న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎగుమతులకే పరిమితమవుతున్న ప్రత్యేక ఆర్థిక మండళ్లను (సెజ్) సమగ్ర ఆర్థిక హబ్‌లుగా తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ఆర్థిక మండళ్లలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు నిబంధనలను సడలించడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం తదితర చర్యలు తీసుకునే యోచనలో ఉంది. అలాగే సెజ్‌లలోని యూనిట్లు దేశీయంగా కూడా విక్రయించుకునేందుకు అనుమతించాలని యోచిస్తోంది.
ఈ క్రమంలో రూపొందించిన ముసాయిదా చర్చా పత్రం ప్రకారం హబ్‌లను డెవలప్‌మెంట్ ఎంటర్‌ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్‌లు (దేశ్)గా వ్యవహరించనున్నారు. వాటిల్లోని సంస్థలు దేశీయంగా విక్రయించుకోవడంతో పాటు జోన్‌కు వెలుపలి సంస్థల కోసం కాంట్రాక్టు తయారీ కార్యకలాపాలు కూడా చేపట్టేందుకు అనుమతించనున్నారు. కొంత మేర ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు, వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే చర్యలు కూడా తీసుకోనున్నారు.
సంయుక్తంగా ఏర్పాటు..
ఇలాంటి హబ్‌లను కేంద్రం, రాష్ట్రం విడివిడిగా లేదా కలిసి నెలకొల్పవచ్చు. తయారీ లేదా సర్వీసు కార్యకలాపాల కోసం లేదా ఈ రెండింటి కోసం వ్యక్తులు కూడా ఏర్పాటు చేయవచ్చు. సెజ్‌ల వెలు పలి సంస్థలతో సమానంగా పన్ను భారం వర్తించే లా హబ్‌లలోని యూనిట్లు దేశీయంగా జరిపే విక్ర యాలపై ఈక్వలైజేషన్ లెవీ విధించే అవకాశం ఉంది. పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల తర్వాత రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలను కూడా అభివృద్ధిలో భాగం చేసే ఉద్దేశంతో సెజ్ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తేనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment