కాకినాడ సెజ్‌కు లోకేశ్‌ గిఫ్ట్‌ | Nara lokesh eyeing to kakinada SEZ | Sakshi
Sakshi News home page

కాకినాడ సెజ్‌కు లోకేశ్‌ గిఫ్ట్‌

Published Sat, Apr 15 2017 8:37 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

కాకినాడ సెజ్‌కు లోకేశ్‌ గిఫ్ట్‌ - Sakshi

కాకినాడ సెజ్‌కు లోకేశ్‌ గిఫ్ట్‌

అమరావతి: కాకినాడ సెజ్‌కు అసాధారణ, ప్రత్యేక అధికారాలు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు కల్పించిన అధికారాలను కాకినాడ సెజ్‌ భూములున్న ప్రాంతంలో రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే.. సెజ్‌ భూములున్న గ్రామాలలో పంచాయతీల తీర్మానం అవసరం లేకుండా సెజ్‌లో ఎలాంటి పరిశ్రమలైనా ఏర్పాటు చేసుకోవచ్చు. సెజ్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమలపై ఆయా గ్రామ పంచాయతీలు ఎలాంటి స్థానిక పన్నులూ వసూలు  చేసుకునే వెసులుబాటు ఉండదు. నారా లోకేశ్‌ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఇందుకు సంబంధించి ఫైలు వేగంగా కదులుతోంది.

తొమ్మిదిలో 5 గ్రామాలు వ్యతిరేకించినా.. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి, పొండంగి మండలాల పరిధిలోని తొమ్మిది గ్రామాల పరిధిలో 8,672 ఎకరాలలో సెజ్‌ ఏర్పాటైంది. సెజ్‌ పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఉండే అధికారాలను రద్దు చేయాలంటూ గత ఏడాది ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

దీనిపై సంబంధిత తొమ్మిది గ్రామ పంచాయతీల అభిప్రాయం తెలియజేయాలంటూ  2016 సెప్టెంబరు 20వ తేదీన ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా అధికారులను ఆదేశించింది. సెజ్‌ భూములపై గ్రామ పంచాయతీల అధికారాల రద్దు అంశంపై తొమ్మిది గ్రామ పంచాయతీలలో తీర్మానాలు ప్రవేశపెట్టగా ఐదు గ్రామ పంచాయతీలు వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకోగా, నాలుగు పంచాయతీలు అనుకూలంగా తీర్మానం చేశాయి.

యు. కొత్తపల్లి మండలం శ్రీరాంపేట, రమణక్కపేట, పొన్నాడ, కొత్తమూలపేట, కొమరగిరి గ్రామ పంచాయతీలు వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించగా.. యు. కొత్తపల్లి మండలం మూలపేట, పొండంగి మండలం ఏవీ నగరం, కేవీ పెరమాళ్లపురం, కోదాడ గ్రామ పంచాయతీలు అను కూలంగా తీర్మానాలను ఆమోదించాయి. గ్రామ పంచాయతీల తీర్మానాలను జత చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి డిసెంబరు 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు.

అయితే, గ్రామ పంచాయతీలు వ్యతిరేకించినా సెజ్‌ భూములపై పంచాయతీల అధికారాలను రద్దు చేసి, సెజ్‌కు విశేషాధికారాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించబడిన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. లోకేశ్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఇందుకు సంబంధించిన ఫైలు సిద్ధమైంది. లోకేశ్‌ ఈ ఫైలుపై సంతకం చేయడమే ఇక మిగిలింది.

కాకినాడ సెజ్‌ ఒక్కటే స్పెషల్‌  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వందకు పైగా సెజ్‌లు ఏర్పాటయ్యాయి. ఏ సెజ్‌కూ ఇలాంటి ప్రత్యేకాధికారాలు కల్పించలేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టాలన్నా సంబంధిత గ్రామ పంచాయతీ లేదంటే మున్సిపాలిటీ అనుమతి తీసుకున్న తర్వాతే నిర్మాణ పనులు మొదలు పెడతారు. ఆ భవనం నుంచి ప్రతి ఏటా సంబంధిత గ్రామ పంచాయతీ లేదంటే మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూలు చేసుకునే అధికారం ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు కల్పించబడిన ఇలాంటి ప్రత్యేకాధికారాలను కాకినాడ సెజ్‌ కోసం రద్దు చేయడంపై అధికారవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement