సాక్షి ప్రతినిధి, కడప: కడపకు ఉక్కు పరిశ్రమ తెచ్చే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఉక్కు పరిశ్రమ కోసం నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం కడపకు వచ్చిన ముఖ్యమంత్రి రమేష్ దీక్షకు సంఘీభావం ప్రకటించి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిమ్మరసం ఇచ్చిన ఆయన దీక్షను విరమింపజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతోం దని మండిపడ్డారు. 6 నెలల్లో పరిశీలించి ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని విభజన చట్టంలో ఆదేశాలున్నా యన్నారు. ఇప్పుడేమో ఫీజుబులిటీ లేదంటూ కేంద్ర ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని ధ్వజమెత్తారు.
కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు భూమి, నీరు, ఐరన్‌వోర్ ఇలా అన్నీ తగినన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. ముద్దనూరులో థర్మల్ పవర్ ఫ్లాంట్, 15 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి, కృష్ణపట్నం పోర్టు చేరుకునేందుకు 15కిలోమీటర్ల దూరంలోనే రైల్వేలైన్ ఉందన్నారు. ఇన్ని వసతులున్న ఈ ప్రాంతం కాకుండా ఏ ప్రాంతం అనుకూలమైనదో చూపాలని సీఎం సవాల్ చేశారు. కేంద్రం దిగిరాకపోతే దించుతామని సీఎం హెచ్చరించారు. కేంద్రం అహంభావంతో ఉందని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రాయలసీమ, ఉత్తరాంధ్ర పరిధిలోని 7 జిల్లాలకు రూ.50కోట్లు నిధులు కేటాయించి కూడా వెనక్కి తీసుకుందన్నారు. వెనుకబడిన జిల్లా ఉన్నతి కోసం ఉక్కు పరిశ్రమ ఎందుకు స్థాపించరని సిఎం నిలదీశారు.
కేంద్రం నాటకాలు ఆడుతోంది....
రెండేళ్లల్లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని ఇటీవల గాలి జనార్దన్‌రెడ్డి ప్రటించారని, గతంలో ఆయన ఉక్కు ఫ్యాక్టరీ ముసుగులో దోపిడీకి పాల్పడ్డారని సీఎం ఆరోపించారు. బీజేపీ నాటకాలు ఆడుతోందని, ఇంతకాలం సెయిల్ నేతృత్వంలో ఫ్యాక్టరీ పెడితే గాలి జనార్దన్‌రెడ్డికి డబ్బులు రావనే పక్కదారి పట్టించారని ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీలు నిన్ననే బంద్ చేశాయని, వారు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. కేంద్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పవన్‌కళ్యాణ్‌ను పక్కన పెట్టుకొని నాటకాలు ఆడుతోందని పేర్కొన్నారు. వెంకటేశ్వరస్వామితో ఆడుకుంటారు, నగలన్నీ లెక్కల ప్రకారం ఉన్నాయంటే పింక్ డైమెండ్ లేదంటారు. పూజారీతో చెప్పిస్తారు.. దానికి జగన్‌మోహన్‌రెడ్డి, పవన్‌కళ్యాణ్ వంతపాడుతారని సీఎం ఆరోపించారు.
25 ఎంపీ సీట్లు అప్పగించండి....
రాష్ట్రంలోని మొత్తం 25 ఎంపీ సీట్లను అప్పగించండి.. బీజేపీ ఎందుకు దిగిరాదో చూద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని స్థానాలు వస్తే కేంద్రంలో మన ప్రభుత్వమే వస్తుందని, లేదన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మనకే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. జిల్లాను ఆదుకోవాలని ప్రత్యేక శ్రద్ద పెట్టానని, కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీరు ఇస్తానని చెప్పి మాట నిలుపుకున్నానని వెల్లడించారు.
ఉక్కు ఫాక్టరీకి అన్నీ సమకూర్చుతాం
కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నా.. ఉక్కు పరిశ్రమపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోండి.. మీరు ఫ్యాక్టరీ పెడతామంటే సహకరిస్తాం. కావాల్సిన భూ వసతులు సమకూరుస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. లేదంటే 50:50శాతం వాటాతో నిర్మించేందుకు తాము సిద్ధమన్నారు. మరోమార్గం కూడా ఉందని, అదే మనకు మనమే స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు చేసుకోవడమన్నారు. అయితే దీనికి మేజర్ మినరల్స్ నిబంధనలు అడ్డుగా నిలుస్తున్నాయన్నారు. వాటిని సవరించాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వమేనని సీఎం తెలిపారు.
అనంతరం రమేష్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరవింపజేశారు. ఆయనతో పాటు దీక్ష చేపట్టిన ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆస్పత్రిలో నాలుగు రోజులుగా దీక్ష కొనసాగిస్తున్నారని, ఆయనను కూడా విరమింపజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కాగా గత నెల 26న పోలీసులు బీటెక్ రవి దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించగా ఆయన ఇప్పటికీ దీక్షలో ఉన్నట్లు సీఎం ప్రకటించడంతో అంతా విస్తుపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్, ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, ఎమ్మెల్యేలు జయరాములు, మేడా మల్లికార్జునరెడ్డి, శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘ఉక్కు’ బాధ్యత నాదే
Published Sun, Jul 1 2018 4:33 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment