‘ కాల్‌మనీ’పై సర్కారును నిలదీద్దాం | Will rise on the Call money | Sakshi
Sakshi News home page

‘ కాల్‌మనీ’పై సర్కారును నిలదీద్దాం

Published Thu, Dec 17 2015 2:59 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

‘ కాల్‌మనీ’పై సర్కారును నిలదీద్దాం - Sakshi

‘ కాల్‌మనీ’పై సర్కారును నిలదీద్దాం

సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని పార్టీ ఎమ్మెల్యేలకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడాలని చెప్పారు. వారికి బాసటగా నిలిచి సర్కారుపై ఒత్తిడి తేవాలని సూచించారు. వడ్డీ వ్యాపారం పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేయడమే కాక, వారిని శారీరకంగా లోబర్చుకోవడం అమానుషం, అమానవీయం అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా విజయవాడ నగరంలో జరిగిన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నా ప్రభుత్వం వారిని తప్పించాలని చూడటం దారుణమన్నారు. దీనిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

వడ్డీ వ్యాపారం అనేది ఒక ఎత్తై అది సెక్స్ రాకెట్‌గా రూపాంతరం చెందడం దుర్మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల జీవితాలతో చెలగాటమాడుతూ వారి ధన, మాన ప్రాణాలకు భద్రత లేకుండా చేసిన వారిని చంద్రబాబునాయుడు ప్రభుత్వం తప్పించాలని చూడటం సహించరాని విషయమన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం సమావేశానికి జగన్ అధ్యక్షత వహించారు. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు హాజరైన ఈ సమావేశంలో గంటన్నరకు పైగా అనేక అంశాలను చర్చించారు. రాష్ట్రంలో ప్రజలను ఇబ్బడి ముబ్బడిగా సమస్యలు చుట్టుముట్టి ఉన్నా వాటిని చర్చించడానికి వీల్లేని విధంగా అసెంబ్లీ సమావేశాలను కొద్ది రోజులే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండటంపై సమావేశంలో అసంతృప్తి వ్యక్తమైంది. సెక్స్ రాకెట్‌తో పాటుగా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా శాసనసభలో గళమెత్తాలని జగన్ సూచించారు. ఎమ్మెల్యేలంతా ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పూర్తి అవగాహనతో అసెంబ్లీకి రావాలన్నారు.

 ప్రజాపక్షంగా పోరాటం: అసెంబ్లీలో ప్రజాపక్షంగా అనేక సమస్యలను లేవనెత్తుతామని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. సమావేశానంతరం ఆయన మాట్లాడుతూ... మహిళలను అభాసుపాలు చేసిన కాల్‌మనీ సెక్స్ రాకెట్, గిరిజనుల అభీష్టానికి భిన్నంగా మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు పూనుకోవడం, పేదల ప్రాణాలను తీస్తున్న కల్తీ మద్యం, ప్రజలను కొల్లగొడుతున్న ఇసుక మాఫియా వంటి అంశాలన్నింటినీ ప్రస్తావిస్తామని చెప్పారు. కరువు, వరద సహాయం సరిగ్గా జరక్కపోవడం, కనీస మద్దతు ధర లభించక పోవడం, నిత్యావసర ధరలపై నియంత్రణ లేక పోవడం వంటి సమస్యలపై నిలదీస్తామని తెలిపారు.

నిరుద్యోగులు, అంగన్‌వాడీలు, వీఆర్‌ఏలు, ఆశావర్కర్ల సమస్యల పరిష్కారంకోసం గళమెత్తుతామని తెలిపారు. విధి విధానాలకు లోబడి ప్రధానమైన సమస్యలు చర్చించి పరిష్కారం అయ్యేలా శాసనసభ స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిపక్షంగా తాము సహకరిస్తామని, అధికార పక్షం ఎదురుదాడి పద్ధతిమాని అన్ని సమస్యలపైనా చర్చకు సిద్ధం కావాలని సూచించారు. శాసనసభా కార్యక్రమాల సలహా మండలి సమావేశం జరక్కుండానే సభ నాలుగైదు రోజులే జరుగుతుందని మంత్రులు చెప్పడాన్ని ఆక్షేపించారు.

శాసనమండలిలో కూడా కాల్‌మనీ సెక్స్ రాకెట్, కల్తీ మద్యం, రంగు మారిన ధాన్యం కొనుగోలు వంటి అంశాలనే చర్చకు ప్రస్తావిస్తామని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. శాసనసభాపక్షం సమావేశంలో ఉపనేత ఉప్పులేటి కల్పన, శాసనసమండలిలో వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ముఖ్య నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement