ఎమ్మార్ ఎంజీఎఫ్ సెజ్ రద్దు
న్యూఢిల్లీ: ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్‌కు ఇచ్చిన సెజ్ ఆమోదాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు సెయిల్ సెలెమ్ సెజ్, మరో 25 సెజ్ ఆమోదాలను కేంద్రం రద్దు చేసింది. ప్రత్యేక ఆర్థిక మండలాలు(సెజ్‌ల) ఏర్పాటుకు 18 సంస్థలకు మరింత గడువునిచ్చింది. ఈ నిర్ణయాలను గత నెల 24న వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ (బీఓఏ) తీసుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
సెజ్ ఆమోదాల రద్దుకు సంబంధించి 43 కేసులను బీఓఏ పరిశీలించిందని పేర్కొంది. డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్‌కు సంబంధించిన 14కేసులు, ఏపీ మార్క్‌ఫెడ్, డీసీ వీసెజ్‌కు చెందిన ఒక కేసులో సెజ్‌ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణంగా తలెత్తిన పరిస్థితుల కారణంగా ఈ 15 కేసులను బీఓఏ వాయిదావేసింది.
మరింత గడువు పొందిన సెజ్‌ల్లో-డీఎల్‌ఎఫ్ ఇన్ఫోపార్క్(పుణే), నవీ ముంబై సెజ్, ఇండియాబుల్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కర్ణాటక సెజ్‌లు ఉన్నాయి. కాగా సెజ్‌లకు సంబంధించి పునర్వ్యస్థీకరణ కసరత్తును కేంద్రం ప్రారంభించింది. సెజ్‌లకు సంబంధించి విధి, విధానాలను ప్రామాణీకరించడం, నిబంధనలు, ఫీజుల సరీళీకరణ, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై కసరత్తును మొదలు పెట్టింది. సెజ్ డెవలపర్లు వివిధ అంశాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.