ఇటీవల మార్కెట్లో తలెత్తిన ఒడిదుడుకులకు అనేకానేక అంశాలు కారణం. అమెరికా ఆర్థిక డేటా ఊహించిన దానికన్నా బలహీనంగా ఉండటమనేది మాంద్యం అవకాశాలపై ఆందోళనలకు ఆజ్యం పోసింది. మాంద్యం తలెత్తే అవకాశాలు 10 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని ఈ ఏడాది జూన్‌లో అంచనా వేయగా ప్రస్తుతం 30-35 శాతం ఉండొచ్చన్న అభిప్రాయం నెలకొనడం ఇందుకు నిదర్శనం.
బ్యాంక్ ఆఫ్ జపాన్ రేట్లు పెంచడంతో చోటు చేసుకున్న పరిణామాలు కూడా దీనికి తోడు కావడంతో మార్కెట్ మరింత అనిశ్చితికి లోనైంది. ఈ ప్రభావాలు రూపాయిపైనా పడ్డాయి. దీంతో 2022 అక్టోబర్ నాటి రికార్డు కనిష్ట స్థాయి 83.5ని (డాలరుతో పోలిస్తే) కూడా దాటేసి రూపాయి దాదాపు ఆల్‌టైం కనిష్టాన్ని తాకింది. అయితే, స్వల్పకాలికంగా రూపాయి మారకం క్షీణించినా, గత ఆరు నెలలుగా ఇతర వర్ధమాన, సంపన్న మార్కెట్ కరెన్సీలతో పోలిస్తే స్థిరత్వాన్నే కనపర్చింది.
జపాన్ యెన్, చైనా యువాన్, ఇండొనేషియా రూపయా అలాగే ఇతర వర్ధమాన, సంపన్న మార్కెట్ల కరెన్సీలు ఇటీవల పతనం కావడంతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు అలాగే టారిఫ్‌లపై భయాలు నెలకొన్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో రూపాయి మరింత క్షీణించే అవకాశాలు, మానిటరీ పాలసీపై దాని ప్రభావాలపై ఆందోళన నెలకొంది. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీవ్ర ఒడిదుడుకులకు గాని క్షీణతకు గానీ గురయ్యే పెద్ద రిస్కులేమీ లేకుండా రూపాయి స్థిరంగానే కొనసాగేందుకు ఎక్కువ అవకాశం ఉంది.
ఆర్‌బీఐ పాలసీపై కరెన్సీ ప్రభావం..
సాధారణంగా కరెన్సీ పతనమైతే సెంట్రల్ బ్యాంకులు పాలసీని కఠినతరం చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవైపు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తూ మరోవైపు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాలన్న రెండు లక్ష్యాలు వాటికి ఉండటం ఇందుకు ప్రాథమిక కారణం. కరెన్సీ బలహీనపడుతుంటే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతాయి. దీంతో సెంట్రల్ బ్యాంకులు మరింత కఠినతరమైన ద్రవ్యపరపతి విధానాన్ని అమలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి చర్యలు సాధారణంగా బాండ్ల ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఈల్డ్‌లు పెరిగిపోతాయి.
లిక్విడిటీ అలాగే ఆర్థిక పరిస్థితులను కఠినతరంగా మార్చడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ, కరెన్సీ స్థిరంగా ఉండేలా చూడాలనేది ఆర్‌బీఐ లక్ష్యంగా ఉంటుంది. అయితే, ఈ ధోరణి అనేది తాత్కాలికంగా బాండ్ మార్కెట్ ర్యాలీకి అవరోధంగా మారి, కొంత ఒడిదుడుకులకు దారి తీయొచ్చు.
రూపాయి మారకం విలువ మరింత క్షీణించకుండా, కాపాడేందుకు విదేశీ మారక నిల్వలను ఆర్‌బీఐ క్రియాశీలకంగా గణనీయ స్థాయిలో ఉపయోగిస్తోంది. అయితే, ఇలా జోక్యం చేసుకోవడమనేది బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ తగ్గిపోవడానికి దారి తీయొచ్చు. అలాగే స్వల్పకాలిక వడ్డీ రేట్లు పెరగక తప్పని పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆర్‌బీఐ గత కొద్ది ట్రేడింగ్ సెషన్లలో 10–15 బిలియన్ డాలర్ల మేర నిల్వలను వినియోగించిందని ఇటీవలి డేటా ప్రకారం తెలుస్తోంది.
జేపీ మోర్గాన్ సూచీల్లో భారతీయ బాండ్లను చేర్చడం వల్ల వచ్చిన లిక్విడిటీని తగ్గించే దిశగా అధిక లిక్విడిటీని సిస్టం నుంచి వెనక్కి లాగేందుకు ఆర్‌బీఐ ఓపెన్ మార్కెట్ లావాదేవీలు (ఓఎంఓ) నిర్వహించవచ్చనే అంచనాలు ఉన్నాయి. దీనికి ఒక మోస్తరు అవకాశాలే ఉన్నప్పటికీ, బాండ్ మార్కెట్లో నెలకొన్న ఉత్సాహం తాత్కాలికంగా మందగించేందుకు ఇది దారితీయొచ్చు. అయినా, బాండ్లకు సంబంధించి డిమాండ్–సరఫరా డైనమిక్స్ సానుకూలంగా ఉండటం వల్ల ఈల్డ్‌లు గణనీయంగా పెరగకుండా నివారించే అవకాశం ఉందనే అభిప్రాయం నెలకొంది.
పటిష్ట పరిస్థితుల దన్ను..
స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉండటం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం, సర్వీసులు వృద్ధి చెందుతుండటం వంటి అంశాలు ఈ నమ్మకానికి ఊతమిస్తున్నాయి. అమెరికాలో అధిక ద్రవ్యలోటు, జీడీపీతో పోలిస్తే రుణభారం పెరగడంవంటి బలహీన స్థూల ఆర్థిక గణాంకాలతో డాలరు మరింత క్షీణతకు గురయ్యే అవకాశం ఉంది.
రూపాయి మారకం విలువ క్షీణించినా, ప్రతికూల ప్రభావాలు కాస్త తగ్గి, దేశీ కరెన్సీ కొంత నిలదొక్కుకునేందుకు ఆస్కారం ఉంది. అటు 675 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న విదేశీ మారక నిల్వలు సైతం భారత్‌కి ఉపయోగకరంగా ఉండనున్నాయి. సమీప భవిష్యత్తులో ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు, పెద్ద షాక్‌ల నుంచి రూపాయిని కాపాడుకునేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చు.
చైనాలో భారీ సంస్కరణల ఊసు లేకపోవడం వల్ల మందగమనంతో కమోడిటీల ధరలు, ముఖ్యంగా చమురు ధరలు బలహీనపడటం భారత్‌కు సహాయకరంగా ఉండనుంది. మన దిగుమతుల బిల్లుల భారం తగ్గుతుంది కాబట్టి ఇది మన కరెన్సీకి సానుకూలంగా ఉండనుంది.
దేవాంగ్ షా -ఫిక్సిడ్ ఇన్‌కం హెడ్, యాక్సిస్ మ్యుచువల్ ఫండ్
Comments
Please login to add a commentAdd a comment