
సాక్షి, అమరావతి : కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు బాధాకరమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో సెయిల్ అందించిన పాత నివేదికను సమర్పించడం ద్వారా కేంద్రం మరోసారి తన నైజాన్ని బయటపెట్టిందని విమర్శించారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండబట్టే కేంద్రం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందన్నారు.
అనంతపురం జిల్లాలో 135 మిలియన్ టన్నులు ఐరన్ ఉండగా.. ప్రకాశం జిల్లాలో మరికొన్ని గనులు ఉన్నాయని.. వీటన్నింటిని కడప స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తామని ఇదివరకే మెకాన్ సంస్థకు, టాస్క్ ఫోర్స్‌కు తెలియజేసామని ఆయన స్పష్టం చేశారు. మికాన్ సంస్థకు రాష్ట్రం అందిస్తోన్న ప్రోత్సాహకాలను కూడా తెలియజేశామన్నారు. అయినప్పటికీ కేంద్ర మెకాన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రాలో తగినంత ఐరన్ ఉండగా.. ఉక్కు పరిశ్రమ విషయంలో తెలంగాణతో ఆంధ్రను ముడిపెడుతూ.. కుంటి సాకులు చెప్పడం అర్ధరహితమని ఆయన వ్యాఖ్యానించారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు.. ఉక్కు పరిశ్రమ సాధించుకోవడం కోసం పోరాటం ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు.