తెలంగాణ, ఏపీలో 14 సెజ్‌ల రద్దు యోచన
- జాబితాలో డెక్కన్ ఇన్‌ఫ్రా, ఏపీ మార్క్‌ఫెడ్ సెజ్‌లు
- 20న తుది నిర్ణయం
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 14 ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)కు ఇచ్చిన లాంఛనప్రాయమైన అనుమతులను కేంద్ర వాణిజ్య శాఖ రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ఏర్పాటులో ఎటువంటి పురోగతి లేనందున అనుమతులను రద్దు చేయాలంటూ డెవలప్‌మెంట్ కమిషనర్ (డీసీ) సిఫార్సు చేయడం ఇందుకు కారణం.
ఈ నెల 20న జరిగే సమావేశం కోసం వాణిజ్య శాఖలో భాగమైన అనుమతుల బోర్డు (బీవోఏ) రూపొందించిన ఎజెండాలో ఈ అంశాలు ఉన్నాయి. అనుమతులు రద్దయ్యే అవకాశమున్న 14 సెజ్‌లలో 12 ఆర్థిక మండళ్లు తెలంగాణలో ఉండగా, మరో రెండు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్నాయి.ఈ జాబితాలో.. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్(డీఐఎల్‌ఎల్) సెజ్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు(ఏపీహెచ్‌బీ) దీన్ని ఏర్పాటు చేసింది.
ఇందులో ఏపీహెచ్‌బీకి 57.44%, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (విభజనకు ముందు) 42.56% వాటాలు ఉన్నాయి. డీఐఎల్‌ఎల్‌కి తెలంగాణలో దాదాపు 6,819 ఎకరాల స్థలం ఉంది. ఇది గతంలో ఐటీ/ఐటీఈఎస్, ఫార్మా, వజ్రాభరణాలు, ఇంజనీరింగ్ మొదలైన రంగాలకు సంబంధించి సెజ్‌లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి అనుమతులు కూడా పొందింది.
దీనికి ఇచ్చిన అనుమతుల గడువు పూర్తయిపోయిన సంగతి 2012, 2013లో కూడా తెలియజేసినప్పటికీ సెజ్ డెవలపర్ నిర్మాణాత్మకమైన ప్రతిపాదనేదీ ఇంతవరకూ సమర్పించలేదని బీవోఏ పేర్కొంది. దీంతో డీఐఎల్‌ఎల్‌కి ఇచ్చిన అనుమతులన్నింటినీ రద్దు చేయాలంటూ డీసీ సిఫార్సు చేసినట్లు వివరించింది. మరోవైపు, ప్రభుత్వ సంస్థ ఏపీ మార్క్‌ఫెడ్.. కరీంనగర్‌లో తలపెట్టిన సెజ్‌కి కూడా అనుమతులు రద్దు చేయాలని డీసీ సూచించారు. ప్రాజెక్టులో ఎటువంటి పురోగతీ లేకపోవడమే దీనికి కూడా కారణమని బీవోఏ పేర్కొంది.