The lives of the workers
-
వెలుగులేని జీవితాలు
దయనీయ స్థితిలో డిస్మిస్డ్ కార్మికుల కుటుంబాలు నాగాల పేరుతో తొలగించిన సింగరేణి సంవత్సరాల తరబడి నిత్య నరకం సీఎం కేసీఆర్ నిర్ణయంపైనే ఆశలు సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు అప్పటి ప్రభుత్వం, యాజమాన్యం కలిసి తీసుకున్న ఒక నిర్ణయం వేలాది మంది కార్మికుల జీవితాలను ఛిద్రం చేసింది. అది ఎంతగా అంటే.. వారు తరతరాలు కోలుకోలేనంతగా దెబ్బతీసింది. కేవలం విధులకు సక్రమంగా హాజరుకావడం లేదనే సాకుతో నిర్ధాక్షిణ్యంగా విధుల నుంచి డిస్మిస్ చేసింది. ఈ ప్రక్రియ 1993 నుంచి 2010 వరకు కొనసాగింది. సుమారు 12000 మంది రోడ్డున పడ్డారు. ఇలా కొలువు పోయిన రందితో అనారోగ్యం పాలై కొందరు తనువు చాలించారు. మరి కొందరు కనీసం తిండిగింజలు కూడా దొరక్క ఆకలి చావులకు గురయ్యారు. మరి కొందరు ప్రాణాలతో మిగిలి ఉన్నా దీనమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొలువుతోపాటు ఇంటి పెద్దనూ కోల్పోయిన కుటుంబాల సభ్యులు నిత్య నరకం అనుభవిస్తున్నారు. ఏ తప్పూ చేయకుండానే ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ ఏనాటికైనా న్యాయం చేస్తుందనే నమ్మకంతో వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన భరోసానే నేడు వారిని బతికిస్తోంది. ఈ సందర్భంగా ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన పలువురు డిస్మిస్డ్ కార్మికుల కుటుంబ సభ్యులు తమ గోసను ‘సాక్షి’తో చెప్పుకున్నారు. - మందమర్రి(ఆదిలాబాద్) అప్పుచేసి పిల్లల పెండ్లి చేసిన నా పెనిమిటి కాంపెల్లి రాజిరెడ్డి మందమర్రి కేకే-5 గనిలో టింబర్‌మెన్‌గా పనిచే సిండు. కాళ్ల నొప్పులు, ఛాతినొప్పులతోని డ్యూటీకి సక్కగ పోలేదు. 1999లో నాగాలు ఎక్కువైనయని డిస్మిస్ చేసిండ్లు. అప్పటి వరకు ఏ లోటు లేకుంట బతిక మాకు కష్టాలు మొదలైనయి. ఆ బాధలతోనే ఆయన 2002లో చనిపోయిండు. కూలి పనుల కు పొయ్యి ఐదుగురు పిల్లలను సాదు కుంటాన. అప్పులు చేసి ఇద్దరు ఆడపిల్లలకు పెండ్లి చేసిన. అప్పులు తీరక నానా తంటాలు పడుతున్న. - కాంపెల్లి కనకమ్మ, ఎర్రగుంటపల్లె బడికి పంపే స్థోమత లేక.. మా ఆయన చెన్నూర్-1 ఇన్క్లైన్లో పనిచేసిండు. గ్యాస్, దుమ్ముకు తట్టుకోలేక డ్యూటీకి నాగాలు పెట్టేది. సింగరేణోళ్లు 2002 సంవత్సరం నాగాలు ఎక్కువ చేత్తాండని డిస్మిస్ చేసిండ్లు. రెండేండ్లు కూలి పనులు చేసి మమ్ములను సాదిండు. 2004ల ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోయిండు. పెద్దదిక్కును కోల్పోవడం తో ముగ్గురు పిల్లలను చదివించే స్థోమత లేక నాతో పాటే కూలి పనికి తీసుకపోయి వచ్చిన డబ్బులతో పొట్టపోసుకుంటానం. - మల్లెత్తుల సత్తమ్మ, భీమారం చేతిలో చిల్లిగవ్వ లేదు మా ఆయన గోలేటి-2లో మైనింగ్ సర్దార్‌గా పనిచేసిండు. కొన్నేండ్ల కింద బాయిపని చేయబట్టి అనారోగ్యానికి గురికావడంతో డ్యూటీకి సక్రమంగా పోలేదు. దీంతో 1998 సంవత్సరంల సింగరేణి సార్లు గైర్హాజరైతాండని పెనిమిటిని బాయి నౌకరి నుంచి తీసేండ్లు. కూలి నాలి చేసి మమ్ములను సాదిండు. పూట పూటకూ ఇబ్బందులే. ఎట్ల బతకాలనే రంది పెట్టుకున్నడు. దాంతోనే ఆయన 2002లో పానమిడిసిండు. అప్పటి నుంచి నేను.. ముగ్గురు పిల్లలు.. పడరాని కష్టాలు పడుతున్నం. రోజు గడవడమే కష్టంగా ఉంది. పిల్లలు పెండ్లికి ఎదిగిండ్లు. చేతిలో చిల్లి గవ్వ లేదు. - ఎలికటి మరియ, గోలేటి కూలి పనికిపోయి బతుకుతానం నా భర్త పొట్ట రాములు కాసిపేట గనిలో కోల్ ఫిల్లర్‌గా పనిచేసేది. పానం బాగలేక నౌకరికి నాగాలు పెడితే 2000 సంవత్సరంల కంపెనీ డిస్మిస్ చేసింది. గప్పటి నుంచి జీతం లేదు. ఐదుగురు పిల్లలను సాదలేక రందితోని మంచం పట్టి 2005లో చనిపోయిండు. కూలి పనులు చేసుకుంట పిల్లలను బతికించుకుంటాన. - పొట్ట లక్ష్మి, మందమర్రి అందరికీ న్యాయం చేయాలి గైర్హాజర్ పేరుతో డిస్మిస్ చేసిన కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగం ఇవ్వాలి. వృద్ధాప్యానికి చేరిన వారితోపాటు మృతి చెందిన డిస్మిస్డ్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కంపెనీ ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలి. డిస్మిస్డ్ కార్మికులకు న్యాయం చేయాలని 12 ఏళ్లుగా ఎన్నో ఆందోళనలు, దీక్షలు చేస్తూనే ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో తమ సమస్యను సీమాంధ్ర పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ నేత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డిస్మిస్డ్ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ఆశతోనే ఎదురు చూస్తున్నం. - బీదబోయిన రవీందర్, డిస్మిస్డ్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి -
కూకట్పల్లి ఐడీఎల్లో పేలుడు
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట రాజధానిలోని కూకట్పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (పాత ఐడీఎల్)లో సోమవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలో దాదాపు 240 మంది కార్మికులు రోజూ విధులు నిర్వర్తిస్తుంటారు. వీరిలో ఎక్కువ శాతం క్యాజు వల్ కార్మికులే. అనుభవం ఉన్న కార్మికులు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో మిడిమిడి పరి జ్ఞానం ఉన్న కార్మికులను కీలకమైన డిటోనేటర్ ప్లాంట్‌లో పని చేయిస్తున్నారు. ఈ నేపథ్యం లోనే సోమవారం ఆ ప్లాంట్‌లో దాదాపు 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా డిటోనేటర్ ప్లాంట్‌లో కొద్దిరోజులుగా వాడకుండా వదిలేసిన ఫ్యూయల్ కాయిల్స్‌ను రీప్లేస్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఇందులో నేరెడ్మెట్ ఆర్కే నగర్‌కు చెందిన శ్రావణ్ (23), కూకట్పల్లి బాలాజీనగర్‌కు చెందిన అమర్ (22) దేహాలు పేలుడు ధాటికి తునాతునకలయ్యాయి. అదే ప్లాంట్‌లో ఉన్న మరో పదమూడుమంది పురు షోత్తం(30), శ్రీకాంత్, మల్లేశ్ (48), రాజేశ్ (25), ప్రకాశ్, డ్రైవర్ రాములు (40), కృష్ణ స్వామి (59), లక్ష్మణ్ (28), ఎం.రాజు (35), ముత్యాలరావు (56), సురేందర్‌రెడ్డి (24), అబ్దుల్ సలీం (59), ఓంప్రకాశ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో సురేందర్‌రెడ్డి 40 శాతానికి పైగా, అబ్దుల్సలీం 36 శాతం, కృష్ణస్వామి 80 శాతం, ముత్యాలరావు 70 శాతం వరకు గాయపడడంతో వీరిని డీఆర్డీవో అపోలోకు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప ఇప్పుడే ఏమీ చెప్పలేమని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇప్పిస్తాం: హోం మంత్రి ఐడీఎల్ కంపెనీలో ప్రమాదం దురదృష్టకరమని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనంతరం మృతుల కుటుం బాలకు న్యాయం చేయాలని యాజమాన్యంతో చర్చలు జరిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇప్పించేందుకు యాజమాన్యాన్ని ఒప్పించామన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కార్మికులకు అండగా నిలిచామని తెలిపారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ఘటనాస్థలిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, గాంధీలు సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. నిశ్చితార్థం జరిగిన 10 రోజులకే... ఈ ఘటనలో మృత్యువాత పడ్డ శ్రావణ్‌కు 10 రోజుల కిందటే వివాహ నిశ్చితార్థం జరిగింది. ఇంట్లో పెళ్లి ఏర్పాట్లలో ఉన్న కుటుంబసభ్యులు, బంధువులు శ్రావణ్ మృతితో ఒక్కసారిగా విషాదంలో మునిగి పోయారు. చేతికందివచ్చిన కొడుకు ప్రమా దంలో మృత్యువాత పడడాన్ని శ్రావణ్ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
ఐడీఎల్లో మరణ మృదంగం
9 ప్రమాదాలు... 40 మంది బలి భద్రతకు తిలోదకాలు జనావాసాల నడుమనే పేలుళ్లు తాజాగా ఇద్దరి మృతి కూకట్పల్లి: ఆ సంస్థ యాజమాన్యానికి లాభాలపై ఉన్న శ్రద్ధ... ప్రజలు... కార్మికుల ప్రాణాలు కాపాడడంపై ఉండడం లేదు. అక్కడ భద్రతా ప్రమాణాల పట్టింపు ఉండదు. ఫలితంగా ఎప్పటికప్పుడు కార్మికుల ప్రాణాల మీదకు వస్తోంది. కూకట్‌పల్లిలోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (పాత ఐడీఎల్)లో ఇప్పటి వరకు 40 మంది కార్మికులు బలయ్యారు. 1968లో ప్రారంభమైన ఈ కంపెనీలో మొదట్లో 3,800 మంది కార్మికులు పని చేసేవారు. ప్రస్తుతం రెండు వందల పైచిలుకు కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. కూకట్పల్లి, మూసాపేట గ్రామాల సర్వే నెంబర్లలోని వెయ్యి ఎకరాల్లో విస్తరించిన ఈ సంస్థ ప్రస్తుతం జనావాసాల మధ్యలో ఉంది. దీనిని తరలించాలనే డిమాండ్ పదిహేనేళ్లుగా వినిపిస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు రెండు పెద్ద ప్రమాదాలు సంభవించాయి. 1976లో జరిగిన భారీ పేలుడులో 11 మంది కార్మికులు చనిపోగా... 2003 నవంబర్‌లో డీఎఫ్-2 ప్లాంట్ పేలుడు ఘటనలో 13 మంది కార్మికులు మరణించారు. 2008లో మరో ప్రమాద సంఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. 2011లో డీఎఫ్-1 ప్లాంట్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇలా గత 45 ఏళ్లలో ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ప్రమాదాలు సంభవించినట్లు కార్మికులు తెలుపుతున్నారు. వీటిలో 40 మంది మృత్యువాత పడ్డారు. అప్పుడప్పుడు జరిగిన ప్రమాదాల్లో కార్మికులు తీవ్ర గాయాలపాలైన సంఘటనలు అనేకం. అక్కడే పేలుడు పరీక్షలు డిటోనేటర్లను తయారు చేయడమే కాకుండా... పేలుతున్నాయా లేదా అనే పరీక్షలు ఇక్కడే చేస్తుంటారు. ఆ పేలుడు సమయంలో భారీ శబ్దంతో సమీపంలోని ఇళ్లు ధ్వంసమైన సంఘటనలు ఎన్నో. పక్కనే ఉన్న కేపీహెచ్‌బీ కాలనీ, ఖైత్లాపూర్, సేవాలాల్‌నగర్ ప్రాంతాల వాసులు ఐడీఎల్ పేలుళ్లతో తమ ఇళ్లకు ముప్పు ఉందని అనేక సార్లు ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. అయినా స్పందించిన వారే లేరు. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కంపెనీ లోపల కారడవిని తలపించే వనం ఉంది. పక్కనే చెరువు కూడా ఉంది. చెరువు అంచున టెస్టింగ్ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఏ పరికరాన్ని ముట్టుకున్నా ప్రమాదకరంగానే ఉంటాయి. దీంతో కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని లోపలికి వెళ్తుంటారు. తిరిగి వచ్చే వరకు భయం.. భయంగా విధులు నిర్వహిస్తున్నారు. గత పదేళ్లలో రెండు వేల మంది కార్మికులు వీఆర్ఎస్ తీసుకొని బయటికి వెళ్లిపోయారు. కార్మికులు తగ్గిపోయినా సంస్థను తరలించడం లేదు. ఆదాయమే మార్గంగా... అనుభవం ఉన్న కార్మికులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో అనుభవం లేని కాంట్రాక్ట్ కార్మికులతో ఐడీఎల్ యాజమాన్యం నెట్టుకుంటూ వస్తోంది. అసలే ప్రమాదకరమైన డిటోనేటర్ల మధ్య నిరంతరం విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అనుభవంతో పాటు భద్రతకూ ప్రాధాన్యమివ్వాలి. వీటిని యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా ఆదాయమే ప్రధాన లక్ష్యంగా ఉందని కార్మికులు వాపోతున్నారు. ప్రమాదాలకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటున్నారు. నాడు కారడవి... నేడు కాంక్రీట్ జంగిల్ భాగ్యనగర్ కాలనీ: ఇండియన్ డిటోనేటర్స్ లిమిటెడ్ (ఐడీఎల్) కంపెనీ 1968లో నగరానికి దూరంగా ఉన్న కూకట్పల్లి, మూసాపేట గ్రామాల మధ్య ఏర్పాటైంది. దీని కోసం స్థానికుల నుంచి వెయ్యి ఎకరాల భూమిని సేకరించారు.భూమికి పరిహారంతో పాటు సంబంధీకులకు ఉద్యోగాలనూ ఇచ్చారు. కాలక్రమంలో చుట్టూ గృహాలు వెలిశాయి. దీంతో ఇది నగరం మధ్యలోకి వచ్చినట్లయింది. ఐడీఎల్ చుట్టూ ఉన్న కేపీహెచ్‌బీ కాలనీలో పేలుళ్ల దాటికి ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఈ పరిశ్రమ ఇలానే కొనసాగితే 15 అంతస్తుల వరకు ఉన్న సైబర్ సిటీ, 35 అంతస్తులు ఉన్న లోధా భవనాలు...ఇతర కట్టడాలకూ ముప్పు తప్పదు. దీన్ని తరలించాలని ప్రజల నుంచి భారీ స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండటంతో... యాజమాన్యానికి కొమ్ముకాస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత నిరసన వ్యక్తమవుతున్నా ఈ ప్రాంతంలోనే కంపెనీ డిటోనేటర్ టెస్టింగ్‌లు కొనసాగుతున్నాయి. దీంతో బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతింటున్నాయి. తాజా ఘటన తోనైనా ప్రభుత్వం స్పందించి.. సంస్థ ను నగరానికి దూరంగా తరలించాలని స్థానికులు మరోసారి కోరుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే: టీడీపీ ఎమ్మెల్యేల ఆరోపణ భాగ్యనగర్ కాలనీ: ఎలాంటి అనుభవం లేని కాంట్రాక్టు కార్మికులతో యాజమాన్యం పని చేయించుకోవడం వల్లనే ఐడీఎల్లో పేలుడు సంభవించిందని టీడీపీ నేతలు ఆరోపించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల వంతున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.