Gulf Oil Corporation
-
ఎల్అండ్టీ ఫైనాన్స్, గల్ఫ్ ఆయిల్స్ లూబ్రికెంట్స్ స్టాక్స్ కొనొచ్చా?
ఎల్అండ్టీ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 96 టార్గెట్: రూ. 125 - కొనొచ్చు ఎందుకంటే: గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 47 శాతం జంప్‌చేసింది. రూ. 500 కోట్లను తాకింది. రుణ వ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 1,680 కోట్లకు చేరింది. ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం(పీపీవోపీ) అంచనాలకు అనుగుణంగా 9 శాతం బలపడి రూ. 1,240 కోట్లయ్యింది. అయితే మొత్తం రుణ ఆస్తులు 8 శాతం క్షీణించాయి. హోల్‌సేల్ రుణ ఆస్తులు 53 శాతం నీరసించడం ప్రభావం చూపింది. కాగా.. యాజమాన్య వ్యూహాల ప్రకారం రిటైల్ రుణ ఆస్తుల వేగవంత వృద్ధి కొనసాగింది. 35 శాతం ఎగశాయి. దీంతో కంపెనీ రుణ మిక్స్‌లో ప్రస్తుతం రిటైల్ రుణ ఆస్తుల వాటా 75 శాతానికి చేరింది. ఇటీవల నిర్వహించిన విశ్లేషకుల సమావేశంలో కంపెనీ యాజమాన్యం రిటైల్ విభాగంపై మరింత దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. తద్వారా మొత్తం లోన్‌బుక్‌లో రిటైల్ విభాగం పోర్ట్‌ఫోలియోను 90 శాతానికి పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు వీలుగా గ్రామీణ, మైక్రో, గ్రూప్ రుణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేసింది. ఇక మరోవైపు వృద్ధికి వీలుగా అనలిటిక్స్‌పై ప్రత్యేక దృష్టి, ప్రస్తుత కస్టమర్లకు విభిన్న ప్రొడక్టుల విక్రయం, టెక్నాలజీపై నిరవధిక పెట్టుబడులు తదితరాలను చేపడుతోంది. వెరసి 2.8–3 శాతం ఆర్వోఏ సాధించే లక్ష్యంగా సాగుతోంది. రిటైల్ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడం కంపెనీకి లబ్ధిని చేకూర్చే వీలుంది. గల్ఫ్ ఆయిల్స్ లూబ్రికెంట్స్ ప్రస్తుత ధర: రూ. 418 టార్గెట్: రూ. 813 కొనొచ్చు ఎందుకంటే: లూబ్రికెంట్స్ విభాగంలో దేశీయంగా క్యాస్ట్రాల్ తదుపరి రెండో పెద్ద కంపెనీగా గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండియా నిలుస్తోంది. మార్కెట్ వాటాను పెంచుకోవడంతోపాటు.. గత మూడేళ్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులలోనూ పటిష్టస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా సమర్ధతను చాటుకుంది. వాణిజ్య వాహన విభాగ వాతావరణం(సైకిల్) ఊపందుకోవడం, జాతీయ రహదారులపై రవాణా పుంజుకోవడం, జోరు చూపుతున్న పారిశ్రామికోత్పత్తి, యుటిలిటీ వాహన విక్రయాలలో వృద్ధి వంటి అంశాలు లూబ్రికెంట్స్‌కు డిమాండును పెంచనున్నట్లు అంచనా. వెరసి బిజినెస్ టు బిజినెస్(బీటూబీ) విభాగం నుంచి లూబ్రికెంట్స్ విక్రయాలు ఊపందుకోనున్నాయి. ఇది అంతిమంగా కంపెనీకి లబ్ధిని చేకూర్చనుంది. కంపెనీ లూబ్రికెంట్స్, చమురు అమ్మకాల పరిమాణంలో బీటూబీ విభాగం నుంచి 35– 40 శాతం నమోదవుతుండటం కంపెనీకి బలాన్నిస్తోంది. దీనికితోడు అమ్మకాలలో 65 శాతంవరకూ వాటాను ఆక్రమిస్తున్న బిజినెస్ టు కన్జూమర్(బీటూసీ) లూబ్రికెంట్ బిజినెస్ విస్తరణపైనా కంపెనీ కన్నేసింది. ఇందుకు అనుగుణంగా కొత్త ప్రాంతాలలో డీలర్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. బీటూబీ బిజినెస్‌తో పోలిస్తే బీటూసీలో మెరుగైన మార్జిన్లు ఆర్జిస్తోంది. ఇలాంటి పలు వ్యూహాత్మక అంశాలు కంపెనీ మార్కెట్ వాటాను పెంచనున్నాయి. ఆర్థిక పనితీరు మెరుగుకు దోహదపడనున్నాయి. వెరసి భవిష్యత్‌లో దేశీ లూబ్రికెంట్స్ మార్కెట్లో నాయకత్వ స్థాయికి చేరే అవకాశముంది. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే -
ఆ భూములు ఉదాసీన్ మఠానివే
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్ద కాలంగా ఉదాసీన్ మఠం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది. మఠం భూములపై గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (పాత ఐడీఎల్)తో ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకూ పోరాడి విలువైన భూమి అన్యాక్రాంతం కూడా చేశాయి. హైదరాబాద్ కూకట్పల్లి జంక్షన్‌లోని 540 ఎకరాల 30 గుంటల భూమి దేవాదాయ శాఖ పరిధిలోని ఉదా సీన్ మఠానికే చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గల్ఫ్ ఆయిల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ మఠం భూముల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా. నిజాం ఇనాం భూమి... నిజాం రాజు 1873లో కూకట్‌పల్లిలో ఉదాసీన్ మఠానికి 540 ఎకరాల 30 గుంటల భూమిని ఇనాంగా ఇచ్చారు. అనంతరం 1964, 1966ల్లో ఇండియన్ డిటోనేటర్స్ లిమిటెడ్ (గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్)కు ఉదాసీన్ మఠానికి చెందిన మహంత్ బాబా సేవా దాస్ 143 ఎకరాలు, 257 ఎకరాల 19 గుంటలు చొప్పున, 1969లో మహంత్ బాబా జ్ఞాన్ దాస్ 2 ఎకరాల 32 గుంటలు, 1978లో ఐడీఎల్ కెమికల్ లిమిటెడ్‌కు మహంత్ బాబా ధ్యాన్‌దాస్ 137 ఎకరాల 19 గుంటల్ని 99 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. నవంబరు 2006లో మహంత్ బాబా సాగర్ దాస్ తొలగింపు వరకు ఎలాంటి వివాదం లేదు. తదనంతరం మహంత్ అరుణ్ దాస్ జీ 24.8.2007న మఠం భూములు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ లీజుదారులకు నోటీసులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆ భూముల్లో శ్మశాన వాటిక వచ్చిందని, లీజుదారుడిని ఖాళీ చేయించాలంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌కు లేఖ రాశారు. తనిఖీ అనంతరం మూడు లీజు పత్రాలకు ప్రభుత్వ అనుమతి లేదని దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. 1978 నాటి లీజు దస్తావేజు మాత్రమే ప్రభుత్వ అనుమతితో ఉందని తేలింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ చారిటబుల్, హిందు మత సంస్థలు, దేవాదాయ చట్టాల ప్రకారం నాలుగు లీజులు కూడా చెల్లవని తేలింది. దీంతో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ఆయా భూముల్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తోందని ఆరోపిస్తూ మఠం, దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. భూముల లీజును ట్రిబ్యునల్ 2011లో రద్దుచేయడంతో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యునల్ తీర్పును 2013లో హైకోర్టు సమర్థించడంతో కార్పొరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు యథాతధ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఈ ఏడాది జనవరి నుంచి సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, న్యాయవాది పాల్వాయి వెంకట్‌రెడ్డి, మఠం తరఫున సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్, గల్ఫ్ ఆయిల్ తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్‌సాల్వే, పరాగ్ త్రిపాఠిలు వాదనలు వినిపించారు. ప్రభుత్వం, మఠం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. అనంతరం ఆ భూములు దేవాదాయ శాఖ పరిధిలోని మఠానికే చెందుతాయని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అభినందన ఆ భూమి దేవాదాయ శాఖ ఆధీనంలోని మఠానిదేనన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను, న్యాయవాదులను అభినందించారు. తీర్పు నేపథ్యంలో ఆ భూమిని పూర్తిస్థాయిలో తన ఆధీనంలోకి తీసుకునేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దాని చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఆ శాఖ, రూ.కోటి వ్యయంతో గోడ నిర్మాణం ప్రారంభించనుంది. సర్వే చేసి పూర్తి భూమి అందుబాటులో ఉందా, ఏమైనా కబ్జాలకు గురైందా అన్న విషయాలను తేల్చనున్నట్టు శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. ఆ భూముల్లో ఉదాసీన్ మఠం నిర్వహించే కార్యక్రమాలతో వచ్చే ఆదాయంలో 21 శాతం దేవాదాయ శాఖకు సంక్రమించనుంది. -
4కు చేరిన ఐడీఎల్ మృతుల సంఖ్య
హైదరాబాద్: కూకట్ పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్(పాత ఐడీఎల్)లో పేలుడులో మృతి చెందిన వారి సంఖ్య 4కు చేరింది. మహాత్మ గౌడ్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఫిబ్రవరి 23న ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డిటోనేటర్ ప్లాంట్ లో పేలుడు సంభవించడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. -
ఐడీఎల్ ఘటనలో మరొకరి మృతి
హైదరాబాద్‌సిటీ: బాలానగర్‌లోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (పాత ఐడీఎల్)లో ఈనెల 23న జరిగిన పేలుడులో గాయపడ్డ మరో వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఖైరతాబాద్ డివిజన్ న్యూసీఐబీ క్వార్టర్స్‌లో నివాసముండే కృష్ణస్వామి (59) ఆ రోజు జరిగి ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఎల్ అపోలో ఆసుపత్రికి తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న కృష్ణస్వామి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ విషయం తెలిసి ఖైరతాబాద్‌లోని న్యూసీఐబీ క్వార్టర్స్ పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య లక్ష్మీబాయి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా, కృష్ణస్వామి మృతితో గల్ఫ్ ఆయిల్’ ప్రమాదంలో గాయపడి మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. -
కూకట్పల్లి ఐడీఎల్లో పేలుడు
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట రాజధానిలోని కూకట్పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (పాత ఐడీఎల్)లో సోమవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలో దాదాపు 240 మంది కార్మికులు రోజూ విధులు నిర్వర్తిస్తుంటారు. వీరిలో ఎక్కువ శాతం క్యాజు వల్ కార్మికులే. అనుభవం ఉన్న కార్మికులు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో మిడిమిడి పరి జ్ఞానం ఉన్న కార్మికులను కీలకమైన డిటోనేటర్ ప్లాంట్‌లో పని చేయిస్తున్నారు. ఈ నేపథ్యం లోనే సోమవారం ఆ ప్లాంట్‌లో దాదాపు 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా డిటోనేటర్ ప్లాంట్‌లో కొద్దిరోజులుగా వాడకుండా వదిలేసిన ఫ్యూయల్ కాయిల్స్‌ను రీప్లేస్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఇందులో నేరెడ్మెట్ ఆర్కే నగర్‌కు చెందిన శ్రావణ్ (23), కూకట్పల్లి బాలాజీనగర్‌కు చెందిన అమర్ (22) దేహాలు పేలుడు ధాటికి తునాతునకలయ్యాయి. అదే ప్లాంట్‌లో ఉన్న మరో పదమూడుమంది పురు షోత్తం(30), శ్రీకాంత్, మల్లేశ్ (48), రాజేశ్ (25), ప్రకాశ్, డ్రైవర్ రాములు (40), కృష్ణ స్వామి (59), లక్ష్మణ్ (28), ఎం.రాజు (35), ముత్యాలరావు (56), సురేందర్‌రెడ్డి (24), అబ్దుల్ సలీం (59), ఓంప్రకాశ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో సురేందర్‌రెడ్డి 40 శాతానికి పైగా, అబ్దుల్సలీం 36 శాతం, కృష్ణస్వామి 80 శాతం, ముత్యాలరావు 70 శాతం వరకు గాయపడడంతో వీరిని డీఆర్డీవో అపోలోకు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప ఇప్పుడే ఏమీ చెప్పలేమని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇప్పిస్తాం: హోం మంత్రి ఐడీఎల్ కంపెనీలో ప్రమాదం దురదృష్టకరమని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనంతరం మృతుల కుటుం బాలకు న్యాయం చేయాలని యాజమాన్యంతో చర్చలు జరిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇప్పించేందుకు యాజమాన్యాన్ని ఒప్పించామన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కార్మికులకు అండగా నిలిచామని తెలిపారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ఘటనాస్థలిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, గాంధీలు సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. నిశ్చితార్థం జరిగిన 10 రోజులకే... ఈ ఘటనలో మృత్యువాత పడ్డ శ్రావణ్‌కు 10 రోజుల కిందటే వివాహ నిశ్చితార్థం జరిగింది. ఇంట్లో పెళ్లి ఏర్పాట్లలో ఉన్న కుటుంబసభ్యులు, బంధువులు శ్రావణ్ మృతితో ఒక్కసారిగా విషాదంలో మునిగి పోయారు. చేతికందివచ్చిన కొడుకు ప్రమా దంలో మృత్యువాత పడడాన్ని శ్రావణ్ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
ఐడీఎల్లో మరణ మృదంగం
9 ప్రమాదాలు... 40 మంది బలి భద్రతకు తిలోదకాలు జనావాసాల నడుమనే పేలుళ్లు తాజాగా ఇద్దరి మృతి కూకట్పల్లి: ఆ సంస్థ యాజమాన్యానికి లాభాలపై ఉన్న శ్రద్ధ... ప్రజలు... కార్మికుల ప్రాణాలు కాపాడడంపై ఉండడం లేదు. అక్కడ భద్రతా ప్రమాణాల పట్టింపు ఉండదు. ఫలితంగా ఎప్పటికప్పుడు కార్మికుల ప్రాణాల మీదకు వస్తోంది. కూకట్‌పల్లిలోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (పాత ఐడీఎల్)లో ఇప్పటి వరకు 40 మంది కార్మికులు బలయ్యారు. 1968లో ప్రారంభమైన ఈ కంపెనీలో మొదట్లో 3,800 మంది కార్మికులు పని చేసేవారు. ప్రస్తుతం రెండు వందల పైచిలుకు కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. కూకట్పల్లి, మూసాపేట గ్రామాల సర్వే నెంబర్లలోని వెయ్యి ఎకరాల్లో విస్తరించిన ఈ సంస్థ ప్రస్తుతం జనావాసాల మధ్యలో ఉంది. దీనిని తరలించాలనే డిమాండ్ పదిహేనేళ్లుగా వినిపిస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు రెండు పెద్ద ప్రమాదాలు సంభవించాయి. 1976లో జరిగిన భారీ పేలుడులో 11 మంది కార్మికులు చనిపోగా... 2003 నవంబర్‌లో డీఎఫ్-2 ప్లాంట్ పేలుడు ఘటనలో 13 మంది కార్మికులు మరణించారు. 2008లో మరో ప్రమాద సంఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. 2011లో డీఎఫ్-1 ప్లాంట్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇలా గత 45 ఏళ్లలో ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ప్రమాదాలు సంభవించినట్లు కార్మికులు తెలుపుతున్నారు. వీటిలో 40 మంది మృత్యువాత పడ్డారు. అప్పుడప్పుడు జరిగిన ప్రమాదాల్లో కార్మికులు తీవ్ర గాయాలపాలైన సంఘటనలు అనేకం. అక్కడే పేలుడు పరీక్షలు డిటోనేటర్లను తయారు చేయడమే కాకుండా... పేలుతున్నాయా లేదా అనే పరీక్షలు ఇక్కడే చేస్తుంటారు. ఆ పేలుడు సమయంలో భారీ శబ్దంతో సమీపంలోని ఇళ్లు ధ్వంసమైన సంఘటనలు ఎన్నో. పక్కనే ఉన్న కేపీహెచ్‌బీ కాలనీ, ఖైత్లాపూర్, సేవాలాల్‌నగర్ ప్రాంతాల వాసులు ఐడీఎల్ పేలుళ్లతో తమ ఇళ్లకు ముప్పు ఉందని అనేక సార్లు ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. అయినా స్పందించిన వారే లేరు. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కంపెనీ లోపల కారడవిని తలపించే వనం ఉంది. పక్కనే చెరువు కూడా ఉంది. చెరువు అంచున టెస్టింగ్ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఏ పరికరాన్ని ముట్టుకున్నా ప్రమాదకరంగానే ఉంటాయి. దీంతో కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని లోపలికి వెళ్తుంటారు. తిరిగి వచ్చే వరకు భయం.. భయంగా విధులు నిర్వహిస్తున్నారు. గత పదేళ్లలో రెండు వేల మంది కార్మికులు వీఆర్ఎస్ తీసుకొని బయటికి వెళ్లిపోయారు. కార్మికులు తగ్గిపోయినా సంస్థను తరలించడం లేదు. ఆదాయమే మార్గంగా... అనుభవం ఉన్న కార్మికులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో అనుభవం లేని కాంట్రాక్ట్ కార్మికులతో ఐడీఎల్ యాజమాన్యం నెట్టుకుంటూ వస్తోంది. అసలే ప్రమాదకరమైన డిటోనేటర్ల మధ్య నిరంతరం విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అనుభవంతో పాటు భద్రతకూ ప్రాధాన్యమివ్వాలి. వీటిని యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా ఆదాయమే ప్రధాన లక్ష్యంగా ఉందని కార్మికులు వాపోతున్నారు. ప్రమాదాలకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటున్నారు. నాడు కారడవి... నేడు కాంక్రీట్ జంగిల్ భాగ్యనగర్ కాలనీ: ఇండియన్ డిటోనేటర్స్ లిమిటెడ్ (ఐడీఎల్) కంపెనీ 1968లో నగరానికి దూరంగా ఉన్న కూకట్పల్లి, మూసాపేట గ్రామాల మధ్య ఏర్పాటైంది. దీని కోసం స్థానికుల నుంచి వెయ్యి ఎకరాల భూమిని సేకరించారు.భూమికి పరిహారంతో పాటు సంబంధీకులకు ఉద్యోగాలనూ ఇచ్చారు. కాలక్రమంలో చుట్టూ గృహాలు వెలిశాయి. దీంతో ఇది నగరం మధ్యలోకి వచ్చినట్లయింది. ఐడీఎల్ చుట్టూ ఉన్న కేపీహెచ్‌బీ కాలనీలో పేలుళ్ల దాటికి ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఈ పరిశ్రమ ఇలానే కొనసాగితే 15 అంతస్తుల వరకు ఉన్న సైబర్ సిటీ, 35 అంతస్తులు ఉన్న లోధా భవనాలు...ఇతర కట్టడాలకూ ముప్పు తప్పదు. దీన్ని తరలించాలని ప్రజల నుంచి భారీ స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండటంతో... యాజమాన్యానికి కొమ్ముకాస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత నిరసన వ్యక్తమవుతున్నా ఈ ప్రాంతంలోనే కంపెనీ డిటోనేటర్ టెస్టింగ్‌లు కొనసాగుతున్నాయి. దీంతో బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతింటున్నాయి. తాజా ఘటన తోనైనా ప్రభుత్వం స్పందించి.. సంస్థ ను నగరానికి దూరంగా తరలించాలని స్థానికులు మరోసారి కోరుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే: టీడీపీ ఎమ్మెల్యేల ఆరోపణ భాగ్యనగర్ కాలనీ: ఎలాంటి అనుభవం లేని కాంట్రాక్టు కార్మికులతో యాజమాన్యం పని చేయించుకోవడం వల్లనే ఐడీఎల్లో పేలుడు సంభవించిందని టీడీపీ నేతలు ఆరోపించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల వంతున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఎమ్మార్ ఎంజీఎఫ్ సెజ్ రద్దు
న్యూఢిల్లీ: ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్‌కు ఇచ్చిన సెజ్ ఆమోదాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు సెయిల్ సెలెమ్ సెజ్, మరో 25 సెజ్ ఆమోదాలను కేంద్రం రద్దు చేసింది. ప్రత్యేక ఆర్థిక మండలాలు(సెజ్‌ల) ఏర్పాటుకు 18 సంస్థలకు మరింత గడువునిచ్చింది. ఈ నిర్ణయాలను గత నెల 24న వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ (బీఓఏ) తీసుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెజ్ ఆమోదాల రద్దుకు సంబంధించి 43 కేసులను బీఓఏ పరిశీలించిందని పేర్కొంది. డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్‌కు సంబంధించిన 14కేసులు, ఏపీ మార్క్‌ఫెడ్, డీసీ వీసెజ్‌కు చెందిన ఒక కేసులో సెజ్‌ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణంగా తలెత్తిన పరిస్థితుల కారణంగా ఈ 15 కేసులను బీఓఏ వాయిదావేసింది. మరింత గడువు పొందిన సెజ్‌ల్లో-డీఎల్ఎఫ్ ఇన్ఫోపార్క్(పుణే), నవీ ముంబై సెజ్, ఇండియాబుల్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కర్ణాటక సెజ్‌లు ఉన్నాయి. కాగా సెజ్‌లకు సంబంధించి పునర్వ్యస్థీకరణ కసరత్తును కేంద్రం ప్రారంభించింది. సెజ్‌లకు సంబంధించి విధి, విధానాలను ప్రామాణీకరించడం, నిబంధనలు, ఫీజుల సరీళీకరణ, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై కసరత్తును మొదలు పెట్టింది. సెజ్ డెవలపర్లు వివిధ అంశాలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. -
గల్ఫ్ ఆయిల్ లాభం 18 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హిందుజా గ్రూపునకు చెందిన గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.272 కోట్ల ఆదాయంపై రూ. 18 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.265 కోట్ల ఆదాయంపై 17 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఏడాది మొత్తం మీద గల్ఫ్ ఆయిల్ నికరలాభం రూ. 47 కోట్ల నుంచి రూ.70 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ. 1,285 కోట్ల నుంచి రూ. 1,301 కోట్లకు చేరింది. వాటాదారులకు రూ. 2.50 డివిడెండ్‌ను ప్రకటిస్తూ గురువారం బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గల్ఫ్ ఆయిల్ నుంచి లూబ్రికెంట్ వ్యాపారాన్ని విడదీస్తూ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండియా లిమిటెడ్‌తో ఏర్పాటు చేస్తున్న కంపెనీకి హైకోర్టు నుంచి అనుమతి రావడంతో డీమెర్జర్ స్కీంను అమలు చేయడానికి బోర్డు నిర్ణయం తీసుకుంది.