ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ : బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు భూమి, విద్యుత్, రైల్వే మార్గం, నీటి వసతి, రాయితీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు. కేంద్ర మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్‌ను పార్లమెంటులో కలిస్తే ఆయన ఈ విషయం చెప్పారన్నారు. ఇదే విషయమై తాను మంత్రి కేటీఆర్‌ను సంప్రదిస్తే ఆయన అందుబాటులోకి రాలేదని, తిరిగి ఇంత వరకు తనకు ఫోనే కూడా చేయలేదని చెప్పారు. రాయితీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తే రూ. 15 వేల కోట్లతో బయ్యారం ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. పాల్వంచ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యానికి అప్‌గ్రేడ్ చేసేందుకు కేంద్ర మంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే మెకాన్ సంస్థతో ప్రణాళిక రూపొందిస్తామని కేంద్ర మంత్రి చెప్పారన్నారు.
పీయూష్ గోయెల్‌తో భేటీ..
కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్‌తో దత్తాత్రేయ భేటీ అయ్యారు. కాజీపేట–సికింద్రాబాద్ మూడో రైల్వే లైన్ కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు గోయెల్ తనతో చెప్పారన్నారు. పటాన్‌చెరు–సంగారెడ్డి లైన్ సర్వేకు కేంద్రం అంగీకరించిందని, అలాగే బాన్సు వాడ, దుగ్గల్, నారాయణ్‌ఖేడ్ మీదుగా బోధన్–బీదర్ రైల్వే లైన్ సర్వే పూర్తవుతుందని, రూ.2 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని కేంద్రమంత్రి చెప్పారన్నారు. సికింద్రాబాద్–బికనీర్‌కు వారానికి రెండు సార్లు కాకుండా, ప్రతిరోజూ రైళ్లు నడపాలని కోరానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment