
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రతిపాదిత ప్రత్యేక ఆర్థిక జోన్ల (సెజ్) కొత్త చట్టం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ప్రత్యేక ఆర్థిక జోన్లకు సంబంధించి ప్రస్తుత చట్టం స్థానంలో తీసుకువస్తున్న కొత్త చట్టంతో వ్యవస్థలో అన్ని అనుమతులు, విధి విధానాలు, కార్యకలాపాలు సింగిల్ విండో కింద జరుగుతాయని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక రంగం పురోగతికి కొత్త చట్టం దోహదపడుతుందని ఆయన అన్నారు. సెజ్‌లను నియంత్రించే ప్రస్తుత చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం మంగళవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
డెవలప్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్(డీఈఎస్‌హెచ్)లో రాష్ట్రాలను భాగస్వాములు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత సెజ్ యాక్ట్‌ను 2006లో తీసుకువచ్చారు. ఎగుమతుల పెరుగుదల, మౌలిక రంగం పురోగతి, ఉపాధి కల్పన ఈ చట్టం ప్రధాన లక్ష్యం. అయితే కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు, పన్ను ప్రోత్సాహకాల తొలగింపు వంటి చర్యల తర్వాత ఈ జోన్‌ల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. కొత్త చట్టంతో తిరిగి సెస్‌లకు బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని, దేశాభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. సెజ్ 2.0 ముసాయిదా యాక్ట్ తయారీ పక్రియలో ఉందని, వచ్చే కొద్ది నెలల్లో ప్రస్తుత సెజ్ యాక్ట్ స్థాయిలో ఇది అమల్లోకి వచ్చే చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్ ఎగుమతుల్లో దాదాపు 20 శాతం సెజ్‌ల వాటా కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment