జగన్ భూములే అయితే జనానికి పంచరేం? | KFEZ government lands TDP leader focused | Sakshi
Sakshi News home page

జగన్ భూములే అయితే జనానికి పంచరేం?

Published Fri, Jul 10 2015 2:02 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM

జగన్ భూములే అయితే జనానికి పంచరేం? - Sakshi

జగన్ భూములే అయితే జనానికి పంచరేం?

- మంత్రి యనమల మౌనంలో ఆంతర్యమేమిటి?
- కేఎస్‌ఈజెడ్ ప్రభుత్వ భూములపై ‘దేశం’ నేతల కన్ను
- అడ్డుకోవడానికి న్యాయ పోరాటం సాగిస్తాం
- వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జ్యోతుల
తుని :
కాకినాడ సెజ్ భూములన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డివని గతంలో ప్రచారం చేసిన రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ భూములను రైతులకు పంచకుండా మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. ఆయన గురువారం తొండంగి మండలం పెరుమాళ్లపురంలో విలేకరులతో మాట్లాడారు. ఆ భూములు తనవే అయితే వెంటనే రైతులకు పంచాలని ఇటీవల జగన్ డిమాండ్ చేసినా యనమల స్పందించక పోవడం వెనుక రహస్యాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు.  

కాకినాడ సెజ్ భూములను కారు చౌకగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వంకార్పోరేట్ సంస్థ అయిన జీఎంఆర్‌కు ధారాదత్తం చేసిందని విమర్శించారు. పట్టిసీమలో ఎకరానికి రూ.23 లక్షల పరిహారం ఇచ్చారని, ఇక్కడ రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని, లేకపోతే పట్టిసీమ లాగే ఇక్కడా రూ.23 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెజ్ భూములకు సమీపంలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూములను రహస్య ఒప్పందం ప్రకారం టీడీపీ నేతలు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పూర్తి ఆధారాలు సేకరించామని, దీనిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధికి  తాము  సహకరిస్తామన్నారు.

అయితే ఇక్కడ జరిగేది పచ్చ చొక్కాల నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్న అధికారుల అండదండలతో సాగుతున్న అవినీతిపై పోరాటం మాత్రమే అన్నారు. పెట్రో కారిడార్ వల్ల ఈ ప్రాంతం కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం తక్కువ ఓట్ల శాతంతో గద్దెనెక్కిన టీడీపీ నాయకులు జీవితాంతం అధికారంలో ఉంటామనుకుంటే సాధ్యం కాదన్నారు. ఏది ఏమైనా సెజ్ రైతులకు న్యాయం జరిగే వరకు అహర్నిశలు పోరాటం సాగిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement