
సామాన్యులకు పనికొచ్చే పరిశోధనలు కావాలి
♦ కేంద్ర మంత్రి హర్షవర్దన్ వ్యాఖ్య
♦ సీసీఎంబీ అనెక్స్-2 ప్రారంభం
సాక్షి,హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలైతే సామాన్యుల సమస్యలకు చాలా వర కు పరిష్కారాలు లభిస్తాయని కేం ద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం శాఖల మంత్రి హర్షవర్దన్ చెప్పారు. ఈ పథకాలు విజయవంతం చేయడంలో శాస్త్రవేత్తలు కీలకపాత్ర పోషించాలన్నారు. జై జవాన్ జైకిసాన్ నినాదంలో జై విజ్ఞాన్ చేరిందన్నారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) ఏర్పాటు చేసిన సరికొత్త మెడికల్ బయో టెక్నాలజీ కాంప్లెక్స్‌ను కేంద్ర మంత్రులు వై.సుజనా చౌదరి, బండారు దత్తాత్రేయతో కలసి ఆయన ప్రారంభించారు.
శనివారం ఆ పరిశోధన కేంద్రాన్ని ఆయన జాతికి అంకింతం చేశారు. సీసీఎంబీకి అనుబంధంగా ఏర్పాటైన ఈ పరిశోధనశాలలో నానోటెక్నాలజీ ల్యాబ్, క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీతోపాటు కామన్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ హబ్‌లు ఉంటాయి. పరిశోధన సంస్థ ఆవరణలో వారు మొక్కలను నాటి నీరు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మెడికల్ బయోటెక్నాలజీ బ్రోచర్‌ను విడుదల చేశారు. కేంద్ర మంత్రి హర్షవర్దన్ మాట్లాడుతూ అత్యాధునిక వసతులతో కూడిన ఇలాంటి పరిశోధనశాలల్లో జరిగే ప్రయోగాలు సామాన్యులకు ఉపయోగపడేలా ఉండాలన్నారు.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలు ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. మన శాస్త్రవేత్తలు తలుచుకుంటే శ్రీహరికోటను మరో నాసాలా మార్చగలుగుతారన్నారు. నాసాలో దాదాపుగా 38 శాతం వరకు భారతీయ శాస్త్రవేత్తలే ఉన్నారని పేర్కొన్నారు. మొట్టమొదటి వ్యాధి నిరోధక వ్యాక్సిన్ కనిపెట్టింది సీసీఎంబీ శాస్త్రవేత్తలేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, సీసీఎంబీ డెరైక్టర్ సి.హెచ్.మోహన్‌రావు, సీనియర్ సైంటిస్ట్ అమితాబ్ ఛటోపాధ్యాయ, ఐఐసీటీ డెరైక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పూర్తిస్థాయిలో వాడుకోవాలి: సుజనా
తమ పరిశోధనశాలల్లోని వ్యవస్థలన్నింటినీ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల సహాయ మంత్రి వై.సుజనా చౌదరి సీసీఎంబీకి సూచించారు. మానవాళికి ఉపయోగపడే పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించాలని, అందుబాటులో ఉన్న అత్యాధునిక పరికరాలు, మానవ వనరులను ఆదాయ వనరులుగా మార్చుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్‌లో సీసీఎంబీకి ఎనిమిది రేటింగ్ ఉందన్నారు.