అడోబ్ సంస్థ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ, హైదరాబాద్ : మరో ఐటీ దిగ్గజం రాష్ట్రానికి రాబోతుంది. రాజధాని హైదరాబాద్‌లో అడోబ్ సంస్థ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా అడోబ్ చైర్మన్, సీఈవో శంతను నారాయణ్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో అడోబ్ కేంద్రాన్ని నెలకొల్పాలని మంత్రి కేటీఆర్ కోరారు. కేటీఆర్ ప్రతిపాదనకు స్పందించిన శంతను అడోబ్ కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఇవ్వనున్నట్టు తెలిపారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ మూడు రోజుల సదస్సు వేదికగా భాగ్యనగరం ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. నేటి నుంచి ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అడోబ్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 17వేల మంది ఉద్యోగులున్నారు. గత మూడున్నరేళ్లలో హైదరాబాదు నగరంలో ఐటీ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని, నూతన టెక్నాలజీలపై ఇక్కడ సుశిక్షితులైన యువతరం ఉందని శంతను అభిప్రాయపడ్డారు. అడోబ్ కార్యకలాపాలు విస్తరణలో భాగంగా హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఇస్తామనే కంపెనీ సీఈవో నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చెశారు. అడోబ్ సంస్థకు అవసరమైన అన్ని రకాల సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు వినూత్న టెక్నాలజీలపై ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయన్న మంత్రి, అడోబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ఎకో సిస్టమ్‌లో ఒక కొత్త ఊపు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చెశారు. ఈ నిర్ణయం వల్ల ఇక్కడి యువతకు ఏఐ రంగంలో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వీలు కలుగుతుందన్నారు.
టీ-ఫైబర్ టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ నెట్‌వర్క్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ-ఫైబర్ గ్రిడ్ ఫలితాలను తెలిపే పైలట్ ప్రాజెక్టు టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ నెట్‌వర్క్‌ను కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. నెట్‌వర్క్ ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి ' కంగ్రాట్స్, కీప్ ఇట్ అప్ కేటీఆర్' అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మహేశ్వరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నెలకొల్పిన ఈ-క్లాస్ రూంలో ఉన్న విద్యార్దులతో మంత్రి సంభాషించారు. మనసాన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఒక రోగికి, హైదరాబాద్‌లో ఉన్న ఓ డాక్టర్ టీ-ఫైబర్ టెలి మెడిసిన్ సేవలను అందించారు. ఈ సేవలను మంత్రి పరిశీలించారు. తుమ్మలూరు గ్రామంలో నెలకొల్పిన అత్యాధునిక కియోస్క్ ద్వారా గ్రామస్తులకు అందిస్తున్న ప్రభుత్వ సేవలను, వ్యవసాయ సమాచారాన్నీ తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీ-ఫైబర్ ప్రాజెక్టు తీసుకురానున్న టెక్నాలజీ ఫలితాలు, వాటి ద్వారా ప్రజలకు అందే ఫలితాలను తెలుసుకున్న రవిశంకర్ ప్రసాద్, కేటీఆర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
టీ-ఫైబర్ ద్వారా ఎలాంటి సేవలు, సౌకర్యాలు అందుతాయో ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి కేటీఆర్ వివరించారు. ఈ నెట్‌వర్క్ ద్వారా పౌరులకు ప్రభుత్వ సేవలు, (ఈసేవా), ఐపీ టీవీ, టెలిఫోన్ , టెలి మెడిసిన్, ఈ-ఎడ్యుకేషన్ వంటి టెక్నాలజీ ఫలాలు ప్రతి ఇంటికి అందుతాయని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతానికి ప్రతి గృహానికి వన్ జీబీ పియస్ ఇంటర్నెట్ సేవలు అందించే సామర్ద్యం ఈ నెట్‌వర్క్‌కు ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment