ఆ భూములు ఉదాసీన్‌ మఠానివే | Supreme Court Rules 540 Acre Land At Kukatpally Belongs To Udasin Mutt | Sakshi
Sakshi News home page

ఆ భూములు ఉదాసీన్‌ మఠానివే

Published Thu, Sep 15 2022 2:18 AM | Last Updated on Thu, Sep 15 2022 8:29 AM

Supreme Court Rules 540 Acre Land At Kukatpally Belongs To Udasin Mutt - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్ద కాలంగా ఉదాసీన్‌ మఠం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది. మఠం భూములపై గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (పాత ఐడీఎల్‌)తో ట్రిబ్యునల్‌ నుంచి సుప్రీంకోర్టు వరకూ పోరాడి విలువైన భూమి అన్యాక్రాంతం కూడా చేశాయి. హైదరాబాద్‌ కూకట్‌పల్లి జంక్షన్‌లోని 540 ఎకరాల 30 గుంటల భూమి దేవాదాయ శాఖ పరిధిలోని ఉదా సీన్‌ మఠానికే చెందుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ గల్ఫ్‌ ఆయిల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ మఠం భూముల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా. 

నిజాం ఇనాం భూమి...
నిజాం రాజు 1873లో కూకట్‌పల్లిలో ఉదాసీన్‌ మఠానికి 540 ఎకరాల 30 గుంటల భూమిని ఇనాంగా ఇచ్చారు. అనంతరం 1964, 1966ల్లో ఇండియన్‌ డిటోనేటర్స్‌ లిమిటెడ్‌ (గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌)కు ఉదాసీన్‌ మఠానికి చెందిన మహంత్‌ బాబా సేవా దాస్‌ 143 ఎకరాలు, 257 ఎకరాల 19 గుంటలు చొప్పున, 1969లో మహంత్‌ బాబా జ్ఞాన్‌ దాస్‌ 2 ఎకరాల 32 గుంటలు, 1978లో ఐడీఎల్‌ కెమికల్‌ లిమిటెడ్‌కు మహంత్‌ బాబా ధ్యాన్‌దాస్‌ 137 ఎకరాల 19 గుంటల్ని 99 ఏళ్లకు లీజుకు ఇచ్చారు.

నవంబరు 2006లో మహంత్‌ బాబా సాగర్‌ దాస్‌ తొలగింపు వరకు ఎలాంటి వివాదం లేదు. తదనంతరం మహంత్‌ అరుణ్‌ దాస్‌ జీ 24.8.2007న మఠం భూములు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ లీజుదారులకు నోటీసులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆ భూముల్లో శ్మశాన వాటిక వచ్చిందని, లీజుదారుడిని ఖాళీ చేయించాలంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌కు లేఖ రాశారు.

తనిఖీ అనంతరం మూడు లీజు పత్రాలకు ప్రభుత్వ అనుమతి లేదని దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. 1978 నాటి లీజు దస్తావేజు మాత్రమే ప్రభుత్వ అనుమతితో ఉందని తేలింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ చారిటబుల్, హిందు మత సంస్థలు, దేవాదాయ చట్టాల ప్రకారం నాలుగు లీజులు కూడా చెల్లవని తేలింది. దీంతో గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఆయా భూముల్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తోందని ఆరోపిస్తూ మఠం, దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి.

భూముల లీజును ట్రిబ్యునల్‌ 2011లో రద్దుచేయడంతో గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ హైకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యునల్‌ తీర్పును 2013లో హైకోర్టు సమర్థించడంతో కార్పొరేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు యథాతధ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఈ ఏడాది జనవరి నుంచి సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్, న్యాయవాది పాల్వాయి వెంకట్‌రెడ్డి, మఠం తరఫున సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్, గల్ఫ్‌ ఆయిల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌సాల్వే, పరాగ్‌ త్రిపాఠిలు వాదనలు వినిపించారు. ప్రభుత్వం, మఠం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. అనంతరం ఆ భూములు దేవాదాయ శాఖ పరిధిలోని మఠానికే చెందుతాయని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అభినందన
ఆ భూమి దేవాదాయ శాఖ ఆధీనంలోని మఠానిదేనన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను, న్యాయవాదులను అభినందించారు. తీర్పు నేపథ్యంలో ఆ భూమిని పూర్తిస్థాయిలో తన ఆధీనంలోకి తీసుకునేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దాని చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఆ శాఖ, రూ.కోటి వ్యయంతో గోడ నిర్మాణం ప్రారంభించనుంది.

సర్వే చేసి పూర్తి భూమి అందుబాటులో ఉందా, ఏమైనా కబ్జాలకు గురైందా అన్న విషయాలను తేల్చనున్నట్టు శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ‘సాక్షి’తో చెప్పారు. ఆ భూముల్లో ఉదాసీన్‌ మఠం నిర్వహించే కార్యక్రమాలతో వచ్చే ఆదాయంలో 21 శాతం దేవాదాయ శాఖకు సంక్రమించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement