ఇంటి నుంచే ఉద్యోగ బాధ్యతలు!
అందరికీ కాదు.. కొందరికే..
న్యూఢిల్లీ: ఉద్యోగం ఆఫీసుకు వెళ్లి చేయాలి. ఇప్పుడు ఇలాంటిదేమీ లేకుండా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేయొచ్చు. ఈ సౌకర్యం అందరికీ కాదండోయ్.. కేవలం ఐటీ, ఐటీఈఎస్ సెజ్ (ప్రత్యేక ఆర్థిక మండళ్లు) యూనిట్ల ఎంప్లాయిస్‌కు మాత్రమే. వీరు ఇంటి వద్ద నుంచైనా, మరేఇతర ప్రదేశం నుంచైనా ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐటీ, ఐటీఈఎస్ సెజ్ యూనిట్లలోని ఉద్యోగులు.. ఇంటి నుంచి, సెజ్ వెలుపలి ప్రాంతం నుంచి వారి ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలను నిర్వహించవచ్చా? లేదా?
అనే అంశంపై స్పష్టతనివ్వాలని పరిశ్రమ సంబంధిత ప్రతి నిధులు, ఇన్వెస్టర్లు మంత్రిత్వ శాఖను కోరారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ పలు నిబంధనలతో సెజ్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయొచ్చని తె లిపింది. ‘ఉద్యోగి సెజ్ వెలుపల నుంచి బాధ్యతలు నిర్వర్తించాలనుకుంటే.. అతను రెగ్యులర్ ఎంప్లాయి అయ్యిండాలి. బయట నిర్వర్తించే బాధ్యతలు సెజ్ యూనిట్ సర్వీసులకు లోబడి ఉండాలి. ఆ బాధ్యతలు సెజ్ ప్రాజెక్టులకు సంబంధించినవి కావాలి’ వంటి తదితర నిబంధనలు మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. అలాగే ఉద్యోగి ఇంటి వద్ద నుంచి పనిచేయడానికి వీలుగా అతనికి ల్యాప్‌టాప్/కంప్యూటర్ వంటి కనెక్టివిటీ సౌకర్యాలను కల్పించాలని పేర్కొంది.