Bayyaram steel factory
-
బయ్యారంపై తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ : బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు భూమి, విద్యుత్, రైల్వే మార్గం, నీటి వసతి, రాయితీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు. కేంద్ర మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్‌ను పార్లమెంటులో కలిస్తే ఆయన ఈ విషయం చెప్పారన్నారు. ఇదే విషయమై తాను మంత్రి కేటీఆర్‌ను సంప్రదిస్తే ఆయన అందుబాటులోకి రాలేదని, తిరిగి ఇంత వరకు తనకు ఫోనే కూడా చేయలేదని చెప్పారు. రాయితీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తే రూ. 15 వేల కోట్లతో బయ్యారం ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. పాల్వంచ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీని 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యానికి అప్‌గ్రేడ్ చేసేందుకు కేంద్ర మంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే మెకాన్ సంస్థతో ప్రణాళిక రూపొందిస్తామని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. పీయూష్ గోయెల్‌తో భేటీ.. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్‌తో దత్తాత్రేయ భేటీ అయ్యారు. కాజీపేట–సికింద్రాబాద్ మూడో రైల్వే లైన్ కేంద్రం పరిశీలనలో ఉన్నట్లు గోయెల్ తనతో చెప్పారన్నారు. పటాన్చెరు–సంగారెడ్డి లైన్ సర్వేకు కేంద్రం అంగీకరించిందని, అలాగే బాన్సు వాడ, దుగ్గల్, నారాయణ్‌ఖేడ్ మీదుగా బోధన్–బీదర్ రైల్వే లైన్ సర్వే పూర్తవుతుందని, రూ.2 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని కేంద్రమంత్రి చెప్పారన్నారు. సికింద్రాబాద్–బికనీర్‌కు వారానికి రెండు సార్లు కాకుండా, ప్రతిరోజూ రైళ్లు నడపాలని కోరానన్నారు. -
‘బయ్యారం’పై గవర్నర్‌కు వినతిపత్రం
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టంలోని హామీలను అనుసరించి ప్రభుత్వపరంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని మంజూరు చేయాలని అఖిలపక్ష నేతలు బుధవారం గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు. బయ్యారంలోని లక్షా 54 వేల ఎకరాల పరిధిలో విస్తరించి ఉన్న ఇనుప ఖనిజాన్ని రక్షణ స్టీల్స్ అనే ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేసిన సందర్భంలోనే ప్రైవేటు కంపెనీలకు ఇవ్వొద్దని, వారికిచ్చిన లీజును రద్దు చేయాలని ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో సీపీఐ డిమాండ్ చేస్తే అన్ని పార్టీలు బలపరచాయని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కింద నాటి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ముంపునకు గురవుతున్నందున ఖమ్మం జిల్లాకు ఉక్కు పరిశ్రమను ఇస్తామని చట్టంలో చేర్చిందని తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని చెప్పడం విభజన హామీలను తుంగలో తొక్కి తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అవుతుందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం రాష్ట్ర ప్రజల ఆకాంక్షగా కేంద్రానికి తెలియజేయాలని కోరారు. గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన వారిలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), ఎల్.రమణ (టీటీడీపీ), ఎం.కోదండరాం (టీజేఎస్), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (టీపీసీసీ), కె.దిలీప్‌కుమార్ (టీజేఎస్), దొమ్మాటి వెంకటేశ్వర్లు (తెలంగాణ ఇంటి పార్టీ), కె.రవిచంద్ర (తెలంగాణ ప్రజాఫ్రంట్), జె.జానకీరాములు (ఆర్ఎస్పీ), సాదినేని వెంకటేశ్వర్రావు (సీపీఐ ఎంఎల్), భూతం వీరన్న (సీసీఐ ఎంఎల్) తదితరులు ఉన్నారు. -
సగం ఖర్చు భరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ : బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని.. దానికి అవసరమైన అన్ని రకాల రాయితీలూ ఇస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే సగం ఖర్చు భరించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని నివేదించారు. దానితోపాటు హైదరాబాద్‌లో ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)’ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధానితో ఈ నెల 15న సీఎం కేసీఆర్ సమావేశమై విభజన చట్టంలో పేర్కొన్న, గతంలో కేంద్రం ప్రకటించిన 10 హామీల అమలుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అందులోని బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐటీఐఆర్ ఏర్పాటుకు సంబంధించి.. రాష్ట్ర మంత్రిత్వ శాఖ ద్వారా మరింత సమాచారం ఇవ్వాలని ప్రధాని సూచించారు. ఈ మేరకు బుధవారం మధ్యా హ్నం ఢిల్లీలో ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన కేటీఆర్.. ఈ రెండు అంశాలపై మరింత సమాచారాన్ని సమర్పించారు. ‘బైలదిల్లా’తో లింకేజీ ఇవ్వండి.. బయ్యారంలో లభించే ఇనుప ఖనిజం నాణ్యత తక్కువగా ఉంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనుల నుంచి ఖనిజాన్ని తరలించి ఉక్కు ఉత్పత్తి చేయవచ్చని ప్రధానికి కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం బైలదిల్లా నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు ఖనిజాన్ని తరలిస్తున్నారని.. అలాంటిది కేవలం 180 కిలోమీటర్ల దూరంలోని బయ్యారానికి సులువుగా తరలించవచ్చని చెప్పారు. బైలదిల్లా నుంచి లింకేజీ ద్వారా బయ్యారంలో స్టీలు ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని నివేదించారు. ఇక్కడ ప్లాంటు ఏర్పాటు వల్ల ఖమ్మం జిల్లా పరిధిలోని గిరిజనులకు 15 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని.. అందువల్ల ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన అన్ని వసతులను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానికి కేటీఆర్ వివరించారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం సగం ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉందని.. సింగరేణి, టీఎస్ఎండీసీ సంస్థల ద్వారా సహకారం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే రైల్వేలైన్ ఫీజిబులిటీ అధ్యయనానికి రూ.2.5 కోట్లు విడుదల చేశామన్నారు. ఐటీఐఆర్ కింద నిధులివ్వండి ఐటీ రంగంలో జాతీయ వృద్ధి 7–8 శాతంగా ఉంటే తెలంగాణలో 9.3 శాతంగా ఉందని.. ఏటా రూ.93,422 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు తెలంగాణ కేంద్రంగా జరుగుతున్నాయని ప్రధానికి కేటీఆర్ వివరించారు. దీనిని మరింతగా ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో ఐటీ అనుబంధ సంస్థల పెట్టుబడుల ఊతమిచ్చేలా గత ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ ద్వారా నిధులు విడుదల చేయాలని కోరారు. సైబరాబాద్, గచ్చిబౌలి, మాదాపుర్, మామిడిపల్లి, రావిర్యాల్, ఆదిభట్ల, మహేశ్వరం, ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో ఐటీ రంగం వృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పనకు ఐటీఐఆర్ తోడ్పడుతుందన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,863 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అంగీకారం కూడా తెలిపిందని వివరించారు. కానీ కొంతకాలంగా ఈ ప్రాజెక్టుపై ప్రతిష్టంభన నెలకొందన్నారు. ఈ అంశంలో సహకరించాలని కోరారు. ప్రధాని సానుకూలం..: కేటీఆర్ బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్‌ల ఏర్పాటుపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రధానితో ఇటీవల సీఎం కేసీఆర్ సమావేశమైన సందర్భంగా.. బయ్యారం, ఐటీఐఆర్‌లపై మరింత సమాచారాన్ని ప్రధాని కోరారని చెప్పారు. ఇలా ప్రధాని తనకుతానుగా ఈ సమాచారాన్ని కోరారు కాబట్టి త్వరలోనే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యూఏఈ రాయబారితో భేటీ.. ఢిల్లీలో ప్రధానితో భేటీ అనంతరం యూఏఈ భారత రాయబారి మహ్మద్ అల్బన్నాతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు పరస్పర అవగాహన ఒప్పందాలకు సంబంధించి చర్చించారు. తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను, ఇతర అంశాలను కేటీఆర్ వివరించారు. -
ఉద్యమ పార్టీ ఎందుకు స్పందించదు?
సాక్షి, హైదరాబాద్ : ఏపీ పునర్విభజన చట్టాన్ని రెండు రాష్ట్రాల్లో అమలు చేయాలని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయనందు వల్లే కోర్టుకు వెళ్లామన్నారు. ప్రతిపక్షం బాధ్యతగా తాము చేయాల్సిందింతా చేస్తున్నామని.. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసమే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశామన్నారు. ఇందుకు ప్రతిగా కేంద్రం వివిధ శాఖల ద్వారా కౌంటర్ దాఖలు చేయిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం తన సొంత ఖర్చుతో కేసుకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహిస్తున్నానన్న ఆయన.. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పొలిటికల్, పర్సనల్ అజెండాతోనే అధికార పార్టీ వ్యవహరిస్తున్నట్లు కనబడుతోందని విమర్శించారు. శ్వేతపత్రం విడుదల చేయాలి.. ఏపీ పునర్విభజన చట్టం కింద తెలంగాణకు ఎంత మేలు జరిగిందనే విషయాలపై శ్వేతప్రతం విడుదల చేయాలని సుధాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధన కోసం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి లక్ష పోస్టు కార్డులు రాసే కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. బయ్యారం గనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతోంటే తెలంగాణ, ఆంధ్ర పరిస్థితులు వేరంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. -
మెకాన్ నివేదికను ఎందుకు బయటపెట్టరు?
సాక్షి, అమరావతి : కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు బాధాకరమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో సెయిల్ అందించిన పాత నివేదికను సమర్పించడం ద్వారా కేంద్రం మరోసారి తన నైజాన్ని బయటపెట్టిందని విమర్శించారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండబట్టే కేంద్రం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందన్నారు. అనంతపురం జిల్లాలో 135 మిలియన్ టన్నులు ఐరన్ ఉండగా.. ప్రకాశం జిల్లాలో మరికొన్ని గనులు ఉన్నాయని.. వీటన్నింటిని కడప స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తామని ఇదివరకే మెకాన్ సంస్థకు, టాస్క్ ఫోర్స్‌కు తెలియజేసామని ఆయన స్పష్టం చేశారు. మికాన్ సంస్థకు రాష్ట్రం అందిస్తోన్న ప్రోత్సాహకాలను కూడా తెలియజేశామన్నారు. అయినప్పటికీ కేంద్ర మెకాన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రాలో తగినంత ఐరన్ ఉండగా.. ఉక్కు పరిశ్రమ విషయంలో తెలంగాణతో ఆంధ్రను ముడిపెడుతూ.. కుంటి సాకులు చెప్పడం అర్ధరహితమని ఆయన వ్యాఖ్యానించారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు.. ఉక్కు పరిశ్రమ సాధించుకోవడం కోసం పోరాటం ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. -
విభజన హామీలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు కోరుతూ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం బుధవారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లో ప్రతివాదులైన ఉక్కు శాఖ, ఆదాయపు పన్ను విభాగం ఈ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఏపీలోని వైఎస్సార్ జిల్లా, తెలంగాణలోని బయ్యారంలో స్టీలు ఫ్యాక్టరీల ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తూ విభజన చట్టం అమలులోకి వచ్చిన ఆరు నెలల్లో యోగ్యత నివేదిక ఇవ్వాలని మాత్రమే చట్టం చెప్పిందని, ఆయా ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుకూలత లేదని సెయిల్ నివేదిక ఇచ్చిందని ఉక్కు శాఖ పేర్కొంది. తదుపరి 2016లో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైందని వివరించింది. 2017 డిసెంబర్ 12న ఈ కమిటీ చివరిసారిగా సమావేశమైందని, యోగ్యతపై అధ్యయనం చేస్తున్న మెకాన్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమాచారాన్ని పంచుకోవాలని కమిటీ సూచించిందని వివరించింది. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పన్ను రాయితీల విషయంలో అదనపు డిప్రిసియేషన్‌ను సాధారణంగా ఇచ్చే 20 శాతానికి అదనంగా మరో 15 శాతం ప్రకటించామని, అలాగే అదనపు పెట్టుబడి భత్యం కింద 15 శాతం ప్రకటించామని ఆదాయపు పన్ను శాఖ తన అఫిడవిట్లో పేర్కొంది. -
‘బయ్యారం ఉక్కుపై కేంద్రం నాన్చుతోంది’
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి అవలంభిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్తగూడెంలో స్కిల్ డెవలప్‌సెంటర్, ఆరోగ్య లక్ష్మీ కేంద్రాలను మంగళవారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం పార్లమెంట్లో పోరాడుతున్నామన్నారు. ఇనుము లేని విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టిన ప్రభుత్వం, బయ్యారంలో ఎందుకు పెట్టడంలేదని నిలదీస్తున్నా స్పందించడం లేదని మండిపడ్డారు. కేంద్రం ముందుకు రాకపోయినా సింగరేణి, టీఎస్ఎండీసీ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. రూ. 100 కోట్లతో భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. -
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కట్టి తీరుతాం
► శాసనసభ స్వల్పకాలిక చర్చలో కేటీఆర్ ► అవసరమైతే ఛత్తీస్‌గఢ్ నుంచీ ఇనుప ఖనిజం తీసుకుంటాం ► బిల్ట్, సిర్పూర్ పేపర్ మిల్లులను పరిరక్షిస్తాం.. ► టీఎస్–ఐపాస్ ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది ► నూతన పరిశ్రమలతో 1.95 లక్షల మందికి ఉపాధి ► అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ క్యాబిన్ మన దగ్గరే తయారవుతోందని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా బయ్యారంలో ఇనుము–ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఇనుప గనులు కూడా తీసుకుని బయ్యారం పరిశ్రమకు అనుసంధానం చేస్తామని తెలిపారు. బయ్యారంలో ఇప్పటికే అధ్యయనం చేసిన జీఎస్ఐ.. అక్కడ తక్కువ నాణ్యత ఉన్న ఇనుప ఖనిజ నిక్షేపాలున్నట్లు నిర్ధారించిందని చెప్పారు. అది కూడా 200 ఎంటీసీలోపే నాణ్యత ఉందని, పరిశ్రమ నెలకొల్పడానికి కనీసం 300 ఎంటీసీ ఉండాలని.. ఈ వ్యత్యాసాన్ని పూడ్చి, పరిశ్రమ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. సోమవారం శాసనసభలో టీఎస్–ఐపాస్, సులభతర–సరళీకృత వ్యాపార విధానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జానారెడ్డి, కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సంపత్, సండ్ర వెంకటవీరయ్య, అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. బిల్ట్, సిర్పూర్ పేపర్ మిల్లులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. నూతన పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను ఈ పరిశ్రమలకు కూడా ఇచ్చి కాపాడుకుంటామన్నారు. బిల్ట్ పరిశ్రమ నుంచి వచ్చిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవటంతో సమస్య ఏర్పడిందని.. ఆ ఉత్పత్తులను ఐటీసీ ద్వారా విక్రయించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. లక్షల మందికి ఉపాధి టీఎస్–ఐపాస్ ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోందని, తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికవేత్తల విశ్వాసం పొందటంతో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఐదు సంస్థల్లో నాలుగు సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. గత ప్రభుత్వాలు రెడ్‌టేపిజంతో పారిశ్రామికవేత్తలను ఇబ్బందులకు గురి చేస్తే.. తాము రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నామని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే హెలికాçప్టర్ క్యాబిన్ కూడా హైదరాబాద్‌లోనే తయారవుతోందని, సికార్స్కి అనే సంస్థ దీన్ని రూపొందిస్తోందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పటివరకు 2,929 పరిశ్రమలకు అనుమతులిచ్చామని, రూ. 49.46 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఇప్పటివరకు 1,138 యూనిట్లు వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాయని, మరో 405 యూనిట్లు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయని... ఈ పరిశ్రమల ద్వారా 1.95 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో మూడు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక రాష్ట్రం ఉత్పత్తి చేసే పత్తికి దేశంలోనే నంబర్ వన్‌గా గుర్తింపు ఉందని చెప్పారు. ఏటా రాష్ట్రంలో 60 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తవుతుంటే, ఇక్కడ కేవలం 10 లక్షల బేళ్లను మాత్రమే వినియోగించుకుంటున్నామని... భవిష్యత్తులో మన పత్తిని మనమే వినియోగించుకుని, వస్త్రాలు రూపొందించేలా 2 వేల ఎకరాల్లో మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అందులో స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులతో పాటు టెక్స్టైల్ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో డ్రైపోర్టుల నిర్మాణం చేపడుతున్నామని కేటీఆర్ చెప్పారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాలను గుర్తించారని, వాటిలో ఒకదానిని ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.