జన్మ ధన్యమయింది:నరేంద్ర మోడీ | don't concern about sez,says narendra modi | Sakshi
Sakshi News home page

జన్మ ధన్యమయింది:నరేంద్ర మోడీ

Published Sat, Aug 16 2014 10:56 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

జన్మ ధన్యమయింది:నరేంద్ర మోడీ - Sakshi

జన్మ ధన్యమయింది:నరేంద్ర మోడీ

రాయ్‌గఢ్ పర్యటనపై ప్రధాని నరేంద్ర మోడీ

చారిత్రక ప్రాధాన్యమున్న రాయగఢ్ ప్రాంతాన్ని సందర్శించడంతో తన జన్మ ధన్యమయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. నవశేవాలో సెజ్‌కు శనివారం భూమిపూజ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు. నౌకాశ్రయాల అనుసంధానానికి రూ.1,926 కోట్లతో నిర్మించనున్న  ప్రాజెక్టుకు కూడా భూమిపూజ నిర్వహించారు. షోలాపూర్‌లోనూ పవర్ గ్రిడ్‌ను ఆవిష్కరించారు.
 
సాక్షి, ముంబై: ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత మహారాష్ట్రలో తొలిసారిగా రాయగఢ్‌కు రావడంతో తన జన్మ ధన్యమయిందని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న రాయగఢ్ ప్రాచీన హిందూ నగర రాజధాని అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా రాయగఢ్ నవశేవాలో రూ.నాలుగు వేల కోట్ల అంచనావ్యయంతో నిర్మించబోయే ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)కి శనివారం భూమిపూజ చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. నవశేవాలోని ‘జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్’ (జేఎన్‌పీటీ) సమీపంలో దీనిని నిర్మిస్తారు.
 
బీజేపీ పాలనలో భూమిపుత్రులకు (అన్నదాతలు) అమిత ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై’ అన్న నినాదంతో తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన నరేంద్ర మోడీ చివర్లోనూ ఇదే నినాదం చేసి రాయగఢ్ ప్రజల మనసులను గెలుచుకున్నారు. అదేవిధంగా నౌకాశ్రయాల అనుసంధానం కోసం రూ. 1,926 కోట్లతో నిర్మించనున్న రహదారి ప్రాజెక్టుకు కూడా మోడీ భూమిపూజ నిర్వహించారు. భూమిపుత్రులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
 
ప్రజలందరికీ విద్య,ఆరోగ్యంతోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాయగఢ్ పర్యటనతో తన జన్మ ధన్యమయిందని వ్యాఖ్యానించినప్పుడు చప్పట్లు మార్మోగాయి. ఈ సెజ్ కారణంగా నష్టపోయిన రైతులకు ఈ సందర్భంగా మోడీ చేతుల మీదుగా భూములు పంపిణీ చేశారు. విలాస్ జోషి, బాలకృష్ణ ధరణే, మధుకర్, ఠాకూర్, కమలాకర్ ధరణే తదితరులకు భూమి పత్రాలు అందజేశారు.  
 
ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉంది...
మనదేశానికి దిగుమతులకంటే ఎగుమతుల అవసరం అధికంగా ఉందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. యువశక్తితో ఎగుమతులను వృద్ధి చేయవచ్చన్నారు. ‘ఓడరేవులు దేశానికి ప్రవేశద్వారాలుగా మారాలి. ఎగుమతుల విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడాలి. ఇలా జరిగితే మన జాతి పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. ప్రపంచమార్కెట్ లో మనదేశంసుస్థిరస్థానాన్ని సాధించగలుగుతుం ది. అంతర్జాతీయ విపణిలో సముద్రవాణిజ్యం అత్యంత కీలకం. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం కం టెయినర్లు హిందూ మహాసముద్రం మీదుగా వెళ్తున్నాయి. భవిష్యత్‌లో సముద్ర వాణిజ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని వివరించారు. అందుకే రేవు పట్టణాల్లో ‘సాగర్‌మాల’ పథకాలను ప్రారంభిస్తామని ప్రధాని ప్రకటించారు. వీటి వల్ల తీర ప్రాంతాలు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
 
చవాన్.. ఆందోళన చెందకు

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 146 సెజ్‌ల గురించి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి ముందుకు కదలడం లేదని అన్నారు. దీనిపై నరేంద్ర మోడీ స్పందిస్తూ సెజ్‌ల పురోగతిపై ముఖ్యమంత్రి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందన్నారు.  ‘రోగులను బాగుచేసేందుకు మంచి డాక్టర్ అవసరం. అలాంటి డాక్టర్ లభించారు.  మహారాష్ట్రతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని సమస్యలను మా ప్రభుత్వం పరిష్కరిస్తుంది’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్ కె.శంకర్‌నారాయణ, ప్రతిపక్ష నాయకులు ఏక్‌నాథ్ ఖడ్సే, వినోద్ తావ్డేతోపాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
 
నిరంతర విద్యుత్ అందిస్తాం
షోలాపూర్, న్యూస్‌లైన్: దేశవ్యాప్తంగా పుష్కలంగా విద్యుత్‌ను అందించడమే తమ ప్రభుత్వ   సంకల్పమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మారుమూల గ్రామాలకు సైతం 365 రోజులు విద్యుత్‌ను అందించడమే తమ లక్ష్యమన్నారు. షోలాపూర్‌కు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు చేరుకున్న నరేంద్ర మోడి హోం మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. షోలాపూర్-పుణే నాలుగు లైన్ల రహదారి, పవర్‌గ్రిడ్‌నును జాతికి అంకితం చేశారు. అలాగే షోలాపూర్-సంగారెడ్డి, షోలాపూర్-ఎడిషి వరకు నిర్మించబోయే నాలుగులైన్ల రహదారులకు శంకుస్థాపన చేశారు.
 
గవర్నర్ కె. శంకర్‌నారాయణన్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, నితిన్ గడ్కరీ, ఎంపీ రవీంద్ర గైక్వాడ్, వినోద్ తావ్డే, దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే జపాన్ రాయబార కార్యాలయ అధికారులు, విద్యుత్‌శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘బీఎస్పీ.. బిజ్లీ(కరెంటు), సడక్ (రోడ్లు), పానీ (నీరు)కి తమ ప్రభుత్వం అత్యధికం ప్రాధాన్యం ఇస్తుంది. కరెంటు  24 గంటలు రైతులకు అందుబాటులో ఉంటేనే మంచి దిగుబడి సాధిస్తాడు. సువిశాల రహదాలు ఉంటేనే ధాన్యాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్మవచ్చు. మనదేశంలో వర్షాలకు కొదవ లేదు. ఆ నీటిని నిల్వ చేసుకోవాలి. ఈ మూడూ సక్రమంగా ఉంటే రైతులు దేశంలో బంగారం పండిస్తారు. షోలాపూర్ పవర్‌గ్రిడ్ ద్వారా దేశంలోని నలుమూలలకూ విద్యుత్ సరఫరా చేయవచ్చు’ అని మోడీ అన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు సరిపడా బొగ్గు, గ్యాస్‌ను సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి చవాన్ విజ్ఞప్తికి మోడీ సానుకూలంగా స్పందించారు.
 
దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్స్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, మరమగ్గాలు అధికంగా ఉన్న షోలాపూర్ వంటి పట్టణాలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ నాలుగులైన్ల రహదారులు, విద్యుత్ ఉత్పత్తికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రకటించారు. ఇదిలా ఉంటే చవాన్ ప్రసంగం ప్రారంభించగానే.. జనం ‘వద్దు వద్దు’ అంటూ నినాదాలు చేయగా, మోడీ వారించారు. దీంతో కేవలం ఐదు నిముషాల్లో చవాన్ ప్రసంగం ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement