
అమెరికన్ మల్టీనేషనల్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అడోబ్ (Adobe) సహ వ్యవస్థాపకుడు జాన్ వార్నాక్ (John Warnock) కన్నుమూశారు. జాన్ వార్నాక్ 82 సంవత్సరాల వయసులో శనివారం (ఆగస్టు 19) మరణించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే వార్నాక్ మరణానికి కారణం వెల్లడించలేదు.
వార్నాక్ 1982లో చార్లెస్ గెష్కేతో కలిసి శాన్ జోస్ కేంద్రంగా అడోబ్ కంపెనీని ప్రారంభించారు. 2000 సంవత్సరం వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న ఆయన 2001లో పదవీ విరమణ చేసే వరకు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేశారు.
వార్నాక్ 2017 వరకు దాదాపు మూడు దశాబ్దాల పాటు కంపెనీ బోర్డు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఎక్కువ కాలం గెష్కేతో కలిసి సంయుక్తంగా ఆ పదవిలో కొనసాగారు. వార్నాక్ మరణించే వరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డులో కొనసాగారు. గెష్కే 2021లో 81 ఏళ్ల వయసులో మరణించారు.
జాన్ వార్నాక్‌తో కలిసి మెలిగిన గత 25 సంవత్సరాల కాలం వృత్తిపరంగా తన కెరీర్‌లో అత్యంత కీలకమైందని అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంతను నారాయణ్ ఉద్యోగులకు రాసిన ఒక ఈమెయిల్‌లో పేర్కొన్నారు. వార్నాక్ తన రోల్ మోడల్, మెంటర్ అని, అంతకన్నా ఎక్కువగా ఒక మంచి స్నేహితుడిగా ఆయన్ను భావిస్తానని తెలిపారు.
అడోబ్‌ని స్థాపించడానికి ముందు వార్నాక్ జిరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్‌లో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా పనిచేశారు. వార్నాక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డాక్టరేట్ పొందారు. గణితశాస్త్రంలో మాస్టర్స్ చేసిన ఆయన గణితం, తత్వశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. వార్నాక్‌కు భార్య మార్వా, ముగ్గురు పిల్లలు ఉన్నారు.