
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గురువారం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో భేటీ అయ్యారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో నెలకొన్న స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఎస్ఈజెడ్)లో దాదాపు 40 కంపెనీలు పర్యావరణ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ కాలుష్యం సృష్టిస్తున్నాయంటూ ఆయన ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. ఎస్ఈజెడ్‌లో దాదాపు 40 కంపెనీలు పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టవలసిన మురుగు నీటిని శుద్ధి చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయనందున అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని అనేక గ్రామాల్లో తాగు నీరు కలుషితంగా మారిపోయిందన్నారు. శుద్ధి చేయని కాలుష్య జలాలను ఆయా కంపెనీలు సముద్రంలోకి విడుదల చేస్తున్నందున సముద్ర జలాలు కూడా కలుషితమై మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఎస్ఈజెడ్‌లోని కంపెనీల కారణంగా భూగర్భ జలాలు, సముద్ర జలాలు కూడా కలుషితమైపోతూ రైతులు, మత్స్యకారులకు ఎనలేని నష్టాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ సమస్యపై ఎస్ఈజెడ్ పరిసర బాధిత గ్రామాల ప్రజలు అనేకమార్లు ఆందోళనలు చేపట్టారని, తమ గోడు పట్టించుకోవాలంటూ పలుమార్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను కలిసినా సమస్య పరిష్కారం కాలేదని విజయసాయి రెడ్డి తెలిపారు. కాబట్టి తక్షణమే దీనిపై స్పందించి ఎస్ఈజెడ్‌లో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుని బాధిత గ్రామాల ప్రజలను జల కాలుష్యం బారి నుంచి కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రులు నిర్మలా సీతామన్, హర్ష వర్దన్, ఎస్సీ కమిషన్ చైర్మన్ రాం శంకర్ కఠారియాను ఎంపి విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్నాధ్ బృందం కలిశారు. విశాఖలోని సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ విశాఖ అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌లో వ్యర్ధాల శుద్ది కేంద్రం ఏర్పాటు చేయాలని హర్షవర్ధన్‌కి విజ్ఞప్తి చేశారు. సముద్రంలోకి వదులుతున్న వ్యర్థాల వల్ల మత్స్య సంపద నాశనమవుతోందన్నారు. అలాగే నావల్ బేస్ నిర్మాణం కోసం ఆరుగ్రామాలు ఖాళీ చేయించారని, రాంబిల్ నిర్వాసితులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని రక్షణ శాఖ మంత్రిని కోరారు. దీంతోపాటు ఎస్సీ మహిళను వివస్త్రను చేసిన ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment