హైదరాబాద్‌లో అడోబ్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో అడోబ్ సిస్టమ్స్ విస్తరణకు చర్యలు చేపడతామని, తమ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్ కచ్చితంగా ఉంటుందని ఆ కంపెనీ సీఈవో శాంతను నారాయణ్ పేర్కొన్నారు. ఒరాకిల్ కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. ఐటీ మంత్రి కె.తారకరామారావు తన ఏడో రోజు అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం సిలికాన్ వ్యాలీలో పర్యటించారు. ఒరాకిల్, అడోబ్ సిస్టమ్స్ తదితర ప్రముఖ ఐటీ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు.
హైదరాబాద్ నుంచి అడోబ్ అధినేతగా ఎదిగిన నారాయణ్ ఈ సందర్భంగా కేటీఆర్ బృందాన్ని అభినందించారు. ‘‘నేను పక్కా హైదరాబాదీని. నగరానికి కచ్చితంగా సహకారమందిస్తా’’ అని చెప్పారు. హైదరాబాద్‌లో అడోబ్‌ను విస్తరించాలని కోరగా సరేనంటూ హామీ ఇచ్చారు. నగరాభివృద్ధికి, తెలంగాణలో వ్యాపారాభివృద్ధికి తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయనకు కేటీఆర్ వివరించారు. మధ్యాహ్నం ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్‌ను కలిశారు. తెలంగాణ గురించి, రాష్ట్రంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పారిశ్రామిక విధానం, హైదరాబాద్‌కున్న ప్రాధాన్యతలను గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఒరాకిల్ కలిసి పనిచేసేందుకు వీలున్న పలు రంగాల గురించి చర్చించారు. హైదరాబాద్‌లోని డాటా సెంటర్లకున్న రక్షణ గురించి తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలను హర్డ్ అభినందించారు. తరవాత ప్రత్యామ్నాయ ఇంధన వనరుల విభాగంలో ప్రఖ్యాత బ్లూమ్ ఎనర్జీ సీఈవో కేఆర్ శ్రీధర్‌తో మంత్రి సమావేశయ్యారు. సాంకేతిక ప్రపంచంలో విప్లవాత్మకమైన ఫ్యూయల్ సెల్ టెక్నాలజీపై చర్చించారు. బ్లూమ్ టెక్నాలజీ ప్రాంగణాన్ని పరిశీలించారు. అర చేయి విస్తీర్ణంలోని ఒక్క ప్యూయర్ సెల్‌తో ఒక మొత్తం ఇంటి విద్యుత్తు అవసరాలు తీర్చగలిగే ప్రత్యేక బ్లూమ్ టెక్నాలజీ తమ సొంతమని శ్రీధర్ తెలపగా, ‘‘ఈ కంపెనీ తెలంగాణకు రావాలి.
రాష్ట్రంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయండి’’ అని మంత్రి కోరారు. తాను త్వరలో హైదరాబాద్‌కు వస్తానని శ్రీధర్ హామీ ఇచ్చారు. అనంతరం ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టు కన్వల్ రేఖి, కీర్తి మెల్కొటేలకు చెందిన అరుబా నెట్‌వర్క్స్‌ను కేటీఆర్ సందర్శించారు. టి.హబ్‌లో పెట్టుబడుల గురించి వారితో చర్చించారు. అరుబా నెట్‌వర్క్స్‌ను ఈ మధ్యే మూడు బిలియన్ డాలర్లకు హెచ్‌పీ కంపెనీ టేకోవర్ చేసిన విషయాన్ని వారు మంత్రికి వివరించారు. 50 ఏళ్ల కిందట తమ తాతయ్య, మాజీ ఎంపీ జీఎస్ మెల్కొటే తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేసుకున్నారు. ఆయన కల సాకారమైనందంటూ సంతోషం వ్యక్తం చేశారు.