సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన పిటిషన్లు జూలై 11న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌తోపాటు మరికొన్ని వ్యాజ్యాలు మంగళవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చాయి. ఇతర కేసుల విచారణతో కోర్టు సమయం ముగియడంతో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, నిరంజన్‌రెడ్డిలు పిటిషన్ విచారణ అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
వీలైనంత త్వరగా విచారణ తేదీ ఖరారు చేయాలని, ఏప్రిల్ 11 జాబితాలో చేర్చాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. అయితే, జూలై 11న జాబితాలో చేర్చాలని ఆదేశిస్తామని ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు కాకుండా ఏప్రిల్‌లో ఏదో ఒక తేదీ ఖరారు చేయాలని ఏపీ న్యాయవాదులు కోరారు. ఏప్రిల్ 11న ఇప్పటికే 13 అంశాలు జాబితా అయ్యాయని ఆ తర్వాత అంశంగా చేపడతామని జస్టిస్ జోసెఫ్ చెప్పారు. జాబితాలో తొలి అంశంగా చేర్చాలని, గతంలోనూ తొలి అంశంగా చేర్చారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. జూలైలో విచారణ చేపడతామని, ఈ మధ్య కాలంలో సుదీర్ఘ విచారణ సాధ్యం కాదని ధర్మాసనం పేర్కొంది.
విచారణకు ఎంత సమయం తీసుకుంటారని అన్ని పక్షాల న్యాయవాదులను జస్టిస్ బీవీ నాగరత్న కోరారు. ప్రతివాదులుగా సుమారు 250 మంది ఉన్నారని ఓ న్యాయవాది తెలిపారు. ఏపీ తరపు న్యాయవాది కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న చట్టాలపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగని పూర్తిస్థాయి స్టే ఎక్కడా లేదు. పైగా ఈ అంశం కోర్టు పరిధిలోది కాదు. ఇది పూర్తిగా అకడమిక్ (థియరిటికల్ ఆసక్తి ఉంటుంది కానీ ప్రాక్టికల్ రిలవెన్స్ ఉండదు).
వాదనలకు ఓ గంట చాలు. రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టేశారు. అభివృద్ధి ముందుకు వెళ్లడంలేదు. మీరే త్వరగా విచారణ పూర్తి చేయాలి. ఈ అంశాన్ని తేల్చాలి’’ అని ధర్మాసనానికి వివరించారు. దీనికి జస్టిస్ కేఎం జోసెఫ్ స్పందిస్తూ.. జూన్‌లో పదవీ విరమణ చేస్తున్నానని, ఈలోగా సుదీర్ఘంగా కేసు వినడం సాధ్యం కాదని చెప్పారు. జూలై 11న జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment