సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి అంశంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యు.యు.లలిత్ తిరస్కరించారు. తాను సభ్యుడిగాలేని మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, మస్తాన్‌వలి, మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లు మంగళవారం సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందుకొచ్చాయి.
రైతుల తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తూ.. గతంలో జస్టిస్ యు.యు.లలిత్ సీనియర్ న్యాయ వాదిగా ఉన్న సమయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అమరావతిపై న్యాయసలహా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. సుందరం ఇచ్చిన సదరు కాపీని పరిశీలించిన సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ ఈ పిటిషన్లను తాను విచారించనని తెలిపారు.
అమరావతిపై న్యాయసలహా ఇచ్చిన విషయం తనకు గుర్తుకురాలేదని, ఈ నేపథ్యంలో తాను ఈ పిటిషన్లపై విచారణ నుంచి వైదొలగుతున్నట్లు పేర్కొన్నారు. తాను సభ్యుడిగాలేని ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణ తేదీ తెలపాలని రైతుల తరఫు న్యాయవాదులు కోరగా తాను విచారించని అంశంపై తేదీ నిర్ణయించడం సబబు కాదని, రిజిస్ట్రీ ఖరారు చేస్తుందని పేర్కొన్నారు.
చదవండి: (సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ.. పిటిషన్‌లో కీలక అంశాలివే..)
Comments
Please login to add a commentAdd a comment