హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట రాజధానిలోని కూకట్‌పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (పాత ఐడీఎల్)లో సోమవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలో దాదాపు 240 మంది కార్మికులు రోజూ విధులు నిర్వర్తిస్తుంటారు. వీరిలో ఎక్కువ శాతం క్యాజు వల్ కార్మికులే. అనుభవం ఉన్న కార్మికులు చాలా తక్కువ.
ఈ నేపథ్యంలో మిడిమిడి పరి జ్ఞానం ఉన్న కార్మికులను కీలకమైన డిటోనేటర్ ప్లాంట్‌లో పని చేయిస్తున్నారు. ఈ నేపథ్యం లోనే సోమవారం ఆ ప్లాంట్‌లో దాదాపు 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా డిటోనేటర్ ప్లాంట్‌లో కొద్దిరోజులుగా వాడకుండా వదిలేసిన ఫ్యూయల్ కాయిల్స్‌ను రీప్లేస్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఇందులో నేరెడ్‌మెట్ ఆర్కే నగర్‌కు చెందిన శ్రావణ్ (23), కూకట్‌పల్లి బాలాజీనగర్‌కు చెందిన అమర్ (22) దేహాలు పేలుడు ధాటికి తునాతునకలయ్యాయి.
అదే ప్లాంట్‌లో ఉన్న మరో పదమూడుమంది పురు షోత్తం(30), శ్రీకాంత్, మల్లేశ్ (48), రాజేశ్ (25), ప్రకాశ్, డ్రైవర్ రాములు (40), కృష్ణ స్వామి (59), లక్ష్మణ్ (28), ఎం.రాజు (35), ముత్యాలరావు (56), సురేందర్‌రెడ్డి (24), అబ్దుల్ సలీం (59), ఓంప్రకాశ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో సురేందర్‌రెడ్డి 40 శాతానికి పైగా, అబ్దుల్‌సలీం 36 శాతం, కృష్ణస్వామి 80 శాతం, ముత్యాలరావు 70 శాతం వరకు గాయపడడంతో వీరిని డీఆర్‌డీవో అపోలోకు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప ఇప్పుడే ఏమీ చెప్పలేమని స్పష్టం చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇప్పిస్తాం: హోం మంత్రి
ఐడీఎల్ కంపెనీలో ప్రమాదం దురదృష్టకరమని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనంతరం మృతుల కుటుం బాలకు న్యాయం చేయాలని యాజమాన్యంతో చర్చలు జరిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇప్పించేందుకు యాజమాన్యాన్ని ఒప్పించామన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కార్మికులకు అండగా నిలిచామని తెలిపారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ఘటనాస్థలిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, గాంధీలు సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
నిశ్చితార్థం జరిగిన 10 రోజులకే...
ఈ ఘటనలో మృత్యువాత పడ్డ శ్రావణ్‌కు 10 రోజుల కిందటే వివాహ నిశ్చితార్థం జరిగింది. ఇంట్లో పెళ్లి ఏర్పాట్లలో ఉన్న కుటుంబసభ్యులు, బంధువులు శ్రావణ్ మృతితో ఒక్కసారిగా విషాదంలో మునిగి పోయారు. చేతికందివచ్చిన కొడుకు ప్రమా దంలో మృత్యువాత పడడాన్ని శ్రావణ్ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కూకట్‌పల్లి ఐడీఎల్‌లో పేలుడు
Published Tue, Feb 24 2015 4:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement