సాక్షి, అమరావతి: గంగవరం పోర్టు లిమిటెడ్(జీపీఎల్)లో డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి చెందిన 58.1 శాతం వాటాను రూ.3,604 కోట్లతో కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరినట్లు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్‌ఈజెడ్) లిమిటెడ్ తెలిపింది. ఈ ఒప్పందాన్ని నియంత్రణ సంస్థ ఆమోదించాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. జీపీఎల్‌లో వార్‌బర్గ్ పింకస్ సంస్థకు చెందిన 31.5 శాతం వాటాను మార్చి 3న ఏపీఎస్‌ఈజెడ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వార్‌బర్గ్ పింకస్, డీవీఎస్ రాజు, కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు వాటాను కలిపితే జీపీఎల్‌లో తమ వాటా 89.6 శాతానికి చేరుకుందని ఆ సంస్థ పేర్కొంది.
అదానీ పోర్ట్స్ 2% అప్...
గంగవరం పోర్టులో మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ షేరు 2 శాతం ఎగిసింది. బీఎస్‌ఈలో ఒక దశలో ఏకంగా 4.67 శాతం ఎగిసి రూ. 755.35 స్థాయిని కూడా తాకి చివరికి 2.3 శాతం లాభంతో రూ. 738.20 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం లాభంతో రూ. 737 వద్ద క్లోజయ్యింది. బీఎస్‌ఈలో 11.74 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 3 కోట్ల షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment