ఎస్‌ఈజెడ్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా?
-
ఎమ్మెల్యే వర్మకు దొరబాబు సవాల్
గొల్లప్రోలు :
ఎస్‌ఈజెడ్‌పై పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ చేస్తున్న అసత్యప్రచారాలు మానుకోవాలని, ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమాని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు సవాల్ విసిరారు. గొల్లప్రోలులో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్‌ఈజెడ్‌పై ఎమ్మెల్యే చేసిన ప్రకటనలపై ఖండించారు. ఎస్‌ఈజెడ్‌పై ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించేందుకు నియోజకవర్గంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు. ఎస్‌ఈజెడ్ భూములు పార్టీ అధినేత జగన్ మోహ¯Œæరెడ్డికి చెందినవని, ఎస్‌ఈజెడ్‌ను దివంగత సీఎం వైఎస్ ఏర్పాటు చేశారంటూ ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఎస్‌ఈజెడ్ ఏర్పాటుకు జీఓను చంద్రబాబు జారీ చేశారని, ఈ భూములన్నీ చంద్రబాబు బినామీల పేరిట ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాంతంలో ఏరువాక చేపట్టిన చంద్రబాబు.. ఎస్‌ఈజెడ్‌కు సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ మాటను విస్మరించారని విమర్శించారు.
మంత్రి యనమల, ఎమ్మెల్యే కలసి తొండంగి మండలంలో దివీస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూసేకరణ చేపట్టి రైతులను, కోన గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రైతులు భూములను లాక్కోవడం, చెరువుల్లో మట్టి అమ్ముకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అక్కర్లేదని, ప్యాకేజీ ముఖ్యమని రాష్ట్ర ప్రజల మనోభాలను దెబ్బతీశారన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కురుమళ్ల రాంబాబు, పట్టణ కన్వీనర్ పర్ల రాజా, పిఠాపురం మున్సిపాలిటీ ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబీ, గొల్లప్రోలు నగర పంచాయతీ ఫ్లోర్‌లీడర్ తెడ్లపు చిన్నారావు, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మొగలి అయ్యారావు, మాజీ సర్పంచ్ చిన్నారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.