , హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, కాలిఫోర్నియాలో డైరెక్టర్ల బోర్డు సభ్యుడు. అంతేకాదు, శంతను అడోబ్ ఫౌండేషన్ అధ్యక్షుడు కూడా. ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరైన శంతను 2022లో దాదాపు 256 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డులు, రివార్డులు ♦2009లో, శంతను నారాయణ్ ప్రతిష్టాత్మకమైన అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ బిజినెస్ అండ్ ఫిలాంత్రోపిక్ లీడర్షిప్ అవార్డును పొందారు. అదే సంవత్సరంలో, 'ది టాప్ గన్ సీఈవో జాబితాలో స్థానం సంపాదించారు. ♦ 2011లో ఓహియోస్ బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. ♦ 2011లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సలహా మండలి సభ్యునిగా నియమితులయ్యారు. ♦ శంతను నారాయణ్ ఫైజర్ కంపెనీకి స్వతంత్ర డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ♦ US-India స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్‌కి వైస్-ఛైర్మన్‌గా ఉన్నారు. ♦ ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో 12వ స్థానం ♦ ది ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా' గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డుతో సత్కరించింది. ♦ 2019 లో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును కూడా అందుకోవడం విశేషం. -
ఆ మూడు సంస్థల ఉద్యోగులకు భారీ షాక్, త్వరలోనే తొలగింపు
ఆర్ధిక మాద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు కాస్ట్ కటింగ్ రూల్‌ను ఫాలో అవుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 20వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేయగా..అడోబ్ సైతం మరో 100 మందిని ఇంటికి సాగనంపనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా స్విగ్గీ, ఎడ్యూటెక్ కంపెనీ వేదాంతులు’ వందల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నాయి. ఫుడ్ ఆగ్రిగేటర్ స్విగ్గీ ఈ డిసెంబర్ నెలలో 250మంది తొలగించనున్నట్లు సమాచారం. దీంతో పాటు రానున్న నెలల్లో స్విగ్గీకి చెందిన ఫుడ్ గ్రాసరీకి చెందిన వందల మందిపై వేటు వేసే ప్రణాళికల్లో ఉండగా..ఈ తొలగింపులపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించలేదు. కానీ పనితీరు ఆధారంగా ఉద్యోగుల్ని ఉంచాలా? తొలగించాలా? అనేది తదుపరి నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం చెబుతుంది. సంస్థకు అనుగుణంగా విధుల నిర్వర్తించలేని ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇప్పటికే సమాచారం అందించింది. ఖర్చుల్ని ఆదా చేసేందుకు కంపెనీ తన ఇన్‌స్టామార్ట్ ఉద్యోగుల్ని సైతం ఉద్యోగం నుంచి తొలగించనుంది. అదేవిధంగా ఎడ్యుటెక్ కంపెనీ వేదాంతు 385 మంది ఉద్యోగులను తొలగించింది . కంపెనీ తన వర్క్ ఫోర్స్‌ను 11.6 శాతం తగ్గించినట్లు నివేదించింది. నిధుల కొరత కారణంగా ఈ ఏడాది వేదాంతు దాదాపు 1100 మందికి పింక్ స్లిప్ జారీ చేయగా..ప్రస్తుతం ఈ ఎడ్యుటెక్ కంపెనీలో 3,300 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. కొన్ని రోజుల క్రితం,అడోబ్ ఖర్చులను తగ్గించుకోవడానికి సేల్స్ విభాగంలో 100 మందిని తొలగించనున్నట్లు సమాచారం.అడోబ్ ‘కొంతమంది ఉద్యోగులను ఆయా డిపార్ట్మెంట్లకు మార్చింది. విధులకు అవసరమైన వారిని నియమించుటుంది. అవసరానికి మించి ఉన్న వారిని తొలగిస్తుందంటూ ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. -
వ్యాక్సిన్ వేసుకోకుంటే జీతం కట్! ఆ కంపెనీ సంచలన నిర్ణయం
కోవిడ్ థర్డ్ వేవ్ భయాలు ప్రపంచాన్ని చుట్టు ముడుతుంటే ఇంకా కొందరు వ్యాక్సిన్ వేసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేస్తున్నారు. హేతుబద్దమైన కారణాలు లేకుండానే టీకా తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇటువంటి వారికి ఝలక్ ఇచ్చింది అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ అడోబ్. కంప్యూటర్‌తో పరిచయం ఉన్న వారికి, ఫోటోగ్రఫీ అంటే ఇంట్రస్ట్ ఉన్న వారికి అడోబ్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఫోటో, వీడియో ఎడిటింగ్‌కి సంబంధించి అనేక సాఫ్ట్వేర్ ఉత్పత్తులను అందించే ఆ సంస్థకు అనేక దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. తమ కంపెనీ ఉద్యోగులందరూ వ్యాక్సిన్లు వేసుకోవాల్సిందే అంటూ ఇప్పటికే పలు మార్లు అడోబ్ కోరింది. జీతం కట్ యాజమాన్యం విజ్ఞప్తిని కొందరు అడోబ్ ఉద్యోగులు పెడ చెవిన పెడుతున్నారు. లాజికల్ రీజన్స్ లేకుండానే వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. దీంతో ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అడోబ్ నిర్ణయించుకుంది. డిసెంబరు 8వ తేదిలోగా వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులను ఆన్ పెయిడ్ లీవ్ కింద పరిగణిస్తామని హెచ్చరించింది. మొదట ఇక్కడ వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులు పని చేసినా, లీవు పెట్టినా వారికి జీతం చెల్లించమని స్పష్టం చేసింది. ముందుగా ఈ నిబంధనను అమెరికాలోని ఉద్యోగులకు వర్తింప చేస్తామని అడోబ్ ప్రకటించింది. దశల వారీగా ఈ విధానం మిగిలిన దేశాల్లో ఉద్యగులకు విస్తరింప చేయనుంది. మినహాయింపు వ్యాక్సినేషన్‌కి సంబంధించిన కఠిన నిబంధనల నుంచి కొద్ది మందికి మినహాయింపు ఇచ్చింద అడోబ్ సంస్థ. ఆరోగ్యపరమై కారణాలు, మత పరమైన నమ్మకాలు ఉన్న వారు వ్యాక్సినేషన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ రెండు కేటగిరీలలోకి రాని అడోబ్ ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే. చదవండి : వర్క్‌ఫ్రం హోమ్ ఓల్డ్ మెథడ్... కొత్తగా ఫ్లెక్సిబుల్ వర్క్‌వీక్ -
అడోబ్ అప్డేట్స్ అదుర్స్
ఇప్పుడు... ఫోన్ ఉన్న చోట ఫొటోగ్రఫీ ఉంది. అలా అని ‘టిక్’ అని నొక్కగానే సరిపోదు.మార్పులు, చేర్పులు చేసి ‘మహా అద్భుతం’ అనిపించాలి కదా! ‘మరింత బాగా సొగసులు అద్దాలి’ అని ఆశించే వారి కోసం అప్డేట్లతో ముందుకు వచ్చింది అడోబ్ ఫొటోషాప్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్... క్రియేటివ్‌గా ఆలోచించేవాళ్లను మూడు దశాబ్దాలకు పైగా అలరిస్తోంది అడోబ్. రస్టర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్‌లోనే కాదు, డిజిటల్ ఆర్ట్‌లోనూ ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా నిలిచింది. పెన్టూల్, క్లోన్ స్టాంప్ టూల్, షేప్ టూల్,కలర్ రిప్లేస్మెంట్టూల్... మొదలైన టూల్స్‌తో ఆకట్టుకుంటూనే ఉంది. ఇక అప్డేట్ (ఐపాడ్ వెర్షన్) విషయానికి వస్తే... పెర్ఫెక్షన్ సరిగ్గా లేని ఇమేజ్‌లను సరిదిద్దడానికి ఫొటోషాప్ టూల్‌బాక్స్‌లోని ‘హీలింగ్ బ్రష్’ పరిచితమే. ఇప్పుడు ఇది ఐపాడ్ వెర్షన్‌కు వచ్చేసింది. డెస్క్‌టాప్ వెర్షన్‌కు తీసిపోని విధంగా ఉంటుంది. లైటింగ్, టెక్చర్,షేడింగ్...మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. డెస్క్‌టాప్ వెర్షన్‌లోని ఆల్సెట్టింగ్స్ ఇందులో ఉంటాయి. మోస్ట్ రిక్వెస్టెడ్ టూల్‌గా చెప్పుకునే ‘మ్యాజిక్ వాండ్’తో ఏంచేయవచ్చు? క్రమరహిత రూపాలు(ఇర్రెగ్యులర్ షేప్స్), ప్లాట్బ్యాక్గ్రౌండ్ ఇమేజ్‌లలోని అబ్జెట్స్ లేదా ఏరియాలను టోన్, కలర్ ఆధారంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ సెలక్షన్, రిఫైన్ ఎడ్జ్టూల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా పనిచేస్తాయి.ఇక డెస్క్‌టాప్ వెర్షన్‌కి వస్తే స్కైరీప్లెస్మెంట్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ అనే టూల్ వచ్చింది. నైట్సీన్స్, ఫైర్వర్క్స్, సూర్యాస్తమయం... ఇలా హై క్వాలిటీతో కూడిన 5000 రకాల ‘స్కై’లను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కాస్త సరదాగా.... ఇంకాస్త ప్రొఫెషనల్‌గా! ‘ఫొటోషాప్’తో గేమ్స్ అనేది మీ సరదాకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. మీరు గట్టిగా కృషి చేస్తే ప్రొషెషనల్ గ్రాఫిక్ డిజైనర్ స్థాయిని చేరుకోవడం కష్టమేమీ కాదు. మార్కెటింగ్, బ్రాండింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని అన్ని బ్రాండ్స్ చేయి తిరిగిన గ్రాఫిక్ డిజైనర్లను కోరుకుంటున్నాయి. చేయి తిరగాలంటే కంటికి పని కనిపించాలి. అనగా అప్డేట్స్ను ఎప్పటికప్పుడూ స్టడీ చేస్తుండాలి. ట్రెండింగ్ ఆర్ట్ మూమెంట్స్, డిజైనింగ్ స్ట్రాటజీలు, కస్టమర్ ప్రాధాన్యతల గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఉరుము లేదు మెరుపు లేదు...ఉత్త మాయ! యూకే నుంచి యూఎస్‌కు వచ్చి స్థిరపడిన జేమ్స్ ఫ్రిడ్మన్ తన క్రియేటివ్ ఫొటోషాప్ స్కిల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో జేమ్స్‌కు 2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ‘హాయ్ జేమ్స్! నా ఫొటోను మార్చి చూపించవా’ అని అడిగితే చాలు ‘ఇది నా ఫొటోనా!’ అనేంత భారీ ఆశ్చర్యాన్ని కళ్లకు ఇస్తాడు. -
బెస్ట్ ట్రెండింగ్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఇవే!
సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఎక్కువ శాతం మంది ఫొటోగ్రఫీ మీద ఆసక్తి చూపుతున్నారు. కొందరు తమ ఫోటోని అందంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత తమ ఫోటోకి ఎన్ని లైక్స్ వచ్చాయి అని చూస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియా వచినప్పటి నుండి ప్రతి ఒక్కరు ఫోటో ఎడిటింగ్ మీద ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. అలాగే కొందరు ఫోటోగ్రఫీ ద్వారా వారు కస్టమర్ దృష్టిని ఆకర్షించి వ్యాపారాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నారు. కొన్ని మంచి యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వాటికీ నెల నెల డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అంతే క్వాలిటీతో కొన్ని ఉచిత యాప్స్ మేము మీకు అందిస్తున్నాం.(చదవండి: 14వేలకే నోకియా 5.4 మొబైల్) 1. స్నాప్‌సీడ్: ఇది ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. మీ మొబైల్ లో దీని ద్వారా బెస్ట్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఉచితంగా లభిస్తున్న బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ లలో ఇది ఒకటి. ఇది గూగుల్ చేత తయారుచేయబడింది. ఇది డెస్క్‌టాప్ ఫోటో ఎడిటర్లలో ఉన్న ఫీచర్స్ దీనిలో లభిస్తాయి. అన్ని యాప్స్ మాదిరిగానే ఇందులో ప్రీసెట్ ఫిల్టర్లు కూడా లభిస్తాయి. దీనిలో మీరు ఈ ఫిల్టర్లను సవరించవచ్చు. క్రాపింగ్, స్ట్రెయిటెనింగ్, ఫ్రేమ్స్, టెక్స్ట్, విగ్నేట్స్ వంటి అన్ని క్లాసిక్ టూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. స్నాప్సీడ్లో ప్రెసిషన్ మాస్కింగ్ ఉంది. దీని ద్వారా మీరు గతంలో ఎడిట్ చేసిన హిస్టరీ కూడా సేవ్ చేసి ఉంటుంది. కాబట్టి మీరు ఏ సమయంలోనైనా తిరిగి ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. 2. పిక్స్‌లర్: 50 మిలియన్ డౌన్లోడ్లతో ప్లే స్టోర్‌లో పిక్స్‌లర్ 4.3 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లో 27ఎంబి కంటే తక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది. ఈ యాప్ ఎక్కువ ఎఫెక్ట్స్ ఆడ్ చేసుకోవడంతో పాటు క్రియేటివ్ గా మీ ఫోటోలను ఎడిటింగ్ చేయవచ్చు . ఇందులో ఉన్న ముఖ్యమైన 'ఆటో-ఫిక్స్' ఫీచర్ తో యాప్ లో రంగులను అదే సర్దుబాటు చేసుకుంటుంది. దీని ద్వారా మీరు ఫోటోలను మరింత స్పష్టతతో కూడిన ఫోటోలను మీకు నచ్చినట్లు తయారు చేయవచ్చు. ఇది ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. 3. విస్కో: ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతి ముఖ్యమైన ఫీచర్ వచ్చేసి క్లాసిక్-లుక్ ఫిల్టర్లు. ఇన్స్టాగ్రామ్ మాదిరిగా విస్కో కెమెరా, ఎడిటింగ్ టూల్స్, ఆన్లైన్ కమ్యూనిటీ కూడా ఉంది. ఈ ఉచిత ఫోటో యాప్ మీ ఫోటోలను అనలాగ్ ఫిల్మ్ కెమెరాలో తీసినట్లుగా కనిపించే అద్భుతమైన ఫిల్టర్ల సెట్ అందిస్తుంది. భారీగా ఫిల్టర్ చేసిన ఇన్స్టాగ్రామ్ ప్రీసెట్‌లతో పోలిస్తే మీ ఫోటోలకు క్లాస్ టచ్ ఇస్తాయి. మరియు మీరు వీటిని సాధారణ స్లైడర్ ద్వారా కూడా సర్దుబాటు చేయవచ్చు. అన్ని ఫోటో ఎడిటింగ్ యాప్స్ మాదిరిగానే ఇందులో క్రాపింగ్, బార్డర్స్ ఉన్నాయి. ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, టెంపరేచర్ లేదా స్కిన్ టోన్లను సరి చేయడానికి మీరు విస్కోను కూడా ఉపయోగించవచ్చు. 4. ప్రిస్మా ఫోటో ఎడిటర్: ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతిముఖ్యమైన ఫీచర్ వచ్చేసి మీ ఫోటోలను కళాత్మకంగా “పెయింటింగ్స్”, “డ్రాయింగ్లు” గా మార్చుకోవడం. ఈ ఉచిత ఫోటో ఎడిటింగ్ యాప్ కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తుంది. ఇది “పికాసో, మంచ్ లేదా సాల్వడార్ డాలీ చిత్రించినట్లుగా ఫోటోలను ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీనిలో 500 కంటే ఎక్కువ సంఖ్యలో క్రియేటివ్ ఫిల్టర్స్ ఉన్నాయి. ప్రిస్మాకు ఇన్స్టాగ్రామ్ మాదిరిగానే ఆన్లైన్ కమ్యూనిటీ కూడా ఉంది. కాబట్టి, మీరు ఎడిటింగ్ పూర్తి చేసిన తర్వాత మీరు మీ చిత్రాన్ని మీ ప్రిస్మా ఫీడ్‌లో షేర్ చేయవచ్చు. 5. అడోబ్ ఫోటోషాప్ ఎక్స్‌ప్రెస్: ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతిముఖ్యమైన ఫీచర్ వచ్చేసి ఆల్‌రౌండ్ ఫోటో ఎడిటింగ్. మీరు లాప్టాప్ లేదా డెస్క్ టాప్ లో ఏ విదంగా ఫోటో ఎడిటింగ్ చేసుకుంటారో అదేవిదంగా ఇందులో చేసుకోవచ్చు. దీనిని మొబైల్ లో సులభంగా ఉపయోగించవచ్చు. ఇందులో అడోబ్ ఫోటోషాప్ లో ఉన్న ఫీచర్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. 6. కాన్వా: ఇది కూడా ఐఓఎస్ వినియోగదారులకు, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. దీనిలో అతిముఖ్యమైనది వచ్చేసి వ్యాపారానికి సంబందించిన బ్రాండెడ్ ఫోటోలను సులువుగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. కాన్వా యాప్ బెస్ట్ ఫ్రీ ఎడిటింగ్ యాప్స్ లో ఒకటి. దీనిలో ఫోటో ఎడిటింగ్ మాత్రమే కాదు వెబ్సైట్, మార్కెటింగ్ వంటి సంబందించిన ఫోటోలను కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అందుకే చాలా మల్టీ యూజ్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులో 50,000 ఫ్రీ టెంపల్ట్స్ ఉన్నాయి. మంచి విజువల్స్ తో పోస్టర్లు తయారుచేయవచ్చు. -
తెలంగాణకు మరో ఐటీ దిగ్గజం
న్యూఢిల్లీ, హైదరాబాద్ : మరో ఐటీ దిగ్గజం రాష్ట్రానికి రాబోతుంది. రాజధాని హైదరాబాద్‌లో అడోబ్ సంస్థ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా అడోబ్ చైర్మన్, సీఈవో శంతను నారాయణ్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో అడోబ్ కేంద్రాన్ని నెలకొల్పాలని మంత్రి కేటీఆర్ కోరారు. కేటీఆర్ ప్రతిపాదనకు స్పందించిన శంతను అడోబ్ కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఇవ్వనున్నట్టు తెలిపారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ మూడు రోజుల సదస్సు వేదికగా భాగ్యనగరం ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అడోబ్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 17వేల మంది ఉద్యోగులున్నారు. గత మూడున్నరేళ్లలో హైదరాబాదు నగరంలో ఐటీ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని, నూతన టెక్నాలజీలపై ఇక్కడ సుశిక్షితులైన యువతరం ఉందని శంతను అభిప్రాయపడ్డారు. అడోబ్ కార్యకలాపాలు విస్తరణలో భాగంగా హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఇస్తామనే కంపెనీ సీఈవో నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చెశారు. అడోబ్ సంస్థకు అవసరమైన అన్ని రకాల సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు వినూత్న టెక్నాలజీలపై ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయన్న మంత్రి, అడోబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ఎకో సిస్టమ్‌లో ఒక కొత్త ఊపు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చెశారు. ఈ నిర్ణయం వల్ల ఇక్కడి యువతకు ఏఐ రంగంలో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. టీ-ఫైబర్ టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ నెట్వర్క్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ-ఫైబర్ గ్రిడ్ ఫలితాలను తెలిపే పైలట్ ప్రాజెక్టు టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ నెట్‌వర్క్‌ను కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. నెట్వర్క్ ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి ' కంగ్రాట్స్, కీప్ ఇట్ అప్ కేటీఆర్' అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మహేశ్వరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నెలకొల్పిన ఈ-క్లాస్ రూంలో ఉన్న విద్యార్దులతో మంత్రి సంభాషించారు. మనసాన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఒక రోగికి, హైదరాబాద్‌లో ఉన్న ఓ డాక్టర్ టీ-ఫైబర్ టెలి మెడిసిన్ సేవలను అందించారు. ఈ సేవలను మంత్రి పరిశీలించారు. తుమ్మలూరు గ్రామంలో నెలకొల్పిన అత్యాధునిక కియోస్క్ ద్వారా గ్రామస్తులకు అందిస్తున్న ప్రభుత్వ సేవలను, వ్యవసాయ సమాచారాన్నీ తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీ-ఫైబర్ ప్రాజెక్టు తీసుకురానున్న టెక్నాలజీ ఫలితాలు, వాటి ద్వారా ప్రజలకు అందే ఫలితాలను తెలుసుకున్న రవిశంకర్ ప్రసాద్, కేటీఆర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీ-ఫైబర్ ద్వారా ఎలాంటి సేవలు, సౌకర్యాలు అందుతాయో ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి కేటీఆర్ వివరించారు. ఈ నెట్వర్క్ ద్వారా పౌరులకు ప్రభుత్వ సేవలు, (ఈసేవా), ఐపీ టీవీ, టెలిఫోన్ , టెలి మెడిసిన్, ఈ-ఎడ్యుకేషన్ వంటి టెక్నాలజీ ఫలాలు ప్రతి ఇంటికి అందుతాయని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతానికి ప్రతి గృహానికి వన్ జీబీ పియస్ ఇంటర్నెట్ సేవలు అందించే సామర్ద్యం ఈ నెట్‌వర్క్‌కు ఉందని చెప్పారు. -
హైదరాబాద్‌లో అడోబ్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో అడోబ్ సిస్టమ్స్ విస్తరణకు చర్యలు చేపడతామని, తమ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్ కచ్చితంగా ఉంటుందని ఆ కంపెనీ సీఈవో శాంతను నారాయణ్ పేర్కొన్నారు. ఒరాకిల్ కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. ఐటీ మంత్రి కె.తారకరామారావు తన ఏడో రోజు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం సిలికాన్ వ్యాలీలో పర్యటించారు. ఒరాకిల్, అడోబ్ సిస్టమ్స్ తదితర ప్రముఖ ఐటీ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి అడోబ్ అధినేతగా ఎదిగిన నారాయణ్ ఈ సందర్భంగా కేటీఆర్ బృందాన్ని అభినందించారు. ‘‘నేను పక్కా హైదరాబాదీని. నగరానికి కచ్చితంగా సహకారమందిస్తా’’ అని చెప్పారు. హైదరాబాద్‌లో అడోబ్‌ను విస్తరించాలని కోరగా సరేనంటూ హామీ ఇచ్చారు. నగరాభివృద్ధికి, తెలంగాణలో వ్యాపారాభివృద్ధికి తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయనకు కేటీఆర్ వివరించారు. మధ్యాహ్నం ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ను కలిశారు. తెలంగాణ గురించి, రాష్ట్రంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పారిశ్రామిక విధానం, హైదరాబాద్‌కున్న ప్రాధాన్యతలను గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఒరాకిల్ కలిసి పనిచేసేందుకు వీలున్న పలు రంగాల గురించి చర్చించారు. హైదరాబాద్‌లోని డాటా సెంటర్లకున్న రక్షణ గురించి తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను హర్డ్ అభినందించారు. తరవాత ప్రత్యామ్నాయ ఇంధన వనరుల విభాగంలో ప్రఖ్యాత బ్లూమ్ ఎనర్జీ సీఈవో కేఆర్ శ్రీధర్‌తో మంత్రి సమావేశయ్యారు. సాంకేతిక ప్రపంచంలో విప్లవాత్మకమైన ఫ్యూయల్ సెల్ టెక్నాలజీపై చర్చించారు. బ్లూమ్ టెక్నాలజీ ప్రాంగణాన్ని పరిశీలించారు. అర చేయి విస్తీర్ణంలోని ఒక్క ప్యూయర్ సెల్‌తో ఒక మొత్తం ఇంటి విద్యుత్తు అవసరాలు తీర్చగలిగే ప్రత్యేక బ్లూమ్ టెక్నాలజీ తమ సొంతమని శ్రీధర్ తెలపగా, ‘‘ఈ కంపెనీ తెలంగాణకు రావాలి. రాష్ట్రంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయండి’’ అని మంత్రి కోరారు. తాను త్వరలో హైదరాబాద్‌కు వస్తానని శ్రీధర్ హామీ ఇచ్చారు. అనంతరం ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టు కన్వల్ రేఖి, కీర్తి మెల్కొటేలకు చెందిన అరుబా నెట్‌వర్క్స్‌ను కేటీఆర్ సందర్శించారు. టి.హబ్‌లో పెట్టుబడుల గురించి వారితో చర్చించారు. అరుబా నెట్‌వర్క్స్‌ను ఈ మధ్యే మూడు బిలియన్ డాలర్లకు హెచ్‌పీ కంపెనీ టేకోవర్ చేసిన విషయాన్ని వారు మంత్రికి వివరించారు. 50 ఏళ్ల కిందట తమ తాతయ్య, మాజీ ఎంపీ జీఎస్ మెల్కొటే తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేసుకున్నారు. ఆయన కల సాకారమైనందంటూ సంతోషం వ్యక్తం చేశారు.