Union Minister harshavardan
-
Harsh Vardhan: దేశంలో 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సంక్రమణ, కొత్తగా భయాందోళనలకు కారణమైన బ్లాక్ ఫంగస్ తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సోమవారం మంత్రుల బృందం (జీఓఎం) 27వ సమావేశం నిర్వహించారు. దేశంలో బ్లాక్ల్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) వ్యాప్తిపై ఈ భేటీలో చర్చ జరిగింది. దేశంలో ఇప్పటివరకు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 5,424 బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మంత్రుల బృందానికి నివేదించారు. మొత్తం 5,424 కేసులలో 4,556 మంది రోగులకు కోవిడ్–19 ఉందని ఆయన పేర్కొన్నారు. వీరిలో గుజరాత్లో 2,165, మహారాష్ట్రలో 1,188, ఉత్తరప్రదేశ్‌లో 663, మధ్యప్రదేశ్‌లో 519, హరియాణాలో 339, ఆంధ్రప్రదేశ్‌లో 248 కేసులు నమోదయ్యాయి. ఈ రోగులలో మొత్తం 55% మందికి డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించామన్నారు. గత వారం బ్లాక్ ఫంగస్‌ను ఎపిడమిక్ యాక్ట్ కింద నోటిఫై చేసి నమోదైన కేసుల వివరాలు తెలియచేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. దీంతో బ్లాక్ ఫంగస్‌ను అనేక రాష్ట్రాల్లో అంటువ్యాధిగా ప్రకటించారు. (చదవండి: బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదు) -
60 వేలకు చేరువలో..
న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఈ వైరస్ వల్ల మరణాలు 2 వేలకు, పాజిటివ్ కేసులు 60 వేలకు చేరువవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు ఒక్కరోజులో 95 మంది కరోనా కాటుతో మృతిచెందారు. కొత్తగా 3,320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటిదాకా మొత్తం మరణాలు 1,981కు, పాజిటివ్ కేసులు 59,662కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసులు 39,834 కాగా, 17,846 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. రికవరీ రేటు 29.91 శాతానికి పెరిగింది. రోజుకు 95 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 95 వేల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటిదాకా 15,25,631 పరీక్షలు నిర్వహించామన్నారు. 332 ప్రభుత్వ, 121 ప్రైవేట్ ల్యాబ్‌ల్లో ఈ టెస్టులు జరుగుతున్నాయని వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి హర్షవర్ధన్ శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని హర్షవర్ధన్ సూచించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం, త్రిపుర మినహా మిగిలిన రాష్ట్రాలు గ్రీన్ జోన్లోనే ఉన్నాయని చెప్పారు. ఏపీ, తెలంగాణకు కేంద్ర బృందాలు! కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత అధికంగా నమోదవుతున్న 10 రాష్ట్రాలకు మరిన్ని బృందాలను పంపించాలని కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. వైద్య నిపుణులు, సీనియర్ అధికారులతో కూడిన ఈ బృందాలు కరోనా వ్యాప్తి నియంత్రణ విషయంలో రాష్ట్రాలకు సహకరిస్తాయి. కేంద్ర బృందాలను గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంపనున్నట్లు ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. మే 3వ తేదీన 20 బృందాలను కరోనా ప్రభావం ఉధృతంగా ఉన్న 20 జిల్లాలకు పంపించినట్లు గుర్తుచేసింది. ► లాక్డౌన్ కారణంగా అబూధబీ, దుబా య్లలో చిక్కుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల్లో ఈ నెల 7న కేరళకు చేరుకున్న 363 మందిలో ఇద్దరికి కోవిడ్–19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. ► సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర బల గాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువైంది. శనివారం కొత్తగా 116 మంది జవాన్లు కరోనా బారినపడ్డారు. దీంతో కేంద్ర పారా మిలటరీ దళాల్లో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 650కి చేరిందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఎస్ఈజెడ్లో పర్యావరణ కాలుష్యంపై ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గురువారం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో భేటీ అయ్యారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో నెలకొన్న స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఎస్ఈజెడ్)లో దాదాపు 40 కంపెనీలు పర్యావరణ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ కాలుష్యం సృష్టిస్తున్నాయంటూ ఆయన ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. ఎస్ఈజెడ్లో దాదాపు 40 కంపెనీలు పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టవలసిన మురుగు నీటిని శుద్ధి చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయనందున అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని అనేక గ్రామాల్లో తాగు నీరు కలుషితంగా మారిపోయిందన్నారు. శుద్ధి చేయని కాలుష్య జలాలను ఆయా కంపెనీలు సముద్రంలోకి విడుదల చేస్తున్నందున సముద్ర జలాలు కూడా కలుషితమై మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్ఈజెడ్లోని కంపెనీల కారణంగా భూగర్భ జలాలు, సముద్ర జలాలు కూడా కలుషితమైపోతూ రైతులు, మత్స్యకారులకు ఎనలేని నష్టాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ సమస్యపై ఎస్ఈజెడ్ పరిసర బాధిత గ్రామాల ప్రజలు అనేకమార్లు ఆందోళనలు చేపట్టారని, తమ గోడు పట్టించుకోవాలంటూ పలుమార్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను కలిసినా సమస్య పరిష్కారం కాలేదని విజయసాయి రెడ్డి తెలిపారు. కాబట్టి తక్షణమే దీనిపై స్పందించి ఎస్ఈజెడ్లో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుని బాధిత గ్రామాల ప్రజలను జల కాలుష్యం బారి నుంచి కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతామన్, హర్ష వర్దన్, ఎస్సీ కమిషన్ చైర్మన్ రాం శంకర్ కఠారియాను ఎంపి విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాధ్ బృందం కలిశారు. విశాఖలోని సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ విశాఖ అచ్యుతాపురం ఎస్ఈజడ్లో వ్యర్ధాల శుద్ది కేంద్రం ఏర్పాటు చేయాలని హర్షవర్ధన్‌కి విజ్ఞప్తి చేశారు. సముద్రంలోకి వదులుతున్న వ్యర్థాల వల్ల మత్స్య సంపద నాశనమవుతోందన్నారు. అలాగే నావల్ బేస్ నిర్మాణం కోసం ఆరుగ్రామాలు ఖాళీ చేయించారని, రాంబిల్ నిర్వాసితులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని రక్షణ శాఖ మంత్రిని కోరారు. దీంతోపాటు ఎస్సీ మహిళను వివస్త్రను చేసిన ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. -
సామాన్యులకు పనికొచ్చే పరిశోధనలు కావాలి
♦ కేంద్ర మంత్రి హర్షవర్దన్ వ్యాఖ్య ♦ సీసీఎంబీ అనెక్స్-2 ప్రారంభం సాక్షి,హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలైతే సామాన్యుల సమస్యలకు చాలా వర కు పరిష్కారాలు లభిస్తాయని కేం ద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం శాఖల మంత్రి హర్షవర్దన్ చెప్పారు. ఈ పథకాలు విజయవంతం చేయడంలో శాస్త్రవేత్తలు కీలకపాత్ర పోషించాలన్నారు. జై జవాన్ జైకిసాన్ నినాదంలో జై విజ్ఞాన్ చేరిందన్నారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) ఏర్పాటు చేసిన సరికొత్త మెడికల్ బయో టెక్నాలజీ కాంప్లెక్స్‌ను కేంద్ర మంత్రులు వై.సుజనా చౌదరి, బండారు దత్తాత్రేయతో కలసి ఆయన ప్రారంభించారు. శనివారం ఆ పరిశోధన కేంద్రాన్ని ఆయన జాతికి అంకింతం చేశారు. సీసీఎంబీకి అనుబంధంగా ఏర్పాటైన ఈ పరిశోధనశాలలో నానోటెక్నాలజీ ల్యాబ్, క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీతోపాటు కామన్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ హబ్‌లు ఉంటాయి. పరిశోధన సంస్థ ఆవరణలో వారు మొక్కలను నాటి నీరు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మెడికల్ బయోటెక్నాలజీ బ్రోచర్‌ను విడుదల చేశారు. కేంద్ర మంత్రి హర్షవర్దన్ మాట్లాడుతూ అత్యాధునిక వసతులతో కూడిన ఇలాంటి పరిశోధనశాలల్లో జరిగే ప్రయోగాలు సామాన్యులకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలు ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. మన శాస్త్రవేత్తలు తలుచుకుంటే శ్రీహరికోటను మరో నాసాలా మార్చగలుగుతారన్నారు. నాసాలో దాదాపుగా 38 శాతం వరకు భారతీయ శాస్త్రవేత్తలే ఉన్నారని పేర్కొన్నారు. మొట్టమొదటి వ్యాధి నిరోధక వ్యాక్సిన్ కనిపెట్టింది సీసీఎంబీ శాస్త్రవేత్తలేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, సీసీఎంబీ డెరైక్టర్ సి.హెచ్.మోహన్‌రావు, సీనియర్ సైంటిస్ట్ అమితాబ్ ఛటోపాధ్యాయ, ఐఐసీటీ డెరైక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. పూర్తిస్థాయిలో వాడుకోవాలి: సుజనా తమ పరిశోధనశాలల్లోని వ్యవస్థలన్నింటినీ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల సహాయ మంత్రి వై.సుజనా చౌదరి సీసీఎంబీకి సూచించారు. మానవాళికి ఉపయోగపడే పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించాలని, అందుబాటులో ఉన్న అత్యాధునిక పరికరాలు, మానవ వనరులను ఆదాయ వనరులుగా మార్చుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్‌లో సీసీఎంబీకి ఎనిమిది రేటింగ్ ఉందన్నారు.