సర్కారే దళారీ కారాదు | Can not be brokered sarkare | Sakshi
Sakshi News home page

సర్కారే దళారీ కారాదు

Published Sun, Jan 25 2015 2:24 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

సర్కారే దళారీ కారాదు - Sakshi

సర్కారే దళారీ కారాదు

  • ప్రభుత్వమే భూములు సేకరిస్తూ రియల్టర్‌గా మారడం సరికాదు
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి
  • పర్యావరణ వేత్త, న్యాయవాది ఎం.సి.మెహతా
  • సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణంపై ఒంటెత్తుపోకడతో వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని ప్రముఖ పర్యావరణవేత్త, సుప్రీంకోర్టు న్యాయవాది మహేశ్ చంద్ర మెహతా (ఎం.సి. మెహతా)  పేర్కొన్నారు. పచ్చటి, సారవంతమైన పొలాలను భవంతుల నిర్మాణానికి, కంపెనీలకు కట్టబెట్టేందుకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ఉపయోగించడం క్షంతవ్యం కాదన్నారు.

    ప్రజల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో పునరాలోచన చేయాలని, రైతుల భూములను బలవంతంగా లాక్కొనే ప్రయత్నాలు ఆపి ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని సూచించారు. గంగానది ప్రక్షాళన మొదలుకొని శివకాశీ టపాసుల ఫ్యాక్టరీల్లో బాలకార్మికుల వెట్టిచాకిరీ వరకూ పర్యావరణ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయస్థానాల్లో పోరాడి పలు విజయాలు సాధించిన ఎం.సి.మెహతా ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ ఆయన్ను పలకరించిం ది. ఆ వివరాలు..

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 29 గ్రామాలకు చెందిన 35 వేల ఎకరాల భూములను రాజధాని పేరుతో సేకరించేందుకు ప్రయత్నిస్తోందన్న సమాచారం విస్మయపరిచింది. రాజధాని అనేది ప్రజా అవసరాలు తీర్చేదిగా ఉండాలేగానీ.. పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకు భూమి పంచేందుకు కాదు.

    రైతుల నుంచి సేకరించిన భూమిని, పరిశ్రమలకు, కంపెనీలకు ఇచ్చేందుకు, అధిక ధరలకు వేలం వేసి నిధులు సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించటం సరికాదు. ళీదేశంలో జీవవైవిధ్యానికి పట్టుకొమ్మల్లాంటి తూర్పు, పశ్చిమ కనుమలను ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకోవాల్సిందే. లేదంటే భూతాపోన్నతి ఫలితంగా వస్తున్న వాతావరణ మార్పులతో సమీప భవిష్యత్తులో పూడ్చుకోలేనంత నష్టం కలుగుతుంది.
     
    విదేశాలతో పోలికెందుకు?

    విదేశాలతో పోలిస్తే మన సంస్కృతి, అవసరాలు వేరు. రాజధాని విషయంలో సింగపూర్‌తో పోలికెందుకు? మీరు వాషింగ్టన్ ఎప్పుడైనా చూశారా? అమెరికా రాజధానిలో పరిపాలన భవనాలున్న ప్రాంతాలు సాయంత్రానికి నిర్మానుష్యంగా మారిపోతాయి. మన అవసరాలు బట్టీ ఉండాలి.
     
    చట్టాల అమలే సవాలు

    దేశంలో భూముల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త చట్టాలు చేయాల్సిన అవసరమేమీ లేదు. ఉన్న చట్టాలే సరిపోతాయి. కాకపోతే వీటిని సక్రమంగా అమలు చేయడమనేదే పెద్ద సవాలు. మన న్యాయవ్యవస్థ  చురుకుగా ఉండటం వల్ల నష్టాన్ని కొంతవరకైనా తగ్గించుకోగలిగాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement