కాగ్ ఆక్షేపణ
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) పేరిట సమీకరిస్తున్న భూములు దుర్వినియోగం అవుతున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఆక్షేపించింది. ‘సెజ్‌ల కోసం అంటూ డెవలపర్లు ప్రభుత్వం నుంచి భూములు తీసుకోవడం/కొనుక్కోవడం చేస్తున్నారు. అయితే, ఇందులో నామమాత్రం స్థలాన్నే సెజ్ కింద ప్రకటించడం జరుగుతోంది. ఆ తర్వాత కొన్నాళ్లకు డీ నోటిఫికేషన్ చేసి, ధరల పెరుగుదల ప్రయోజనాలను పొందుతుండటం పరిపాటిగా మారింది’ అంటూ కాగ్ పేర్కొంది.
ఆరు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మొదలైనవి) 39,245.56 హెక్టార్ల స్థలాన్ని నోటిఫై చేయగా, ఇందులో 5,402.22 హెక్టార్లను (14 శాతం) తర్వాత డీనోటిఫై చేసి, ఇతరత్రా వాణిజ్య అవసరాలకు మళ్లించడం జరిగినట్లు కాగ్ తెలిపింది. అలాగే, నాలుగు రాష్ట్రాల్లో 11 డెవలపింగ్ సంస్థలు.. సెజ్ భూములను తాకట్టు పెట్టి రూ. 6,310 కోట్లు రుణం తీసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు, అర్హత లేనప్పటికీ పలు కేసుల్లో పన్ను పరమైన మినహాయింపులు కూడా ప్రభుత్వం ఇచ్చినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో సెజ్‌ల అనుమతి, పర్యవేక్షణ నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందంది.
రిలయన్స్ కేజీ-డీ6 వ్యయాల్లో కోత పెట్టాలి
కేజీ-డీ6 గ్యాస్ క్షేత్రంపై చేసిన వ్యయాలకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) 357.16 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2,179 కోట్లు) రికవరీకి కేంద్రం అనుమతించరాదని కాగ్ సూచించింది. ఆ సంస్థ వ్యయ రికవరీల్లో కోత పెట్టాలని పేర్కొంది. కేజీ-డీ6 బ్లాకు వ్యయాలపై రెండో సారి ఆడిట్ చేసిన కాగ్ ఈ మేరకు సూచనలు చేసింది.
సెజ్ భూములు దుర్వినియోగం
Published Sat, Nov 29 2014 1:40 AM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM
Advertisement