Jyotula Nehru
-
‘ కాల్‌మనీ’పై సర్కారును నిలదీద్దాం
సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని పార్టీ ఎమ్మెల్యేలకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడాలని చెప్పారు. వారికి బాసటగా నిలిచి సర్కారుపై ఒత్తిడి తేవాలని సూచించారు. వడ్డీ వ్యాపారం పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేయడమే కాక, వారిని శారీరకంగా లోబర్చుకోవడం అమానుషం, అమానవీయం అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా విజయవాడ నగరంలో జరిగిన కాల్‌మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నా ప్రభుత్వం వారిని తప్పించాలని చూడటం దారుణమన్నారు. దీనిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. వడ్డీ వ్యాపారం అనేది ఒక ఎత్తై అది సెక్స్ రాకెట్‌గా రూపాంతరం చెందడం దుర్మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల జీవితాలతో చెలగాటమాడుతూ వారి ధన, మాన ప్రాణాలకు భద్రత లేకుండా చేసిన వారిని చంద్రబాబునాయుడు ప్రభుత్వం తప్పించాలని చూడటం సహించరాని విషయమన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం సమావేశానికి జగన్ అధ్యక్షత వహించారు. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు హాజరైన ఈ సమావేశంలో గంటన్నరకు పైగా అనేక అంశాలను చర్చించారు. రాష్ట్రంలో ప్రజలను ఇబ్బడి ముబ్బడిగా సమస్యలు చుట్టుముట్టి ఉన్నా వాటిని చర్చించడానికి వీల్లేని విధంగా అసెంబ్లీ సమావేశాలను కొద్ది రోజులే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండటంపై సమావేశంలో అసంతృప్తి వ్యక్తమైంది. సెక్స్ రాకెట్‌తో పాటుగా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా శాసనసభలో గళమెత్తాలని జగన్ సూచించారు. ఎమ్మెల్యేలంతా ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పూర్తి అవగాహనతో అసెంబ్లీకి రావాలన్నారు. ప్రజాపక్షంగా పోరాటం: అసెంబ్లీలో ప్రజాపక్షంగా అనేక సమస్యలను లేవనెత్తుతామని వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. సమావేశానంతరం ఆయన మాట్లాడుతూ... మహిళలను అభాసుపాలు చేసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్, గిరిజనుల అభీష్టానికి భిన్నంగా మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు పూనుకోవడం, పేదల ప్రాణాలను తీస్తున్న కల్తీ మద్యం, ప్రజలను కొల్లగొడుతున్న ఇసుక మాఫియా వంటి అంశాలన్నింటినీ ప్రస్తావిస్తామని చెప్పారు. కరువు, వరద సహాయం సరిగ్గా జరక్కపోవడం, కనీస మద్దతు ధర లభించక పోవడం, నిత్యావసర ధరలపై నియంత్రణ లేక పోవడం వంటి సమస్యలపై నిలదీస్తామని తెలిపారు. నిరుద్యోగులు, అంగన్వాడీలు, వీఆర్ఏలు, ఆశావర్కర్ల సమస్యల పరిష్కారంకోసం గళమెత్తుతామని తెలిపారు. విధి విధానాలకు లోబడి ప్రధానమైన సమస్యలు చర్చించి పరిష్కారం అయ్యేలా శాసనసభ స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిపక్షంగా తాము సహకరిస్తామని, అధికార పక్షం ఎదురుదాడి పద్ధతిమాని అన్ని సమస్యలపైనా చర్చకు సిద్ధం కావాలని సూచించారు. శాసనసభా కార్యక్రమాల సలహా మండలి సమావేశం జరక్కుండానే సభ నాలుగైదు రోజులే జరుగుతుందని మంత్రులు చెప్పడాన్ని ఆక్షేపించారు. శాసనమండలిలో కూడా కాల్‌మనీ సెక్స్ రాకెట్, కల్తీ మద్యం, రంగు మారిన ధాన్యం కొనుగోలు వంటి అంశాలనే చర్చకు ప్రస్తావిస్తామని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. శాసనసభాపక్షం సమావేశంలో ఉపనేత ఉప్పులేటి కల్పన, శాసనసమండలిలో వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ముఖ్య నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
బాబూ... జైట్లీ వ్యాఖ్యలపై నీ స్పందనేమిటి?
♦ వైఎస్సార్సీపీ శాసనసభ పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ ♦ అసలు హోదా అవసరం అనుకుంటున్నారా? లేదా? సాక్షి, హైదరాబాద్: ప్రత్యేకహోదా శకం ముగిసిందన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై తన వైఖరేమిటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష ఉప నాయకుడు జోత్యుల నెహ్రూ డిమాండ్ చేశారు. అరుణ్‌జెట్లీ వ్యాఖ్యలు చూస్తుంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని చెప్పకనే చెప్పినట్టు కనిపిస్తోందన్నారు. ఆ వ్యాఖ్యలపై సీఎం స్పందించకపోవడాన్ని త ప్పుబట్టారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అస లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నారో లేదో సీఎం స్పష్టంచేయాలి. అవసరమని చెబితే ఎప్పటిలోగా సాధించగలరో ప్రజలకు తేల్చి చెప్పాలి. కేంద్ర మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన ఈ అంశంపై నీతి అయోగ్ కమిటీ చర్చిస్తుందం టూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం మంచిది కాదు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే 8 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోకపోవడం దారుణం’’ అని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏమీ కనిపించడం లేదని ఆయన విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే సీమకు మంచినీళ్లిచ్చేవారు రాష్ట్రం కరువు మండలాలను ప్రకటించడం తప్ప కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం పూర్తిగా చేతులెస్తేంద ని నెహ్రూ దుయ్యబట్టారు. ఆరు నెలల్లో పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాకు సాగునీరు, రాయలసీమకు తాగు నీరు ఇస్తామన్న ముఖ్యమంత్రి, మంత్రులు మాటలు నమ్మి కృష్ణా డెల్టా రైతులు పంటలు వేసుకుంటే పది పది హేను రోజులకు ఒక తడి అందక పంటలు ఎం డుతున్నాయని చెప్పారు. రాయలసీమకు తా గునీరు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంటే.. కనీసం మోటార్లు పెట్టయినా నీటిని పోతిరెడ్డి పాడు కాల్వల్లోకి తోడిపోసి ఆ ప్రాంత తాగునీటి అవసరాలను తీర్చగలిగేదని ఆయన విమర్శించారు. -
భక్తులను రోడ్ల పాల్జేసిన సర్కారు
ఆల్కాట్‌తోట(రాజమండ్రి) : పుష్కర యాత్రికులకు సరైన సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వం వారిని రోడ్లపాల్జేసిందని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. స్థానిక ద్వార క లాడ్జి సమీపంలోనూ, ఆర్యాపురంలోనూ డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా ప్రారంభించారు. అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పుష్కర ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరిచి భక్తులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రోజా మాట్లాడుతూ పుష్కర భక్తులకు డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ,మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కూడా పాల్గొన్నారు. పుష్కర భక్తులకు రవాణా సదుపాయం కల్పించండి : ఎమ్మెల్సీ బోస్ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పుష్కర భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యం కల్పించాలని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆర్యాపురంలోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిన్నపిల్లలకు పాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రారంభించారు. అనంతరం పుష్కర భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమా ల్లో రాష్ట్ర కార్యదర్శి కర్రిపాపారాయుడు, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యద ర్శి మంచాల బాబ్జి, దొండపాటి సత్యం బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇసుకపల్లి శ్రీనివాస్, ఇన్నీసుపేట కో-ఆపరేటివ్ బ్యాంకు డెరైక్టర్ ఆదిరెడ్డి శ్రీనివాసరావు, రాజమండ్రి నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్, జిల్లా అధికారప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు బొంతాశ్రీహరి, మజ్జి నూకరత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి మానేదొరబాబు, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి డాక్టర్ లంకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ భూములే అయితే జనానికి పంచరేం?
- మంత్రి యనమల మౌనంలో ఆంతర్యమేమిటి? - కేఎస్ఈజెడ్ ప్రభుత్వ భూములపై ‘దేశం’ నేతల కన్ను - అడ్డుకోవడానికి న్యాయ పోరాటం సాగిస్తాం - వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జ్యోతుల తుని : కాకినాడ సెజ్ భూములన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డివని గతంలో ప్రచారం చేసిన రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ భూములను రైతులకు పంచకుండా మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. ఆయన గురువారం తొండంగి మండలం పెరుమాళ్లపురంలో విలేకరులతో మాట్లాడారు. ఆ భూములు తనవే అయితే వెంటనే రైతులకు పంచాలని ఇటీవల జగన్ డిమాండ్ చేసినా యనమల స్పందించక పోవడం వెనుక రహస్యాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాకినాడ సెజ్ భూములను కారు చౌకగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వంకార్పోరేట్ సంస్థ అయిన జీఎంఆర్‌కు ధారాదత్తం చేసిందని విమర్శించారు. పట్టిసీమలో ఎకరానికి రూ.23 లక్షల పరిహారం ఇచ్చారని, ఇక్కడ రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని, లేకపోతే పట్టిసీమ లాగే ఇక్కడా రూ.23 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెజ్ భూములకు సమీపంలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూములను రహస్య ఒప్పందం ప్రకారం టీడీపీ నేతలు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పూర్తి ఆధారాలు సేకరించామని, దీనిపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధికి తాము సహకరిస్తామన్నారు. అయితే ఇక్కడ జరిగేది పచ్చ చొక్కాల నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్న అధికారుల అండదండలతో సాగుతున్న అవినీతిపై పోరాటం మాత్రమే అన్నారు. పెట్రో కారిడార్ వల్ల ఈ ప్రాంతం కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం తక్కువ ఓట్ల శాతంతో గద్దెనెక్కిన టీడీపీ నాయకులు జీవితాంతం అధికారంలో ఉంటామనుకుంటే సాధ్యం కాదన్నారు. ఏది ఏమైనా సెజ్ రైతులకు న్యాయం జరిగే వరకు అహర్నిశలు పోరాటం సాగిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.