9 ప్రమాదాలు... 40 మంది బలి
భద్రతకు తిలోదకాలు
జనావాసాల నడుమనే పేలుళ్లు
తాజాగా ఇద్దరి మృతి
కూకట్‌పల్లి: ఆ సంస్థ యాజమాన్యానికి లాభాలపై ఉన్న శ్రద్ధ... ప్రజలు... కార్మికుల ప్రాణాలు కాపాడడంపై ఉండడం లేదు. అక్కడ భద్రతా ప్రమాణాల పట్టింపు ఉండదు. ఫలితంగా ఎప్పటికప్పుడు కార్మికుల ప్రాణాల మీదకు వస్తోంది. కూకట్‌పల్లిలోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (పాత ఐడీఎల్)లో ఇప్పటి వరకు 40 మంది కార్మికులు బలయ్యారు. 1968లో ప్రారంభమైన ఈ కంపెనీలో మొదట్లో 3,800 మంది కార్మికులు పని చేసేవారు. ప్రస్తుతం రెండు వందల పైచిలుకు కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. కూకట్‌పల్లి, మూసాపేట గ్రామాల సర్వే నెంబర్‌లలోని వెయ్యి ఎకరాల్లో విస్తరించిన ఈ సంస్థ ప్రస్తుతం జనావాసాల మధ్యలో ఉంది. దీనిని తరలించాలనే డిమాండ్ పదిహేనేళ్లుగా వినిపిస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు రెండు పెద్ద ప్రమాదాలు సంభవించాయి. 1976లో జరిగిన భారీ పేలుడులో 11 మంది కార్మికులు చనిపోగా... 2003 నవంబర్‌లో డీఎఫ్-2 ప్లాంట్ పేలుడు ఘటనలో 13 మంది కార్మికులు మరణించారు. 2008లో మరో ప్రమాద సంఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. 2011లో డీఎఫ్-1 ప్లాంట్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇలా గత 45 ఏళ్లలో ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ప్రమాదాలు సంభవించినట్లు కార్మికులు తెలుపుతున్నారు. వీటిలో 40 మంది మృత్యువాత పడ్డారు. అప్పుడప్పుడు జరిగిన ప్రమాదాల్లో కార్మికులు తీవ్ర గాయాలపాలైన సంఘటనలు అనేకం.
అక్కడే పేలుడు పరీక్షలు
డిటోనేటర్‌లను తయారు చేయడమే కాకుండా... పేలుతున్నాయా లేదా అనే పరీక్షలు ఇక్కడే చేస్తుంటారు. ఆ పేలుడు సమయంలో భారీ శబ్దంతో సమీపంలోని ఇళ్లు ధ్వంసమైన సంఘటనలు ఎన్నో. పక్కనే ఉన్న కేపీహెచ్‌బీ కాలనీ, ఖైత్లాపూర్, సేవాలాల్‌నగర్ ప్రాంతాల వాసులు ఐడీఎల్ పేలుళ్లతో తమ ఇళ్లకు ముప్పు ఉందని అనేక సార్లు ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లారు. అయినా స్పందించిన వారే లేరు. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కంపెనీ లోపల కారడవిని తలపించే వనం ఉంది. పక్కనే చెరువు కూడా ఉంది. చెరువు అంచున టెస్టింగ్ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఏ పరికరాన్ని ముట్టుకున్నా ప్రమాదకరంగానే ఉంటాయి. దీంతో కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని లోపలికి వెళ్తుంటారు. తిరిగి వచ్చే వరకు భయం.. భయంగా విధులు నిర్వహిస్తున్నారు. గత పదేళ్లలో రెండు వేల మంది కార్మికులు వీఆర్‌ఎస్ తీసుకొని బయటికి వెళ్లిపోయారు. కార్మికులు తగ్గిపోయినా సంస్థను తరలించడం లేదు.
ఆదాయమే మార్గంగా...
అనుభవం ఉన్న కార్మికులకు ఎక్కువ మొత్తంలో వేతనాలు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో అనుభవం లేని కాంట్రాక్ట్ కార్మికులతో ఐడీఎల్ యాజమాన్యం నెట్టుకుంటూ వస్తోంది. అసలే ప్రమాదకరమైన డిటోనేటర్ల మధ్య నిరంతరం విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అనుభవంతో పాటు భద్రతకూ ప్రాధాన్యమివ్వాలి. వీటిని యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా ఆదాయమే ప్రధాన లక్ష్యంగా ఉందని కార్మికులు వాపోతున్నారు. ప్రమాదాలకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటున్నారు.
నాడు కారడవి... నేడు కాంక్రీట్ జంగిల్
భాగ్యనగర్ కాలనీ: ఇండియన్ డిటోనేటర్స్ లిమిటెడ్ (ఐడీఎల్) కంపెనీ 1968లో నగరానికి దూరంగా ఉన్న కూకట్‌పల్లి, మూసాపేట గ్రామాల మధ్య ఏర్పాటైంది. దీని కోసం స్థానికుల నుంచి వెయ్యి ఎకరాల భూమిని సేకరించారు.భూమికి పరిహారంతో పాటు సంబంధీకులకు ఉద్యోగాలనూ ఇచ్చారు. కాలక్రమంలో చుట్టూ గృహాలు వెలిశాయి. దీంతో ఇది నగరం మధ్యలోకి వచ్చినట్లయింది. ఐడీఎల్ చుట్టూ ఉన్న కేపీహెచ్‌బీ కాలనీలో పేలుళ్ల దాటికి ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఈ పరిశ్రమ ఇలానే కొనసాగితే 15 అంతస్తుల వరకు ఉన్న సైబర్ సిటీ, 35 అంతస్తులు ఉన్న లోధా భవనాలు...ఇతర కట్టడాలకూ ముప్పు తప్పదు. దీన్ని తరలించాలని ప్రజల నుంచి భారీ స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండటంతో... యాజమాన్యానికి కొమ్ముకాస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత నిరసన వ్యక్తమవుతున్నా ఈ ప్రాంతంలోనే కంపెనీ డిటోనేటర్ టెస్టింగ్‌లు కొనసాగుతున్నాయి. దీంతో బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతింటున్నాయి. తాజా ఘటన తోనైనా ప్రభుత్వం స్పందించి.. సంస్థ ను నగరానికి దూరంగా తరలించాలని స్థానికులు మరోసారి కోరుతున్నారు.
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే: టీడీపీ ఎమ్మెల్యేల ఆరోపణ
భాగ్యనగర్ కాలనీ: ఎలాంటి అనుభవం లేని కాంట్రాక్టు కార్మికులతో యాజమాన్యం పని చేయించుకోవడం వల్లనే ఐడీఎల్‌లో పేలుడు సంభవించిందని టీడీపీ నేతలు ఆరోపించారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల వంతున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఐడీఎల్‌లో మరణ మృదంగం
Published Tue, Feb 24 2015 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement